Sunday, November 23, 2025
E-PAPER
Homeసోపతిచందమామ నాటికల రచయిత్రి 'కిరణ్‌బాల'

చందమామ నాటికల రచయిత్రి ‘కిరణ్‌బాల’

- Advertisement -

బాల సాహిత్యం అనగానే తొలుత గర్తుకు వచ్చేవి బుడిబుడి అడుగుల చిన్నారుల అలరించే గేయాలు, ఆటల పాటలు, అమ్మలు, తాతలు జోకొడుతూ చెప్పే కథలు. ఇవే కాకుండా ఇంకా అనేక రూపాలు, ప్రక్రియల్లో బాలల కోసం సాహిత్యం వస్తోంది. మనల్ని అలరించినట్టే మన నేటి బాలబాలికలను అలరిస్తోంది. తొలి నుండి వస్తున్న వాటిలో బాలల నాటికలు కూడా మనం చూస్తున్నాం. ఇతర ప్రక్రియల్లో వచ్చినట్టు నాటికలు ఎక్కువగా రావడం లేదనేది నిజంగా నిజం కూడా! అప్పుడప్పుడు దీనికి అతీతంగా వస్తున్నాయి కూడా! అలా బాలల కోసం చక్కని నాటికలను రాసిన వారిలో ఇందూరు జిల్లాకు చెందిన ‘కిరణ్‌ బాల’ ఒకరు. కవయిత్రి, రచయిత్రి, బాలల నాటక రచయిత్రియే కాదు, చిన్నారి బాలల కోసం ప్రాథమిక పాఠశాల పుస్తకాలు రాశారు కిరణ్‌బాల.

కిరణ్‌బాలగా మనకు తెలిసిన ఈ ఉపాధ్యాయ రచయిత్రి, కవయిత్రి అసలు పేరు శ్రీమతి జి. ఇందిర. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా నిర్మల్‌లో 17 అక్టోబర్‌, 1960న పుట్టారు. శ్రీమతి జి. ప్రభావతి, రంగారావు వీరి అమ్మానాన్నాలు. జీవన సహచరులు శ్రీ మల్లారెడ్డి స్ఫూర్తితో ఎం,ఎ., ఎం.ఎడ్‌., ఎల్‌.ఎల్‌.బి. వంటి ఉన్నత విద్య అభ్యసించానని చెప్పే వీరు ప్రధానోపాధ్యాయినిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తొలి నుండి కవిత్వం, కథా రచనల పట్ల ఆసక్తి, అభిరుచి కలిగిన కిరణ్‌బాల ‘కానుక’ పేరుతో కథా సంపుటిని తన తొలి రచనగా తెచ్చారు. తరువాత ‘నా కలల ప్రపంచం…’ పేరుతో కవితా సంపుటి ప్రచురించారు. కవయిత్రిగా పలు పోటీలలో పాల్గొన్న కిరణ్‌బాల అవార్డులు, బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు. వాటిలో విజయవాడ సాహిత్య సమాఖ్య ‘శ్రీశ్రీ అవార్డ్‌’, అక్షరయాన్‌ నిర్వహించిన పరమవీర చక్ర కవితల పోటీలో మొదటి బహుమతి అందుకున్నారు. కథా రచయిత్రిగా ఈనాడు పోటీలో ‘అపురూపం’ కథకు ప్రత్యేక బహుమతిని, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ-వ్యవసాయశాఖ కథల పోటీలో ‘రైతుబిడ్డ’ కథకు తృతీయ బహుమతిని అందుకున్నారు. ఆంధ్రభూమి కథల పోటీలో ‘స్వాగతం’ కథ మొదటి పది కథల్లో ఒకటిగా నిలిచింది. ఒక నాటికల రచయిత్రిగా కూడా కిరణ్‌బాల అనేక బహుమతులు గెలుచుకున్నారు. వాటిలో ఆకాశవాణి నాటికల పోటీలో ‘సర్వేజనా సుఖినో భవంతు!’ నాటికకు ప్రథమ బహుమతి, ‘మేమే మంచోళ్ళ’ నాటికకు తెలంగాణ రాష్ట్రస్థాయి జ్యూరీ బహుమతితో పాటు నాటక రచనలో ‘అపురూప పురస్కారం’ అందుకున్నారు కిరణ్‌బాల. అమృతల జీవన సాఫల్య పురస్కారాలు, అపురూప పురస్కారాల సందర్భంగా ప్రచురించే సంచికలకు సహ సంపాదకులుగా ఉండి పలు వ్యాసాలు రాశారు.
బాల సాహితీవేత్తగా, రచయిత్రిగా విజయ పాఠశాలల విద్యార్థుల కోసం సూచనతో ఒకటవ తరగతి, రెండవ తరగతి పాఠ్య పుస్తకాలను రాశారు. ఇందులో పిల్లలు సులభంగా తెలుగు నేర్చుకోవడం కోసం రాసిన పాఠాలు విలువైనవి. ఒత్తులు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు లేని కథలు పిల్లల కోసం రాశారు కిరణ్‌బాల. విజయ సంస్థల అధినేత్రి డా. అమృతలత అడగగా 1995లో బాలల కోసం తొలి నాటిక, తరువాత మరికొన్ని రాసారు ఈమె. వీటిలో కొన్ని రేడియోల ప్రసారం అయ్యాయి. తరువాత వాటిని ‘చందమామ మామే…!’ పేరుతో బాలల నాటికలుగా ప్రచురించారు. ఇది పన్నెండు నాటికల సంపుటి. ‘చీమ కుట్టినట్టయినా లేదా!?, ధర్మ సందేహం, హే పరమాత్మా… ఎక్కడ నీ చిరునామా!?, నన్ను మీ జట్టులో కలుపుకోండి!, స్వర్గంలో ఓరోజు, అందరివాడు, మీ వల్లే హీరో నయ్యాను, చందమామ.. మామే!, … మేమే మంచోళ్ళం!, దొంగల్తో… ఓ రాత్రి, బాబోరు, ఇవేం పేర్లు?, ఇదెక్కడి గోల!?’ ఇందులోని నాటికలు. ఈ పన్నెండు లఘునాటికల్లో హాస్యం, వ్యంగ్యం అదిక్షేపం ప్రధానంగా ఉన్నాయి.
ఈ పన్నెండు నాటికలు అనేక అంశాలను ప్రతిబింబిస్తున్నాయి. కొన్ని మానవ మనస్తత్వాలను, స్వార్థాలు, ఆలోచలను ఎత్తి చూపిస్తే మరికొన్ని కుటుంబ జీవన విలువలతో పాటు వివిధ సందర్భాల్లో ఒకరికొకరు ఎలా దూరం అవుతున్నారో, శత్రువులుగా మారుతున్నారో చెబుతున్నాయి. రచయిత్రి పేర్కొన్నట్టు ఈ పిల్లల నాటికల్లో ఒకటి రెండు సరదాగా రాసినవి కూడా ఉన్నాయి. ఈ పుస్తకానికి శీర్షికగా ఉన్న ‘చందమామ మామే’ నాటికను చూద్దాం. కిరణ్‌బాల 2011లోనే 2099 కి వెళ్ళి భవిష్యత్తు పరిస్థితిని చక్కగా రాశారు. మనిషి ఈ విశ్వంలోని ప్రతిదానిని కబళించి వేస్తున్నాడు. భవిష్యత్తులో చంద్రున్ని, చంద్రమండాలన్ని కూడా కబళిస్తే భూమికి పట్టిన గతే చంద్రునికి కూడా పడుతుందన్నది ఈ నాటికలోని ప్రధానాంశం. ‘చందమామ రావే జాబిల్లి రావే’ అంటూ భవిష్యత్తు తల్లులు పాడుకోవాలంటే చంద్రమండలంలో నిషేదాజ్ఞలు ఉండాలన్నమాట నిజమేనేమో మరి! మీడియా, కుటుంబం, పిల్లలు ఇలా వివిధ అంశాలను ఎన్నుకున్న రచయిత్రి కిరణ్‌బాల సంభాషణల రచన బాగుంది. చదివించేలా ఉండడమే కాక ప్రదర్శించినప్పుడు ఆకర్షించేలా రాయడం ఈమెకు బాగా తెలుసు. బడి గుడి నుండి ఎదిగిన రచయిత్రి కదా మరి. ఈ విశ్రాంత ప్రధానోపాధ్యాయిని పక్షాన మన తెలుగు బాలబాలికలకోసం మరిన్ని చక్కని నాటికలు, ఏకపాత్రలు, కథలు రావాలని కోరుకుంటున్నాను. జయహో! బాల సాహిత్యం!

  • డా|| పత్తిపాక మోహన్‌
    9966229548
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -