Sunday, November 23, 2025
E-PAPER
Homeప్రత్యేకంహింస లేని సమాజం కోసం…

హింస లేని సమాజం కోసం…

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా మహిళల పైన హింస ఒక సాధారణ అంశంగా రూపుదాల్చింది. పుట్టుక నుండి మరణం వరకు అన్నీ దశల్లోను ఆడవాళ్ళ మీద హింస హద్దులు దాటిపోతోంది. ఈ వాక్యం రాస్తున్న సమయానికి కూడా ఎంతో మంది మహిళలు ఇంటా బయటా ఎక్కడో ఒకచోట ఏదో ఒకరకమైన హింసకు, అకత్యాలకు, అవమానానికి, తీవ్ర దూషణలకి, హత్యలకు గురవుతూ ఉండే ఉంటారు. ఇది అక్షర సత్యం. ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నాం? మనం కాదు స్వయానా ఐక్య రాజ్య సమితి తేల్చిన లెక్కలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.
నవంబర్‌ 25 ను ఐక్యరాజ్య సమితి ‘స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీల పైన జరుగుతున్న హింసా వ్యతిరేక దినం’గా పరిగణిస్తోంది. లైంగికత ఆధారంగా జరుగుతున్న హింసను అరికట్టేందుకు, సమాజంలో అవగాహనా, చైతన్యం కల్పించటానికి ఉద్దేశింపబడ్డ రోజిది.

నేపథ్యం
డొమినికన్‌ రిపబ్లిక్‌లో మీరాబాల్‌ సోదరీమణులుగా పేరొందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆ దేశపు పరిపాలకుని నియంతత్వ పాలనను వ్యతిరేకించినందుకు ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. 1960 నవంబర్‌ 25న ఆ ముగ్గురిని ప్రభుత్వం హత్య చేయించింది.
ఆ అక్కాచెల్లెళ్ళను స్త్రీల హక్కుల పోరాటానికి ప్రతీకలుగా భావిస్తూ, వారి బలిదానం రోజును మహిళలపైన హింసకు వ్యతిరేక దినంగా ప్రటించాలని ఐక్య రాజ్య సమితి 2000 లో తీర్మానించింది. ఈ తీర్మానాన్ని అనుసరించి స్త్రీల పైన జరుగుతున్న శారీరక, మానసిక, లైంగిక, ఆర్ధిక హింసలన్నిటినీ రూపుమాపేందుకు పూనుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 25 ను స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీల పైన జరుగుతున్న హింసా వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.

వర్తమాన పరిస్థితి
ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒక మహిళ తన జీవితకాలంలో ఏదో ఒక రూపంలో లైంగిక హింసకి గురవుతున్నదని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. ప్రతి పది నిమిషాలకు ఒక మహిళ హత్య చేయబడుతోంది. ఒక్క 2021లోనే ప్రపంచవ్యాప్తంగా 45 వేలమంది బాలికలు తమ భాగస్వాముల లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యారు. 16 నుండి 58% మహిళలు, పిల్లలు డిజిటల్‌ హింసకు లోనవుతున్నారు. 90-95% డీప్‌ ఫేక్‌ వీడియోలు మహిళలను నగంగా చూపిస్తున్నాయి. ఇవి ప్రపంచ గణాంకాలు.
మన భారతదేశం విషయానికి వస్తే 2025 సెప్టెంబర్‌ చివరి వారంలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (చీజ=దీ) భారతదేశంలో 2023 నేరాల నివేదికను విడుదల చేసింది. 2023లో మహిళపైన 4.42 లక్షల నేరాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 7.2% ఎక్కువ. ప్రతి గంటకి 51 ఫిర్యాదులు అందుతున్నాయి. దీని అర్థం ‘సగటున ప్రతి ఐదు సెకన్లకు ఒక నేరం నమోదవుతోంది’.
వీటిల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ఉండగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

