డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి తెలంగాణ కళా పుత్రుడు. తెలుగు తెరపై మూడున్నర దశాబ్దాల పాటు ఆయన నటుడుగా నిర్మాతగా దర్శకుడుగా రచయితగా బహుముఖీనమైన ప్రజ్ఞతో తెలుగు సినిమా రంగాన్ని ప్రభావితం చేసిన తొలి తెలంగాణ ప్రాంతీయుడు.
తెలుగు సినిమా రంగంలో వివిధంగా తెలంగాణ సత్తా చాటిన డాపప ప్రభాకర రెడ్డి 1936 జులై 1న నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి -కౌసల్య దంపతులకు జన్మించారు. నిజానికి సినిమాల్లోకి ప్రవేశించే వాటికి ఆయన జీవితంలో సినిమా అంత కథ జరిగింది. అప్పటి వరకూ సామాజిక చైతన్య కార్యకమాల్లో పాల్గొన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన చదువు తొలుత సూర్యపేటలో జరిగింది. నిజాం వ్యతిరేక పోరాటం చాలా ఉదతంగా జరుగుతున్న రోజులవి. సాహిత్యం, కళల పట్ల మోజు పెంచుకున్న యువకుడైన ఆయన తన కర్తవ్యాన్ని గుర్తెరిగి బుర్రకథల్లో పాత్రధారి అయ్యారు. ”సై సై” అంటూ రౌద్రంగా కళ్లు పెద్దగా చేసి ప్రేక్షకుల రక్తాన్ని ఉడుకెత్తించేవారు. అదే రెడ్డి లోని నటుడిని తొలుత నిద్రలేపింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే ఏదో నాటకంలో అవకాశం వస్తే ఏం మాట్లాడకుండానే వెళ్లి వేషం వేయించుకుని స్టేజీపై మంచి నటననే ప్రదర్శించారు. ఈ అనుభవంతో తనకు నటించడం వచ్చుననే నిర్ణయానికి వచ్చి మనసును మెల్లగా రంగస్థలం వైపు మళ్లించారు. అదే ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పింది. నాటక రంగంలో పనిచేస్తుండగానే ఆయన మనసు సినిమాల వైపు మళ్లింది. ఈ క్రమంలో అతను మెట్రిక్ పాసయ్యారు. అంతటితో చదువు ఆపేసి హాయిగా సినిమాల్లో ప్రయత్నాలు చేద్దాం అని నిర్ణయించుకున్నారు. తనకెలాగూ తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో మంచి ప్రవేశం ఉండటం వల్ల హిందీ, తెలుగు రంగాల్లో గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ, ఎక్కడా అంత సరైన ప్రతిస్పందన రాలేదు. దాంతో హైదరాబాదు వెళ్లి ఇంటర్మీడియట్ లో చేరారు. ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు నాటకాల్లో వేషాలు వేయడం కొనసాగించారు. ఇంటర్ పూర్తవగానే ఎం.బి.బి.ఎస్.లో చేరారు. వైద్య కళాశాలలో అప్పటి దాకా ఆగిపోయిన నాటకాల ప్రదర్శనలు ప్రభాకర రెడ్డి రాకతో మళ్లీ ఊపందుకున్నవి. అప్పటి వరకూ మెడికల్ కాలేజీలో తెలుగు నాటకాలు అంతగా వేసేవారు కారు. ప్రభాకర రెడ్డి చేరిన తర్వాత నాటక పోటీల్లో మెడికల్ కాలేజీ తరపున ప్రధానంగా పాల్గొనడం మొదలైంది. ఆయన ఉత్సాహానికి ప్రొఫెసర్ల ప్రోత్సాహం తోడయ్యింది.వారు పాల్గొన్న ప్రతి పోటీలోనూ ఏదో ఒక బహుమతి ప్రభాకర్ రెడ్డి గెలుచుకు వచ్చేవారు.
ఈ పోటీల పరంపరలో హైదరాబాదులో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ నాటక పోటీల్లో తన బందంతో ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వచ్చిన ప్రముఖ దర్శకులు జి.రామినీడు, తాపీ చాణక్యలు ప్రభాకర రెడ్డి నటనను చూసి ప్రత్యేకంగా అభినందించి తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని మాటిచ్చారు. దీంతో వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది ప్రభాకర రెడ్డికి.

తెలంగాణ నుండి ఒక భిన్నమైన సినిమా తీద్దామని ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి తన మిత్రులతో కలిసి మంజీరా పతాకంపై తీసిన ”చివరకు మిగిలేది” (1960) చిత్రంలో మానసిక వైద్యుడి పాత్ర పోషణతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. యాదచ్ఛికమైన విషయమేమిటంటే ఈ సినిమా దర్శకుడు జి.రామినీడు. కాగా చాలా మందికి తెలియని విషయం వొకటుంది. చివరికి మిగిలేది సినిమా బెంగాలీ చిత్రం ”దీప్ జలా జారు”కు రీమేక్. అందులో కీలకమైన డాక్టర్ పాత్ర వేసింది ప్రసిద్ధ బెంగాలి నటుడు పహాడీ సన్యాల్. ఆ వేషం తెలుగులో వేసింది మన ప్రభాకర రెడ్డి. ‘చివరికి మిగిలేది’ వ్యాపారపరంగా విజయం పొందకపోయినా విమర్శకుల ప్రశంసలందుకున్నది. ప్రభాకర్ రెడ్డి నటన చాలా మందికి నచ్చింది. సావిత్రిని నటిగా మరోమెట్టు పైన నిలబెట్టింది చిత్రం చివరకు మిగిలేది.
‘చివరికి మిగిలేది’ తరువాత వెంటనే ప్రభాకర్ రెడ్డికి మరో సినిమాలో అవకాశం రాలేదు. పెద్ద నటుడినైపోతాననుకున్న మనోడికి ఇదో నిరాశ. ఇక వెళ్లి హైదరాబాదులో ప్రాక్టీసు పెట్టుకుందామని తిరిగివచ్చి ఆ పని చేశారు. కానీ ఇంతలో బి.ఎ. సుబ్బారావు ‘భీష్మ” (1962), హేమాంబరధరరావు ”తండ్రులూ కొడుకులు” (1961) సినిమాల్లో వేషాలిచ్చి వెనక్కి పిలిపించారు. కానీ ఈ రెండు సినిమాల తరువాత మరో వేషం రాలేదు. కానీ ఈ సారి మాత్రం వెనక్కి తిరిగి పోవాలనుకోకుండా ‘ఎలాగూ వచ్చాం… తాడో పేడో తేల్చుకుందాం’ అని కాస్త గట్టిగా ప్రయత్నాలే చేయసాగారు. అవస్థలు పడైనా సరే సినిమాల్లో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలే ఆయనకు 1963లో పి.ఎ.పి. వారి ‘పునర్జన్మ’లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించే అవకాశం వచ్చేలా చేసింది. ‘పునర్జన్మ’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ రెడ్డికి ఆ తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కలుగలేదు.ఆ తరువాత 1970 నాటికి 50 సినిమాల్లో నటించారాయన.
పౌరాణిక జానపదాల్లోనూ…
మళ్లీ నటుడుగా ప్రభాకర రెడ్డి సినిమాల విషయానికి వస్తే ఆయన పౌరాణిక, జానపదాల్లో కూడా నటనకు మంచి అవకాశమున్న వేషాల్లో కనిపించారు. ‘భీష్మ’లో శంతనుడిగా, నర్తనశాల, పాండవ వనవాసం, ‘శ్రీకష్ణ పాండవీయం’ చిత్రాల్లో కర్ణుడిగా, దానవీరశూరకర్ణ. శ్రీమద్విరాటపర్వంలో ధర్మరాజుగా, సరస్వతి శపథంలో బ్రహ్మగా, శ్రీకష్ణావతారంలో బలరాముడుగా జీవించారాయన. ఇక దుష్టమంత్రిగా, సేనానిగా జానపదాల్లో నటించారు. రణభేరి, గండికోట రహస్యం, విక్రమార్క విజయం, కంచుకోట, సింహాసనం వంటివి వాటిలో కొన్ని.
1977-78లో తెలంగాణ చరిత్రనే ప్రధాన కథాంశంగా తయారైన టి.మాధవరావు తీసిన చిల్లర దేవుళ్ళు సినిమాలో గ్రామ దొర పాత్రలో ప్రభాకర రెడ్డి జీవించారు. ఈ చిత్రంలో మహానటి సావిత్రి ఆయన సరసన దొరసానిగా నటించారు. కథానాయకగా ఉమాభారతి, నాటి తెలంగాణ సమాజంలో ఆడబాపగా పిలువబడే దేవదాసి పాత్రలో కాంచన నటించారు. జయాపజయాలు ఎలా ఉన్నా ఈ సినిమా తొలినాటి తెలంగాణ సమాజాన్ని ఆవిష్కరించిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.
అసలు ప్రభాకర రెడ్డి సినిమాల్లోకి రావడమే పెద్ద లక్ష్యంతో వచ్చారు. ఏదో ఉత్సాహంతో సినిమాల్లో నటించేసి తెరపై కనిపించి అక్కడితో తప్తి పడాలని కాదు. తన అభిరుచి మేరకు విభిన్న పాత్రల్లో నటించాలని, నూతన పంథాలో కథలు సమకూర్చుకుని సినిమాలు తీయాలని తీర్మానించుకున్నారు. వీలైతే తాను సైతం దర్శకుడుగా మారి సినిమాలు తీయాలి అనుకున్నారు. దీంట్లో గొప్ప సంగతేమిటంటే ఆయన పైన అనుకున్నవన్నీ చేసి, సాధించి చూపించారు. అయితే అప్పటి వరకు తెలంగాణ వాళ్లు సినిమాల్లో నటించి తప్తి పడటం వద్దే ఆగిపోయారు. కానీ మన ప్రభాకర్ రెడ్డి అక్కడే ఆగిపోకుండా కథా రచయితగా, దర్శక నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు తీశారు.
ప్రభాకర రెడ్డికి తొలిచిత్రం ‘చివరికి మిగిలేది’లో నటిస్తున్నప్పుడే లక్ష్మీదీపక్ తో పరిచయమైంది. ఆ చిత్రానికి అసిస్టెంట్ గా పని చేశారు దీపక్. ఈయన కూడా తెలంగాణ వాడే. హైదరాబాదీ కావడం వల్ల ఇద్దరికి మంచి స్నేహం కుదిరింది. మంచి ప్రతిభ ఉన్న లక్ష్మి దీపక్ ను తానే దర్శకుడగా పరిచయం చేస్తూ తొలిసారిగా నిర్మించిన సినిమా ‘పచ్చని సంసారం’ (1970). కష్ణ వాణిశ్రీ నటించారు. సినిమా హిట్ కావడంతో వీరి కాంబినేషన్లో ఆ తర్వాత మంచి సినిమాలు వచ్చాయి. ఆ తరువాత ప్రభాకర రెడ్డి లక్ష్మీదీపక్ డైరెక్షన్లో ”పండంటి కాపురం” (1972) తీసి పెద్ద విజయం సాధించారు ఎస్వి రంగారావు గుమ్మడి, కష్ణలతో కలిసి నటిస్తూ తీసిన ఈ సినిమా తెలుగు సినిమా కుటుంబ కథా చిత్రాల్లో మైలురాయిగా నిలిచింది. ఇది మొదలు ప్రభాకర్ రెడ్డి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, లక్ష్మీదీపక్ డైరెక్టర్లుగా పేరుపొందారు. మద్రాసులో ప్రభాకర రెడ్డి కనిపించిన చోట మళ్లీ వేరేగా లక్ష్మీదీపక్ ని వెదుక్కునే అవసరమే ఉండేది కాదు ఆ రోజుల్లో.
”పండంటి కాపురం” తరువాత ప్రభాకర రెడ్డి లక్ష్మీదీపక్ డైరెక్షన్లో ‘గాంధీ పుట్టిన దేశం” (1973), ”నాకూ స్వతంత్రం వచ్చింది’ (1975), ‘కార్తిక దీపం’ (1979) వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ప్రభాకర్ రెడ్డి పరిశ్రమలో అడుగుపెట్టిన తరువాత తొలుత అర్ధం చేసుకున్నదేమిటంటే మొదట తన భాషను మార్చుకోవడం. కానీ భాష మార్చుకున్నా తన మూలాలను మరిచిపోలేదు. ఆయన లక్ష్మీదీపక్ తరువాత మరో హైదరాబాద్ డైరెక్టర్ బి.భాస్కరరావును ప్రమోట్ చేయడం ప్రారంభించారు. ‘గహప్రవేశం’ (1982), ‘ధర్మాత్ముడు’, ‘కుంకుమ తిలకం’ (1983) సినిమాలు భాస్కర్ రావు దర్శకత్వంలో నిర్మించారు. ఆ రకంగా తెలుగు సినిమా రంగంలో తెలంగాణ వారిని విధిగా ప్రోత్సహించారాయన. ఇంకా ఆయన ‘పల్లె పిలిచింది’. యువతరం కదిలింది (1980) చిత్రాలు నిర్మించారు. మొత్తం 21 చిత్రాలకు కథలు సమకూర్చి 27 చిత్రాలను నిర్మించిన ప్రభాకర రెడ్డి చిత్రాల్లో మధ్య తరగతి కుటుంబ గాథలు, సామాజిక చైతన్య కథాంశాలే ఉండటం గమనార్హం.

కథా రచయితగా, నిర్మాతగానే గాక ప్రభాకర్రెడ్డి దర్శకుడుగా మరో అడుగు ముందుకు వేసి హీరో కష్ణతో ‘ప్రతిభావంతుడు’ (1986) తీశారు. ప్రయోగాత్మకంగా కష్ణకు అన్ని పాటలూ జేసుదాసుతో పాడించి సక్సెస్ సాధించిన ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్ తో రాజకీయంగా విభేదించి ఆయనకు వ్యతిరేకంగా ”మండలాధీశుడు” (1987), ‘ప్రచండ భారతం’ (1988), ‘గండిపేట రహస్యం’ (1989) సినిమాలు తీసిన ధైర్యశాలి. ఆయన దర్శకత్వంలో చివరగా తయారైన చిత్రం ‘కామ్రేడ్’. ఈ చిత్రంలో కె.జి. సత్యమూర్తి, మాష్టారి పాటలున్నాయి. కానీ సినిమా విడుదల కాలేదు..
ప్రభాకర రెడ్డి నటించిన సినిమాలలో సింహభాగం ప్రతినాయక పాత్రలు వేసినవే ఉన్నా, ఆయన సాత్వికమైన పాత్రల్లో కూడా తనదైన ముద్ర వేశారు. రక్త సంబంధం (1962), బొబ్బిలియుద్ధం (1964) పల్నాటి యుద్ధం, నవరాత్రి (1966), ఉమ్మడి కుటుంబం, రక్త సింధూరం (1967) భలే తమ్ముడు, మాతదేవత (1969), అక్కాచెల్లెలు, రెండు కుటుంబాల కథ (1970), మట్టిలో మాణిక్యం (1971), అమ్మమాట, వండంటి కాపురం (1972), ఒకనారి వంద తుపాకులు (1973), అల్లూరి సీతారామరాజు (1974), తీర్పు (1975), భక్త కన్నప్ప (1976), కల్పన (1977), దేవదాను మళ్లీ పుట్టాడు, యుగపురుషుడు (1978), గోరింటాకు (1979), నకిలీ మనిషి (1980), ముందడుగు (1983), అనుబంధం (1984), హరిశ్చంద్రుడు (1981), ఓ తండ్రి తీర్పు (1985), చిన్నకోడలు (1990) వంటి సుమారు వంద చిత్రాల్లో తండ్రి, తాతగా, మామగా, అన్నగా, స్నేహితుడిగా పాత్రలు పోషించి మెప్పొంచారు.
తన 35 సంవత్సరాల సినీ జీవితంలో 450కి పైగా సినిమాల్లో నటించిన ప్రభాకర రెడ్డి నటునిగా, నిర్మాతగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. ‘పండంటి కాపురం (1972) సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఆవార్డును అందుకోగా, 1980లో ‘యువతరం కదిలింది’ సినిమాకు ఉత్తమ ద్వితీయ చిత్రంగా, ఉత్తమ నటునిగా 1981లో ‘పల్లె పిలిచింది’ సినిమాకు ఉత్తమ నటునిగా ‘గహ ప్రవేశం’ చిత్రానికి ద్వితీయ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘తీర్పు’ (1974) తతీయ ఉత్తమ చిత్రంగా నంది ఆవార్డు అందుకున్నది. పోతే మన ‘ఎన్ కౌంటర్’ శంకర్ ని సినిమా రంగానికి తెచ్చింది డాక్టర్ గారే.
చిత్రపురి నిర్మాత
ప్రభాకర రెడ్డి తెరముందు. తెర వెనుకనే గాకుండా పరిశ్రమలో సినీ కార్మికుల సంక్షేమం కోసం విశేషమైన సేవలందించారు. మద్రాసు నుండి పరిశ్రమ హైదరాబాదుకు తరలివచ్చాక 1991లో ‘ట్విన్ సిటీ క్లబ్బును స్థాపించి పేద కళాకారులకు రూ.500 పెన్షన్ అందజేశారు. ఫిలిం వర్కర్స్ హౌసింగ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ గా సినిమా కళాకారులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. సినీ కార్మికుల కోసం నెలకొల్పిన ఈ చిత్రపురి జిల్లా కాలనీకి ఆయన వ్యక్తిగా శ్రమించడమే గాక సొంత డబ్బుతో ప్రభుత్వం స్థలాన్ని సేకరించి పేద కళాకారులకు నిలువ నీడ కల్పించిన మహనీయుడు. ఆయన నిరంతరం శ్రమించి రూపొందించిన సినీ కార్మికుల చిత్రపురి కాలనీ నేడు సీమాంధ్రకు చెందిన కబ్జా కోరుల చేతుల్లో చిక్కుకొని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ గా మారిపోవడం విచారకరం.
చలన చిత్ర పరిశ్రమ కార్మికుల సమాఖ్య’ నెలకొల్పి ఆ సంస్థ అధ్యక్షునిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కషి చేశారు. పరిశ్రమలో ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే ప్రభాకర రెడ్డి ఎందరో సినీ కార్మికుల ఆనారోగ్యంతో బాధ పడినపుడు వారికి వైద్య సౌకర్యాలు కల్పించడానికి చూపిన చొరవ వారి ప్రాణాలను కాపాడింది. ”డా|| ప్రభాకర రెడ్డి చలన చిత్ర కార్మిక చిత్రపురి” ఆయన పేర వెలిసింది.

ప్రతినాయక నటనా ప్రతిభ
ప్రభాకర్రెడ్డి విలన్ వేషాలతో మెప్పించిన చిత్రాలనేకం ఎన్.టి.ఆర్., కష్ణ, శోభన్‌బాబు, కష్ణంరాజు, చిరంజీవిల వరకు హీరోలను ఢకొీనగలిగిన విలన్ ఆయనే. ప్రతినాయక పాత్రలు వేసిన ఆయన చిత్రాల్లో కొన్ని ఉయ్యాల జంపాల, దొరికితే దొంగలు (1965), బ్రహ్మచారి (1967), ఆత్మీయులు, గండికోట రహస్యం, జగత్ కిలాడీలు, నాటకాల రాయుడు (1969), మారిన మనిషి (1970), మోసగాళ్లకు మోసగాడు, జగత్ జంత్రీలు, మోనగాడొస్తున్నాడు జాగ్రత్త, రామాలయం, జీవిత చక్రం, కూతురు కోడలు (1971), పెత్తందార్లు (1970), కిలాడి బుల్లోడు, పాపం పసివాడు, పిల్లా? పిడుగా? (1972), మాయదారి మల్లిగాడు, నేనూ నా దేశం (1973), సంసార సాగరం, నిప్పులాంటి మనిషి, నిజరూపాలు, భూమి కోసం, అందరూ దొంగలే, దీక్ష, కన్నవారి కలలు (1974), ఎదురులేని మనిషి కథానాయకునికథ, గుణవంతుడు (1975), మహాకవి క్షేత్రయ్య, రామరాజ్యంలో రక్తపాశం (1976), ఖైదికాళీదాను, యమగోల (1977), కటకటాల రుద్రయ్య, కె.డి.నెం.1, సొమ్మొకరిది సోకొకడిది. లాయర్ విశ్వనాథ్ (1978), రంగూన్ రౌడి, యుగంధర్, మండే గుండెలు (1979), శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం, గురు, సర్దార్ పాపారాయుడు, రాముడు పరశురాముడు (1980), తోడుదొంగలు, సత్యం శివం, పార్వతీ పరమేశ్వరులు, కిరాయి రౌడీలు (1981), బొబ్బిలిపులి, నా దేశం, సంఘర్షణ, కలియుగదైవం (1983), అల్లుళ్లొస్తున్నారు జాగ్రత్త, మెరుపుదాడ్ (1984), అగ్ని పర్వతం, బుల్లెట్, కళ్యాణ తిలకం, చట్టంతో పోరాటం (1985), విశ్వనాథ నాయకుడు (1987), అంతిమ తీర్పు, చిన్నోడు పెద్దోడు (1988) తదితర చిత్రాలున్నవి.
ఆ మహానటుడు 1997 నవంబర్ 26వ తన 62వ ఏట కాలం చేశారు.
తెలంగాణ నుండి సినిమాల్లోకి వెళ్లిన వారు సంఖ్యాపరంగా తక్కువగానే ఉంటారు. అలా వెళ్లిన వారిలో పూర్తిస్థాయిలో స్థిరపడిన వారు అరుదుగా కనిపిస్తారు. ఆ అరుదైన వారిలో ఒకరు డాక్టర్ మందడి ప్రభాకర్రెడ్డి. విలక్షణ నటుడిగా ప్రభాకర్రెడ్డి పోషించిన ప్రతినాయక పాత్రలే మనకు ముందుగా గుర్తుకు వస్తాయి. నిజానికి ఆయన సినీ జీవితంలో విలనీ వేషాలకు సమాంతరంగా సాత్వికమైన వేషాలు వేసి గొప్పగా మెప్పించిన సంగతి చాలా మంది దష్టికి పోలేదేమోననిపిస్తుంది. ఇది మాత్రమే కాదు. ప్రభాకర్ రెడ్డి గారు గొప్ప రచయితగా, దర్శక నిర్మాతగా విభిన్నమైన సినిమాలు తీశారు. ఇతర విలన్ పాత్రధారుల కన్నా భిన్నంగా నట జీవితాన్ని గడిపారు. నటన, రచన, దర్శక నిర్మాణం, కార్మిక సంక్షేమం వీటన్నింటి కలబోతే మన ప్రభాకర రెడ్డి సినీ జీవితం.
(26.11.2025 న డా.ప్రభాకర్ రెడ్డి వర్ధంతి)
- హెచ్ రమేష్ బాబు, 7780736386


