‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు…’ అంటూ రాక్షసుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, సుమధుర హాసిని సుహాసిని ఓ డ్యూయెట్టేసుకున్నారు. ఆ పాట తెలుగునాట ఇప్పటికీ పాపులర్. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సైతం అదే పాటను గుర్తు చేసుకుంటున్నారు మరో టైపులో. ఓ పదేండ్ల వెనక్కు వెళ్లి చూస్తే కేసీఆర్ జమానాలో వరస ఉప ఎన్నికలు వచ్చాయి. దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్, మునుగోడు… ఇలా ఒకదాని తర్వాత ఒకటి బై ఎలక్షన్‌తో హంగామా నడిచింది. ఆ సందర్భంగా అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మద్యం ఏరులై పారింది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనే విషయాలను పక్కనబెడితే ఆ ఉప ఎన్నికల్లో పెట్టిన ఖర్చుతో ఓ సాగునీటి ప్రాజెక్టునే నిర్మించొచ్చనే చర్చ అప్పట్లో నడిచింది. ఇప్పటి కాంగ్రెస్ హయాంలో సైతం వరసగా బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిన్ననే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది కదా? మళ్లీ బై పోలేంటని మీరు అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.
త్వరలోనే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు ఖాయంగా కనబడుతోంది. ఖైరతాబాద్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్… ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకుని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయటం ద్వారా ‘పార్టీ ఫిరాయింపు’ చట్టానికి అడ్డంగా దొరికిపోయారు. ఇక ఘన్‌పూర్‌లో అక్కడి ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి ‘నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నా.. దేనికీ నేను భయపడను, ఉప ఎన్నిక వస్తే కచ్చితంగా పోటీ చేస్తా…’ అంటూ బాహాటంగానే ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంటే అటు నాగేందరన్న.. ఇటు కడియమన్నా.. ఇద్దరూ బై పోల్‌కు రెడీ అయినట్టేగా…వారితోపాటు మేం కూడా ‘అన్నిటికీ’ రెడీ అంటున్నారు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు…
-బి.వి.యన్.పద్మరాజు
‘అన్నిటికీ’ రెడీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