గహ హింస :
జాతీయ కుటుంబ సర్వే-5 ప్రకారం దాదాపు 32 శాతం వివాహితలు వారి జీవిత భాగస్వామి చేతిలో శారీరక, లైంగిక, మానసిక హింసకు గురవుతున్నారు. ఇక శారీరక, మానసిక వైకల్యం ఉన్న మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
పిల్లలు పుట్టలేదని, ఆడపిల్లలు పుట్టారని, చెప్పిన మాట వినలేదని, కట్నం తేలేదనే కారణాలతో కుటుంబ సభ్యులతో కలిసి భార్యని హింసిస్తున్న కేసులు సర్వసాధారణం. భర్త భార్యని కొట్టటం మన దేశంలో అతి సహజమైన చర్య. ఈ అంశం మీదనే హిందీలో ‘తప్పడ్‌’ వంటి ఆలోచింప చేసే సినిమాలు వచ్చాయి. ప్రేక్షకాదరణ పొందాయి
కుటుంబ హింస నేరాలు ఈ కాలంలో కొత్త రూపాలు తీసుకుంటున్నాయి. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. భార్య విడాకులు కోరిందని, పుట్టింటికి వెళ్లిందని, వివాహేతర సంబంధం ఉందని, లేదా వివాహేతర కార్యకలాపాలకు అడ్డోస్తున్నారని అంతం చూస్తున్నారు. భార్య సమ్మతి లేకుండా ఆమెతో లైంగిక చర్యకు పాల్పడటం నేరం కిందికి రాదని స్వయంగా హైకోర్టు జడ్జిగారే తీర్పు చెప్పడం అశ్చర్యపరిచే విషయం.
వీటితో పాటు తండ్రి, తోబుట్టువులే వావివరుసలు లేకుండా బాలికల పైన, మహిళల పైన లైంగికదాడికి పాల్పడుతున్న సంఘటనలు కూడా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. పోక్సో కేసుల్లో అనేకం ఇటువంటివే. దగ్గరి బంధువులు, పరిచయస్తుల నుండి ఏదో రూపంలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారనేది అనేక సర్వేల్లో తేలింది. ఆస్థి తగాదాల కారణంగా తల్లుల్ని, అక్కాచెల్లెళ్ళని అలవోకగా చంపేస్తున్నారు. లేదా ఇంట్లోంచి వెళ్లగొడుతున్నారు.
మహిళలు పోరాడి సాధించుకున్న గహ హింస నిరోధక చట్టం 2005 అమలు ప్రశ్నర్ధకంగా మారింది. తప్పుడు కేసుల పేరుతో న్యాయం జరగాల్సిన వారికి అన్యాయం చేస్తున్నారు.
ప్రేమ పేరుతో ఆడవాళ్ళని మానసికంగా ఒత్తిడి చెయ్యటం మానసిక/ భావొద్వేగ హింసలో భాగం. ప్రేమిస్తే ఆమె మీద సర్వ హక్కులు ఉన్నాయని భావించటం పరిపాటిగా మారింది. వెంటపడటం, వేధించటం, ఆసిడ్‌ దాడులు, సామూహిక అత్యాచారాలు ఇవన్నీ పురుషాధిక్య సమాజం లోని ప్రాధమిక లక్షణాలు.
తెలుగులో వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’, హిందీలో వచ్చిన ‘యానిమల్‌’ సినిమాలో అదే చూపించారు. మగవాడికి కోపమొస్తే భరించాలి. ప్రేమిస్తే ప్రతిస్పందించాలి అనే సందేశాన్నిచ్చాయి. అయితే అశ్చర్యకరంగా ఈ రెండూ సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా టీనేజర్లు ఈ సినిమాలకు నీరాజనం పట్టారు. అంటే స్త్రీలను హింసించటం ఈ తరానికి ఒక సాధారణ అంశంలాగా కనిపిస్తోందా? ఇది కలవర పెట్టే అంశం.

పరువు – ప్రతిష్ట
ఇంటి పరువు నిలబెట్టడం ఈ సమాజంలో ఆడవాళ్ల బాధ్యత. ఈ నేపథ్యంలో స్త్రీలు ఎదుర్కొంటున్న మరొక తీవ్రమైన అంశం కుల, మత దురహంకార హత్యలు. కులాంతర మతాంతర వివాహం చేసుకున్న ఘటనల్లో కుటుంబ పరువును కాపాడుకునేందుకు పుట్టింటివాళ్ళు, అత్తింటివాళ్లు కూడా అమ్మాయిని లేదా ఆమె భర్తను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. చివరికి అమ్మాయి అన్నదమ్ములు కూడా ఆమె ప్రేమించిన అబ్బాయి కులం తక్కువని, సరి జోడీ కాదనే కారణాలతో హత్యానేరాలకు తెగబడుతున్నారు. 2024 డిసెంబర్‌ 2 న తెలంగాణాలో రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగమణి అనే సబ్‌ ఇన్స్పెక్టర్‌ దళితుణ్ణి వివాహం చేసుకుందని ఆమె తమ్ముడు నడిరోడ్డు మీద ఆమెను చంపేశాడు. ఎంతో అభివద్ధి చెందామనుకుంటున్న మన దేశంలో ఆడదాని ప్రాణం కన్నా కులం, మతం, కుటుంబ పరువుకే విలువ ఎక్కువని ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్నాయి.

