విద్యుత్ బిల్లులు తప్పనిసరిగా చెల్లించాలి..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సెస్ అభివృద్దికి సహకరించాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. శనివారం తంగళ్లపల్లి మండలంలోని కస్బెకట్కూర్ గ్రామంలో రూ.2 లక్షల 50వేలతో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వర్షాల వల్ల చెడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతనంగా 7 విద్యుత్ స్తంబాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
రైతులు కంపెనీ మోటార్లను మాత్రమే వాడాలని, ఆటో మేటిక్ స్టార్టర్లను తొలగించాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని కోరారు. ప్రతి బుధవారం తంగళ్లపల్లిలోని సెస్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, రైతులకు, వినియోగదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తనను స్వయంగా సంప్రదించవచ్చు అన్నారు.సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. అసిస్టెంట్ హెల్పర్లు రెండు సంవత్సరాలుగా పర్మనెంట్ చేయాలని అడుగుతున్నారని, అది ఆర్సీఎస్ అనుమతితో చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ మధుకర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



