చలి కాలం వచ్చేసింది, తీవ్రత కూడా ఉధతంగానే ఉంది. ఈ కాలంలో శరీరం అనేక రుగ్మతలకు గురౌతుంటుందన్నది అందరికి తెలిసిన విషయమే! ముఖ్యంగా చర్మం, చెవి, ముక్కు, గొంతు, శ్వాస నాళాలు, ఉపిరి తిత్తులు, కండరాలు, కీళ్లు, ఇలా పడిపోయే ఉష్ణోగ్రతలు వేటినైనా సమస్యలకు గురిచేయవచ్చు.
చలితో వచ్చే ఆరోగ్య సమస్యలను దష్టిలో పెట్టుకొని, తగు నివారణ చర్యలు అమలు పరిస్తే, చలి మనకు వణుకు పుట్టించకుండా, వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేయగలదు.
శీతాకాలంలో శరీరానికి కలిగే ఇబ్బందులు
చర్మ సమస్యలు: చర్మంపై ఉండే సహజ నూనెలు తగ్గుతాయి. దీంతో చర్మం తేమను కోల్పోయి, ఎండిపోయినట్టుగా అయిపోవడం, పెదవులు తడారిపోవడం, మాయిశ్చరైజర్ల వాడకం అవసరమవ్వడం మొదలౌతుంది.
చలికి కొందరిలో చర్మం తడారిపోవడమే కాకుండా, విపరీతమైన దురదతో కూడిన దద్దుర్లు, చర్మం ఎర్రబడడం వంటి ఎలర్జిక్ స్పందనలు రావచ్చు.
ఎక్జిమా, సోరియాసిస్ వంటి చర్మసమస్యలున్నవారిలో ఆ వ్యాధులు మరింత విజంభించవచ్చు. కాళ్ళ పగుళ్లు, పొడి చర్మంపై గీతలు పడినప్పుడు, ఫంగల్ ఇంఫెక్షన్ల సమస్యలు తలెత్తవచ్చు.
కొందరిలో జుట్టు బిరుసుగా అయిపోవడం/ ఊడడం కూడా జరగవచ్చు.
చెవి సమస్యలు :చెవి మూసుకుపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్, దురదతో పాటు నొప్పి, చీము రావడము వంటి సమస్యలు రావచ్చు.
ప్రొద్దున లేవగానే, తల కదపడమే తరువాయిగా కళ్ళు తిరగడం ప్రధాన లక్షణంగా ఉన్న వెర్టిగో అనే చెవికి సంబంధించిన సమస్య చలికాలంలో తీవ్రమౌతుంది.
శ్వాసలో ఇబ్బంది- ఆయాసం, విపరీతమైన దగ్గు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఈల శబ్దం (రాత్రి పూట పిల్లికూతల వంటివి) రావడం, గురక వంటి ఉబ్బసవ్యాధి లక్షణాలు శీతాకాలంలో తీవ్ర స్థాయి దాలుస్తాయి.
చల్లటి గాలిని పీల్చినప్పుడు, అది శ్వాసనాళాలను సంకోచింప చేస్తుంది. శ్వాసనాళాలు ఉబ్బి, దగ్గు, శ్వాస ఆడకపోవడంవంటి లక్షణాలు వస్తాయి.
ఫ్యాను, ఏసీల ఉపయోగానికి అలవాటుపడిపోయినవారిలో ఈ సమస్యలు త్వరితంగా తీవ్రస్థాయికి చేరుకుంటాయి.
గొంతు-శ్వాసకోశ సంబంధిత వ్యాధులు-ముఖ్యంగా రైనోవైరస్ వంటి వివిధ రకాల వైరల్ ఇంఫెక్షన్ల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం, చలికాలంలోనే విజంభిస్తాయి. కోవిడ్ పండెమిక్ మొదలయ్యింది డిసెంబర్ నెలలోనే!
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఈ వైరస్‌లు సులభంగా వ్యాపిస్తాయి.
ఫ్లూ జ్వరం- న్యుమోనియా: ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్రంగా ఉంటుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు, ఛాతీలో అసౌకర్యం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు ఉంటాయి.
చిన్నపిల్లలు, వద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో ఫ్లూ ఊపిరితిత్తుల గాలి సంచులను (అల్వియోలీ) ప్రభావితం చేస్తుంది. న్యుమోనియాకు దారితీస్తుంది. ఇన్‌ఫెక్షన్ కారణంగా గాలి సంచుల్లో ద్రవం లేదా చీము చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
దీనివల్ల హెచ్చు స్థాయి జ్వరం, దగ్గు, ఛాతీ నొప్పి వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.
