Saturday, November 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమూర్తి @ 996

మూర్తి @ 996

- Advertisement -

మూర్తి గారు ఆఫీసు నుండి ఇంటికి వచ్చారు. మూర్తిగారి పూర్తి పేరు సత్యనారాయణ మూర్తి. ఆయనకు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తిగారు అంటే ఎనలేని గౌరవం. సరిగ్గా చెప్పాలంటే ఆ మూర్తి గారు ఈ మూర్తి గారికి స్ఫూర్తి. ఆ మూర్తిగారి వల్ల, ఆయన ప్రారంభించిన ఇన్ఫోసిస్‌ కంపెనీ వల్ల భారతదేశం టెక్నికల్‌గా ఎంతో ముందడుగు వేసిందని ఈ మూర్తి గారు బలంగా నమ్ముతారు. ఆ మూర్తి గారు పలికే ప్రతి వాక్యం వేద వాక్యంలా భావిస్తారు.
గతంలో ఇన్ఫోసిస్‌ మూర్తిగారు 70 గంటల పనిదినం ఉండాలని ప్రకటించినప్పుడు ఈ మూర్తిగారు ఎంతో ఆనందపడ్డారు. బద్దకస్తులు ఉన్న భారతదేశంలో పని సంస్కృతిని పెంచటానికి 70 గంటల పనిదినం ఎంతగానే తోడ్పడుతుందని ఆశపడ్డారు. ఇప్పుడు తాజాగా 72 గంటల పనిదినం ఉండాలని, 996 ఫార్ములా ఉండాలని చెప్పినపుడు ఎంతో ఉత్సాహపడ్డాడు. పడుకునే ముందు ఒక నిర్ణయానికి వచ్చాడు! హాయిగా నిద్రపోయాడు.

పొద్దున్నే అన్ని సిద్ధం చేసుకుని 10 గంటలకు ఆఫీసులోకి అడుగుపెడ్డాడు! ఇంకా ఎవరూ రాలేదు! తన ఛాంబర్‌లోకి వెళ్ళి బెల్‌ కొట్టాడు. అటెండర్‌ వచ్చాడు. అతనికి ఏదో చెప్పాడు.
మరో 5 ని||ల్లో అందరూ తమ బాస్‌ మూర్తి గారి ఛాంబర్‌లోకి వచ్చాడు.
”మీకు ఎవ్వరికీ బాధ్యత లేదు! పని సంస్కృతి తెలియదు. దేశం గురించి ఎవరికీ పట్టింపు లేదు! 8 గంటల పనిదినం వల్ల దేశం సర్వనాశనం అయ్యింది. ఇప్పటికైనా మనం మారుదాం! మార్పు నాతోనే మొదలు పడదాము!”
”మార్పు ఎలా మొదలు పెడతారు సార్‌! ఉత్సాహంగా అడిగాడు చారి! అతడు ఈ మధ్యలోనే ఆఫీసులో ఉద్యోగంలోకి వచ్చాడు. కుర్రాడు చక్కగా పనిచేస్తాడని అందరూ మెచ్చుకుంటారు! మిగతావారు రెండు గంటల్లో చేసే పని చారి ఒక్క గంటలోనే చేస్తాడు.

”ఇన్ఫోసిస్‌ మూర్తి గారు, వారానికి 72 గంటల పని, 996 ఫార్ములా గురించి చెప్పారు! దాన్ని ఈ రోజే మన ఆఫీసులో అమలులోకి తెస్తున్నాం. మూర్తి గారు మనందరికి స్ఫూర్తి! అందుకే ఆయన ఫొటోలు మీ ఫోన్లలో, కంప్యూటర్లలో హౌమ్‌ స్క్రీన్‌గా పెట్టుకోండి. ఆఫీసులో గోడ గడియారం లేపేశాం! మీ ఫోన్లలో మాత్రమే టైము చూసుకోవాలి!” అన్నారు మూర్తి గారు.
”ఈయనో పెద్ద రజనీకాంత్‌! ఆ మూర్తి శాపించాడు! ఈ మూర్తి పాటిస్తాడు” అని గొణిగాడు అటెండర్‌.
”996 ఫార్ములా ఎలా అమలు చేయాలో నేను చూపిస్తాను. మన చారి సీటులో నేను పని చేసి చూపిస్తాను! రేపట్నించి మీరంతా నేను ఎలా పని చేశానో, అదేవిధంగా మీరు పని చేయాలి! ఈ రోజు వరకు మీరు పాత పద్దతిలో పని చేస్తూ, నన్ను పరిశీలించండి! ఓకేనా?” అన్నారు మూర్తిగారు!

మిగిలిన వారు బదులిచ్చేలోపే చారి, ”సార్‌ నన్ను ఉద్యోగం నుండి తీసేయకండి సార్‌! నాకు చాలా బాధ్యతలున్నాయి! నాకు పెళ్ళి కాలేదు! ఇంకా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి!” అంటూ వచ్చి మూర్తి గారి కాళ్ళు పట్టుకున్నాడు.
భయపడకు! చారీ, నేను నీ స్థానంలో పని చేస్తే, నీ ఉద్యోగం పోదు! నీవు నా స్థానంలో ఈ ఆఫీసుకు బాస్‌గా పని చేయి! ఈ ఒక్క రోజే సుమా!” అన్నారు మూర్తిగారు నవ్వుతూ.
చారి కుదుట పడ్డాడు.

”లెట్‌ అజ్‌ స్టార్ట్‌!” ఆన్నారు మూర్తి.
అందరూ ఎవరి సీట్లలోకి వాళ్ళ వెళ్ళిపోయారు! మూర్తి గారు కూడా యధావిధిగా తన ఛాంబర్‌లోకి వెళ్ళబోయి నిబంధన గుర్తొచ్చి, చారి సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన సీట్లో కూర్చోగానే, అది ఓ పక్కకి ఒరిగి పోయింది! దాన్ని ఆక్కడా, ఇక్కడా కదిలించి చూశాడు. ఏం చేసినా సీటు సరికాలేదు! కొత్త పని సంస్కృతిని ప్రారంభించటానికి, ఒరిగిపోయిన సీటు అడ్డుకాదనుకున్నారు! పని ప్రారంభించారు. కాసేపటికి మంచి నీళ్ళు తాగాలన్పించింది! అటూ ఇటూ చూశారు! నీళ్ళు ఆ మూలకి క్యాన్‌లో ఉన్నాయి! అటెండర్‌ని పిలవటానికి బెల్‌ కొట్టబోయాడు బెల్‌ లేదు!
”రాజా” అంటూ అటెండర్‌ని పిలిచాడు. రాజు బాస్‌ ఛాంబర్‌ వద్ద స్టూల్‌ మీద కూర్చుని ఉన్నాడు.

”ఏంటి సార్‌ !’ అన్నాడు రాజు అక్కడి నుండే.
”మంచినీళ్ళు కావాలి!” అన్నారు మూర్తి గారు.
”ఆ మూలకి ఉన్నాయి! వెళ్ళి తాగండి! అయినా మీ బాటిల్‌ మీరు తెచ్చుకోవచ్చు గద సార్‌ !” అన్నాడు రాజు చిరాగ్గా.
”మూర్తిగారు మాట్లాడకుండా వెళ్ళి నీళ్ళు తాగి వచ్చి పని ప్రారంభించారు. కాసేపటికి బాత్రూంకి వెళ్ళాలన్పంచింది! బాత్రూంకి వెళ్ళాడు! బయటకి వచ్చి చూస్తే బయట రాజు నిలబడ్డాడు.
”సార్‌! మీరు బాత్రూంలో 10 ని||లు గడిపారు! ఆ టైము మీరు అదనంగా పని చేయాల్సి ఉంటుందని బాస్‌ చెప్పారు!” అన్నాడు రాజు.
మూర్తిగారికి ఎంతో సంతోషమయ్యింది! పని సంస్కృతి అంటే ఏమిటో ముందు బాస్‌కి అర్థమయ్యిందన్న మాట! అనుకుంటూ తన సీటు వద్దకి వచ్చేసరికి తన టేబుల్‌పైన పదికి పైగా ఫైళ్ళు ఉన్నాయి! మూర్తిగారికి ఉత్సాహం వచ్చింది. వాటిని వెంటనే పూర్తి చేసి పని సంస్కృతి అంటే ఏమిటో మిగిలిన సిబ్బందికి తెలియచేయాలని అనుకున్నాడు. గంటసేపు పని చేసి ఫైళ్ళు క్లియర్‌ చేశాడు. అలసిపోయినట్లన్పించి టీ తాగుదామని లేచాడు!

”ఏమిటి మూర్తిగారు లేచారు!” అంటూ వచ్చాడు చారి అలియాస్‌ బాస్‌.
”టీ తాగి వస్తాను!” అన్నారు మూర్తి గారు,
”పని సంస్కృతితో పాటు, సభ్యత నేర్చుకోండి. మీ వాక్యాలకి ముందూ చివరా సర్‌ అని చేర్చండి!” అంటూ చారి. ఛాంబర్‌లోకి వెళ్ళాడు.
వెంటనే రాజు వచ్చి పేపర్‌ కప్పులో టీ తీసుకొచ్చి మూర్తిగారి టేబుల్‌ మీద పెట్టి ”టీ తాగటానికి బయటకి వెళ్ళద్దన్నారు బాస్‌! టీ తాగుతూనే పని చేయాలన్నారు!” అంటూ వెళ్ళాడు.
చేసేది లేక మూర్తిగారు పని ప్రారంభించారు! ఇంతలో మరో 20 ఫైళ్ళు తీసుకొచ్చి టేబుల్‌ మీద పెట్టాడు రాజు, వాటిని చూడగానే మూర్తి గారికి చిరాకు కలిగింది! కాని పని సంస్కృతి గుర్తుకొచ్చింది! ఫోన్‌లో ఇన్‌ఫోసిస్‌ నారాయణమూర్తి ఫోటో చూసుకొని పని మొదలుపెట్టాడు. అది పూర్తి కానే లేదు! మరో 20 ఫైళ్ళు వచ్చాయి. వాటిని చూడగానే కోపం వచ్చింది! ఫైళ్ళు విసిరికొట్టబోయాడు. కాని తమాయించుకున్నాడు. అటూ ఇటూ చూశాడు. తాను గమనించలేదు కాని భోజనం చేసే టైమయ్యింది! ఫైళ్ళు పక్కకి పెట్టి భోజనానికి లేవబోయాడు. రాజు చిన్న బాక్సు తెచ్చి మూర్తిగారికి ఇచ్చాడు.

”ఈ భోజనం ఇక్కడే తిని, 10 ని||ల్లో పని ప్రారంభించమన్నారు బాస్‌!” అంటూ వెళ్ళబోయాడు రాజు.
మూర్తి గారు రాజుని ఆపి తెరిచిన బాక్స్‌ చూపారు! అందులో ఒక కప్పులో రైస్‌, మరో కప్పులో సాంబార్‌ ఉంది!
”ఇది భోజనమా! కనీసం ఒక కర్రీ కూడా లేదు!” అన్నారు మూర్తిగారు అసహనంగా.
”ఇదే భోజనం. ఇంతే ఉంటుంది! రైస్‌ క్వాంటిటీ పెంచి, కర్రీలు చెట్నీలు పెడితే తినటానికే గంట టైం పడుతుంది. అందుకే సాంబర్‌ తెప్పించారు, గొంతులో జారిపోతుంది!” కానివ్వండి, టైం వేస్ట్‌ చేయకండి!” అంటూ వెళ్ళి పోయాడు.

మూర్తిగారికి ఏం చెప్పాలో తెలియలేదు! మారు మాట్లాడకుండా తినేశాడు. అంతలోనే బాస్‌ వచ్చాడు.
”మీ పక్క సీటులోని వనజ గారి నాన్నగారికి ఆరోగ్యం బాగా లేదు! ఆవిడకి హాఫ్‌ డే లీవు ఇస్తున్నాను. ఆవిడ సీటు వర్క్‌ మీకు అప్పగిస్తున్నాను. కంప్లీట్‌ చేయండి!’ అని బాస్‌ అంటూండగానే రాజు వచ్చి, ఆమె టేబుల్‌ మీదున్న 50 ఫైళ్ళు మూర్తిగారి టేబుల్‌ మీద పెట్టాడు! వాటిని చూడగానే మూర్తిగారి కళ్ళు తిరిగారు.
”ఆవిడ పని నేనెందుకు చేస్తాను సర్‌ !” అన్నారు మూర్తిగారు. బాస్‌ నవ్వాడు.
”మూర్తిగారు, ఇప్పటికే మీకు సగం రోజు రిలీఫ్‌ ఇచ్చాను. 9-9-6 ఫార్ములా ప్రకారం పది మంది పనిచేసే చోట ఐదు మంది సరిపోతారు! కనక వనజ గారి పూర్తి పని ఈ రోజు మీరే చేయాలి. కాని మీరు చెప్పిన పని సంస్కృతి ఆమెకూ అర్థం కావాలి అని మధ్యాహ్నం వెళ్ళమన్నాను. ఐనా మీరేమైనా రాళ్ళు కొడుతున్నారా? మూటలు మోస్తున్నారా? గంటలో మొత్తం ఫైళ్ళు నా ముందుండాలి!” అంటూ వెళ్ళిపోయాడు.

మొదటిసారి 9-9-6- పని సంస్కృతి మీద కోపం వచ్చింది. కాని అది గొప్ప సిద్ధాంతం. దేశానికి ఉపయోగపడే సిద్ధాంతం! పనిని కంటిన్యూ చేశాడు. కాసేపటికి లేచి బాత్‌రూముకి వెళ్ళాడు. అక్కడ రాజు ఉన్నాడు.
”సార్‌! ఇప్పటికి మీరు ఐదుసార్లు వచ్చారు! వచ్చిన ప్రతిసారి 10 ని|| గడుపుతున్నారు. ఈ ఒక్కసారికే పర్మిషన్‌ ఇచ్చారు! దీంతో కలిపి గంట అవుతుంది! దీంతో మొత్తం ఈ రోజు 10 గంటలు పని చేయాల్సి ఉంటుంది!” అన్నాడు రాజు.
బాత్రూంకి వెళ్ళేటం మానేసి, నేరుగా బాస్‌ ఛాంబర్‌కి వెళ్ళారు మూర్తి గారు!
”ఇదేంటి సర్‌! బాత్రూంకి వెళ్తే కూడా టైము లెక్కపెడతారా? మద్యాహ్నం భోజనానికి టైము ఇవ్వలేదు! పక్క సీటు వనజ పని కూడా నాకే చెబుతారా? మీ మీద యూనియన్‌కి లేబర్‌ డిపార్టుమెంటుకి ఫిర్యాదు చేస్తాను!” అన్నారు మూర్తి గారు అప్రయత్నంగా.
”ఏమని ఫిర్యాదు చేస్తారు ?” అడిగాడు బాస్‌.

”8 గంటల పని దినం అమలు చేయాలని!’ అన్నారు మూర్తి గారు.
బాస్‌ పెద్దగా నవ్వారు! అప్పటికే అక్కడికొచ్చిన మిగిలిన స్టాఫ్‌ కూడా ముసిముసిగా నవ్వారు.
”9-9-6 చెప్పటానికి బాగుంటుంది సర్‌! కాని తానే అమలు చేస్తేనే అసలు సంగతి అర్థమవుతుంది! మీరింకా పూర్తి పని దినం చేయలేదు! అపుడే మీరు తిరుగుబాటు ప్రకటించారు! మీ పని అంతా ఆఫీసులోనే చేస్తున్నారు! ఒక ఫ్యాక్టరీలోనో ఒక బగ్గు గనిలోనో ఒక ఆర్టీసీ బస్సులోనో పనిచేస్తే మీరు ఏం చేసేవారో? ఇప్పటికే తక్కువ జీతాలతో, బతుకుతున్నవారి జీవితాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? అలా బతకగలరా? కనీసం అలాంటి బతుకుని ఊహించగలరా? 8-8-8 ఫార్ములాని అన్నీ ఆలోచించే చట్టం చేశారని తెలుసుకోండి!” అంటూ బాస్‌ సీట్లో నుండి లేచి వచ్చాడుచారి!
మూర్తిగారు తలదించుకున్నారు.

  • ఉషాకిరణ్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -