గొర్రెలను మేతకోసం గోపన్న అడవికి వెళ్తున్న సమయాన ఇంట్లో వున్న కొడుకుతో ”సోమన్నా, ఇప్పుడు బడి సెలవులేగా నాతో పాటు అడవికి రాకూడదూ” అన్నాడు.
”అలాగైతే నేను సెల్‌ఫోన్ తీసుకొని వస్తాను” కొత్తగా కొన్న స్మార్ట్ ఫోనులో వీడియో గేమ్స్ చూస్తూ సోమన్న చెప్పగానే తండ్రి అంగీకరించాడు.
సెల్‌ఫోన్ తీసుకొని తండ్రితో కలసి అడవికి బయలు దేరాడు.
మధ్యాహ్నం తండ్రీకొడుకులు తెచ్చుకొన్న ఆహరం తిన్న తరువాత చెట్టుకింద కూర్చొన్నారు.
సోమన్నకు ‘నాన్నా పులి’ కథ జ్ఞాపకం వచ్చి ఆ కథలలోలాగా అందరినీ మూర్ఖులు చేయాలన్న ఆలోచన కలిగింది. ఊరిలోని ఇద్దరు మిత్రులకు ‘అయ్యో పులి.. కాపాడండి’ అంటూ మెసేజ్ పెట్టాడు.
మెసేజ్ చూసిన ఆ ఇద్దరు పిల్లలు ఊరి వారితో చెప్పారు.
కొంతమంది యువకులు కత్తులు తీసుకొని బయలుదేరారు. వాళ్లందరినీ చూస్తూ ”అబద్దపు మెసేజ్ పెడితే మీరంతా మోసపోయారు” అంటూ నవ్వాడు సోమన్న.
అందరూ కోపంతో తిరిగి వెళ్లిపోయారు. మరికొంత సేపు తరువాత మరో ముగ్గురికి ”అయ్యో పులి.. కాపాడండి” అంటూ మెసేజ్ పెట్టాడు.
వాళ్ళు తమ ఇంటిలోని వారితో చెబితే ”వాడు అబద్దపు మెసేజ్ పెట్టి ఉంటాడు” అన్నారు.
ఆ విషయం గ్రామ పెద్దకు చెప్పారు. సోమన్న నంబరుకు ఫోను చేస్తే ఎత్తక పోవడంతో గ్రామ పెద్దలోనూ అనుమానం వచ్చింది. ఈ సారి యువకులతో కలసి గ్రామ పెద్ద వెళ్లారు.
సోమన్న వారిని చూడగానే ”మీరు నా మెసేజ్ నమ్మడం కోసం మీరు ఫోన్ చేసినా ఎత్తలేదు” అంటూ ఎగురుతూ నవ్వసాగాడు సోమన్న.
గోపన్న కోపంతో కొడుకును కొట్టడానికి వెళ్తుంటే అడ్డుకొని ”వాడికి ఆ శిక్ష వద్దు” అన్నాడు గ్రామ పెద్ద.
”మరేమి శిక్ష విధించాలి” భయపడుతూ అడిగాడు గోపన్న.
”తమాషా కోసం అయినా అబద్దపు మెసేజులు పెట్టకూడదు. ఎప్పటికీ నిజమైన మెసేజులు పెట్టాలి. వాడు చేసిన పనికి ఆ సెల్‌ఫోన్ పగలగొట్టినా తప్పు లేదు. కానీ ఖరీదయిన ఆ సెల్‌ఫోన్ ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది. మనఊరిలో ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చిన వాడికి ఈ సెల్‌ఫోన్ బహుమతిగా ఇవ్వదలచుకొన్నాను” అంటూ ఆ సెల్ ఫోన్ తీసుకొన్నాడు గ్రామపెద్ద.
కొత్తగా కొన్న ఆ స్మార్ట్‌ఫోన్ ను గ్రామపెద్ద తీసుకొని వెళ్తుంటే ‘నేను చెప్పిన అబద్దపు పులి నా సెల్ ఫోనును మింగింది’ బాధగా చూసాడు సోమన్న.
- ఓట్ర ప్రకాష్ రావు, 09787446026