చంటి పిల్లల్లో బ్రోన్కియోలైటిస్ అనే తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉత్పన్నమవచ్చు. దీని కారణంగా ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగవచ్చు. ఆకస్మికంగా ప్రమాదస్థాయికి చేరవచ్చు.
కీళ్ల నొప్పులు : వాతావరణ పీడనం తగ్గడం వల్ల, కీళ్లలో గ్రాహకాలు మరింత సున్నితంగా మారతాయి. వాపు, నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి చలికాలంలో రక్త ప్రసరణ తగ్గడంతో కీళ్లు మరింత బిగుసుకొని పోవచ్చు.
సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ (సాడ్)- చలికాలంలో సూర్యకాంతి తక్కువగా లభించడం వల్ల కొందరిలో మానసిక సమస్యలు వస్తాయి. దీనిని సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ అంటారు.
సూర్యరశ్మి తగ్గడం వల్ల మెదడులో సెరటోనిన్ స్థాయిలు పడిపోతాయి. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి.
మెలటోనిన్ ఉత్పత్తి పెరగడం వల్ల నిద్ర ఎక్కువ వస్తుంది.
శీతాకాల ఆరోగ్య సమస్యలను అదుపులో పెట్టడం
చలి వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నివారించే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పిల్లలు- వద్ధులు- అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
శరీరంలోని వేడి ఎక్కువగా చేతులు, కాళ్లు, చెవుల ద్వారా బయటకు పోతుంది కాబట్టి, బయటకు వెళ్లేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు వెచ్చదనాన్నిచ్చే వస్త్రధారణ చాల ముఖ్యం. ఉన్ని టోపీలు, చేతి గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించడం మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు ఉన్ని/ సింథటిక్ దుస్తులు, స్వెట్టర్లు, మఫ్లర్లు, సాక్సు, షూస్ తప్పనిసరి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లల్ని, వద్ధుల్ని, అనారోగ్యంతో ఉన్నవారిని చలిబారిన పడకుండా చెవుల్ని, ముక్కుని సున్నితంగా కప్పేటట్టు సరైన దుస్తులు ధరించేలా చూసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఉన్ని/ సింథటిక్ దుస్తులు, స్వెట్టర్లు, మఫ్లర్లు, కాళ్లకు సాక్సు వేసుకోవచ్చు.
వ్యాయామం తప్పనిసరి : శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి రోజూ కనీసం అరగంట పాటు వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.
ఆహారంలో మార్పులు : ఐస్ క్రీం వంటి ఫ్రిడ్జిలో పెట్టిన ఆహారపదార్థాలను తినకుండా ఉంటే మేలు. వెచ్చని నీరు తాగాలి. వేడిగా, తాజాగా వండిన సమతుల్యమైన, నాణ్యమైన, పుష్టికరమైన ఆహారాన్నేతినాలి. నిల్వ ఉంచిన పదార్థాలకు దూరంగా ఉండాలి. పాలు, గుడ్లు, ఆకుకూరలు, మాంసాహారం, పప్పులు-పొడులు, నెయ్యి వంటివి విరివిగా తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
ఆహార సమతుల్యత/ నాణ్యత పై ఏమాత్రం సందేహమున్నా, విటమిన్లు-కాల్షియమ్-ఖనిజాలతో కూడిన డైటరీ సప్లీమెంట్లు తప్పక వాడాలి.
ఉదయం, రాత్రి వేళల్లో, మంచులో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో, పనిచేసే చోట్లలో శరీరానికి ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి. చల్లని గాలి రాకుండా వెచ్చదనం పాళ్ళు సరిగా పెట్టుకోవాలి.
గోరువెచ్చని నీరు, వేడి పానీయాలు, రోజుకు కనీసం మూడు లీటర్లు తాగాలి. శీతల పానీయాలు ఖచ్చితంగా నివారించాలి.
తేనె, కలబంద, మాయిశ్చరైజర్ల వాడకంతో చర్మాన్ని, కొబ్బరి/ ఆల్మండ్ వంటి నూనెలతో జుట్టును సంరక్షించుకోవచ్చు.
జలుబు, దగ్గు వంటివి వస్తే, వైద్యులను సంప్రదించాలి. గుండె జబ్బులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. రక్త ప్రసరణ తగ్గడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
అదే విధంగా, కీళ్ళనొప్పుల విషయంలో కూడా ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా, వైద్యనిపుణులను సంప్రదించాలి!
చిన్నపాటి జాగ్రత్తలతో శీతాకాలాన్ని మనం ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేయవచ్చు.
డాక్టర్ మీరా,
రిటైర్డ్ ప్రొఫెసర్ అఫ్ మైక్రోబయాలజీ,
ఫీవర్ హాస్పిటల్ /ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్.



