నవతెలంగాణ-హైదరాబాద్: బ్రెజిల్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోను అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ పోలీస్ అధికారులు వెల్లడించారు. రాజధాని బ్రెసిలియాలోని పోలీసు కేంద్ర కార్యాలయానికి బోల్సొనారోను తరలించినట్లు వెల్లడించారు. మరోవైపు ఇదే అంశంపై ఫెడరల్ పోలీసులు స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్న బోల్సొనారో.. 2022 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ ఫలితాలను అంగీకరించేందుకు నిరాకరించారు. ఆ సమయంలో వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పదవిలో కొనసాగేలా తిరుగుబాటు కుట్రకు బోల్సొనారో ప్రణాళికలు రచించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల శిక్ష విధిస్తూ ఈ సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది.