సామాజిక హింస:
కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ‘ధర్మస్థల’ ఇటీవల వార్తల్లో నిలిచింది. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఒక విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
2024 లో మణిపూర్లో ఒక తెగకు చెందిన మహిళలను నడివీధుల్లో నగంగా ఊరేగించారు. లైంగికదాడి చేశారు. చంపేశారు. రాజకీయ నాయకుల వికత క్రీడకు వారిని బలి చేశారు. ఈ చర్య ద్వారా తమకు ఎదురు తిరిగితే అందరికి ఇదే గతి పడుతుందని ఒక హెచ్చరిక చేశారు.
మనదేశంలో ఆశారామ్‌ లు, డేరా బాబాల పేరిట, ఆశ్రమాల ముసుగులో మహిళల మీద జరుగుతున్న కిరాతకాలు బహిరంగ రహస్యాలు. ఆయా ప్రభుత్వాలే ఈ కరుడుగట్టిన నేరగాళ్ళకు అండగా నిలుస్తున్నాయి. ప్రతిఫలంగా తమ రాజకీయాలకు వారిని వనరుగా వినియోగిస్తున్నాయి.

రక్షణ లేని పని ప్రదేశాలు :
28 మే 2023 భారతీయ క్రీడల చరిత్రలో చీకటి రోజు! దేశానికి బంగారు పతకాలు తెచ్చి దేశగౌరవాన్ని అగ్రభాగాన నిలబెట్టిన ప్రపంచ మహిళా రెజ్లింగ్‌ ఛాంపియన్లను రాజధాని ఢిల్లీ నగరంలో పోలీసులు దౌర్జన్యంగా, అమానవీయంగా రోడ్లపైన ఈడ్చుకుని తీసికెళ్ళి అరెస్టు చేసిన దశ్యాలు మనం చూసాము. వాళ్ళు చేసిన నేరమేంటి?
తమను లైంగికంగా వేధించిన అపర కీచకుడు, రేజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రీజ్భూషణ్‌ శరన్‌ సింగ్‌ ను శిక్షించాలని, తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ నాలుగు నెలల పాటు అనేక రూపాలలో పోరాటం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ప్రభుత్వాన్ని ఏమాత్రం కదిలించలేదు. ఆ మహిళా మల్లయోధులకు న్యాయం జరగలేదు. పైగా దోషులకు క్లీన్‌ చిట్‌ తో పాటు పదవి కూడ తిరిగి లభించింది.
2024 ఆగష్టు 6న కోల్కతాలోని ఆర్జీకర్‌ ఆస్పత్రిలో సీనియర్‌ మహిళా డాక్టర్‌ పైన అత్యంత కిరాతకంగా లైంగికదాడి చేసి హత్య చేశారు. సంవత్సరకాలం దాటిపోయింది కానీ అసలైన దోషులను పట్టుకోనేలేదు.
ఉత్తరఖాండ్‌ రాష్ట్రంలో ఒక రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌ గా పని చేస్తున్న 19 ఏళ్ల అంకితా భండారి 18 సెప్టెంబర్‌ 2022 న డ్యూటీకి వచ్చి కనబడకుండా పోయింది. ఆమె ఆచూకీ తెలియకపోవటంతో తండ్రి స్థానిక రిపోర్టర్‌ సహాయంతో పోలీసులకి ఫిర్యాదు చేసాడు. అంకిత పనిచేస్తున్న రిసార్టు బీజేపీ పార్లమెంట్‌ సభ్యుని కొడుకుది. అతిధులకి ”ప్రత్యేక మర్యాద” చెయ్యాలని ఆమెపైన ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆమె అంగీకరించకపోవటంతో లైంగికదాడి జరిపి హత్య చేశారు. సాక్ష్యాధారాలను బులడోజర్లతో చెరిపేశారు. ఎట్టకేలకు బాధితురాలి తండ్రి పట్టుదల వల్ల మూడేళ్ళ తర్వాత 30 మే 2025న దోషులకు యావజ్జీవ శిక్షపడింది.

22 అక్టోబర్‌ 2025 న మహారాష్ట్రలోని సతారాలో మహిళా రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ను స్థానిక పోలీస్‌ అధికారి భయపెట్టి, బెదిరించి అనేకమార్లు లైంగికదాడికి ఒడిగట్టాడు. ఒక మెడికో లీగల్‌ కేసులో పోస్టుమార్టం రిపోర్టులో అబద్ధాలు రాయమని ఒత్తిడి తేవటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. సుదీర్ఘకాలం తనపై జరిగిన హింసను, దానికి కారకులైన వారి పేర్లను చేతి పైన వ్రాసుకుంది. కేసులో అదే కీలక ఆధారం. కేసు ఇంకా విచారణలో ఉంది.
పని ప్రదేశాల్లో మహిళల పైన జరుగుతున్న హింసకు, వేధింపులకు ఇవి మచ్చు మాత్రమే. ఫిర్యాదు చేయనివి, మరుగున పడిపోయినవి, అధికార బలంతో అణగదొక్కిన కేసులు లక్షల్లో ఉంటాయి. ఉద్యోగం, ఉపాధి కోసం బయటికి వస్తున్న మహిళల్లో 95% మంది ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎక్కువగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాజానికి, కుటుంబానికి భయపడి అనేక మంది తమ పైన జరుగుతున్న వేధింపులను బయటకి చెప్పుకోలేకపోతున్నారని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ చేసిన సర్వేలో వెళ్లడయింది. మహిళా సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, ప్రజా సంఘాల సుదీర్ఘ కషి ఫలితంగా ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013’ వచ్చినప్పటికీ ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యంతో చాలా నామమాత్రంగా అమలవుతోంది.

ఆర్ధిక హింస :
ఆర్ధికంగా హింసని ఎదుర్కొంటున్న వారిలో నిరుపేద, మధ్యతరగతి మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నా తమ ఆదాయం మీద అధికారం లేక, కనీస అవసరాల కోసం కూడా కుటుంబ సభ్యుల పైన ఆధారపడుతున్న వాళ్ళు అనేకం. దీనితో పాటు కుటుంబ నిర్వహణ కోసం మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల దగ్గర అప్పు తీసుకుని, సకాలంలో తీర్చలేని మహిళల పట్ల ఆ కంపెనీల ఏజెంట్లు దుర్భాషాలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ అవమానలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

డిజిటల్‌ (ఆన్లైన్‌) హింస :
మహిళల గౌరవానికి భంగం కలిగించటానికి, హింసించటానికి సాంకేతికతను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక కొత్త పోకడ. మహిళలను కించపరచటానికి వారి ప్రైవేట్‌ ఫోటోలను, వీడియోలను రహస్యంగా చిత్రించి సామాజిక మధ్యమాల్లో ప్రసారం చేస్తామని బెదిరిస్తున్నారు. బలహీనులను, భయస్తులను లొంగదీసుకుని తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారు. సమాజంలో జరుగుతున్న పెడ ధోరణులను ఎండగట్టి, వాస్తవాలను ప్రజలకు చేరుస్తున్న మహిళా జర్నలిస్ట్లు, సామాజిక కార్యకర్తల్ని మానసికంగా, నైతికంగా దెబ్బ తీయటానికి పరమ దుర్మార్గమైన పదజాలంతో వారిపైన దాడికి దిగుతున్నారు. సుల్లి డీల్స్‌ పేరుతో, డీప్‌ ఫేక్‌ మొదలైన ప్లాటుఫారంలను ఉపయోగించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. తాజాగా సింగర్‌ చిన్మయి శ్రీపాద నుద్దేశించి యూట్యూబర్లు తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా తులసి చందు, కడలి తదితర జర్నలిస్టుల మీద తమ అక్కసు వెళ్ళబోసుకోవటం మనం చూసాం.

లక్ష్యం
2030 నాటికి మహిళల, బాలికల సాధికారత, లింగసమానత్వాన్ని సాధించాలని ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివద్ధి లక్ష్యాల్లో ఐదవదిగా పేర్కొంది. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం ప్రజలలో విస్తతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చింది.
ఇందుకు 16రోజుల కార్యాచరణని ప్రకటించింది. ఈ సంవత్సరం ”బాలికలు, మహిళల పైన జరుగుతున్న డిజిటల్‌ హింసను అరికట్టటం కోసం అందరం ఏకమవుదాం” అనే నినాదాన్ని రూపొందించింది. నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 10 మానవ హక్కుల దినం వరకు విస్తత ప్రచారం నిర్వహించాలి.
ఆన్‌లైన్‌ వేధింపులు, ప్రైవేటు ఫోటోలను దుర్వినియోగం చేయటం, అస్లీల చిత్రాలు వీడియోలతో తప్పుడు సమాచారం ప్రచారం చేయటంతో సహా అన్ని కోణాల్లో పెరుగుతున్న డిజిటల్‌ హింస ముప్పును ఈ కాంపెయిన్‌ లో హైలైట్‌ చేయాలి.

పరిష్కారం :
సమాజంలో వేళ్లునుకుని ఉన్న పురుషాదిక్య భావజాలాన్ని అంతం చేయకుండా, సమాజంలో మార్పు జరుగకుండా మహిళల పైన జరుగుతున్న హింసను అరికట్టలేము. డిజిటల్‌ హింసతో పాటు అన్నీ రకాల వివక్షలను అరికట్టెందుకు ముమ్మరంగా ప్రచారం చేయాలి! అందుకు మహిళలు, పురుషులు అందరం ఐక్యంగా సాగాలి.

  • పద్మశ్రీ,
    94900 98687
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -