మీ ఫ్రీహౌల్డ్ జీవోల వెనుకున్న లక్షల కోట్ల మతలబు ఏంటి?
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి
మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆరోపణలు చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్‌ఎస్ నాయకులు కే తారకరామారావు, టీ హరీశ్‌రావుకు వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికాప్రకటన విడుదల చేశారు. విశ్వసనీ యత లేని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్న రూ.5 లక్షల కోట్ల స్కాం ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవమని స్పష్టం చేశారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడాలనీ, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2023 ఆగస్టులో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఫ్రీహౌల్డ్ జీవోలు19, 20, 21 వెనుక ఉన్న లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. వారిచ్చిన జీవోల ప్రకారం రెగ్యులరైజ్ అయిన భూముల్లో జోన్ మార్పిడికి సంబంధించి విధించిన 50, 30 శాతం చార్జీలతో రాష్ట్ర ఖజానాకు రూ. 4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చేందుకు తాము ప్రయత్నిస్తు న్నామన్నారు. కుంభకోణాలు అలవాటైన బీఆర్‌ఎస్ నేతలకు అందరూ వారిలాగే ఉంటారని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రభుత్వ లీజ్ ల్యాండ్స్‌కు ఫ్రీహౌల్డ్ రైట్స్ ఇచ్చి, 100 – 200 శాతం ఛార్జీలు విధించి మీరు వసూలు చేద్దామనుకున్న రూ.లక్షల కోట్ల సంగతేంటని నిలదీశారు. ప్రభుత్వంతో సంబంధం లేని సీఎం రేవంత్‌రెడ్డి సోదరులపై ఆరోపణలు చేస్తే రాష్ట్ర ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి బయటకు రావాలని హితవు పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా యువతకు ఉద్యోగాలు దక్కకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధా నం చెప్పాలని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తమ ప్రభుత్వం 9,292 ఎకరాలు అమ్మకానికి పెట్టిందంటూ చేస్తూ ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు. ఈ భూముల్లో పరిశ్రమ లకు ప్లాటింగ్ చేసిన ఏరియా లేదా ఫ్రీ హౌల్డ్ ప్రాపర్టీస్ కేవలం 4,740 ఎకరాలేనని, ఇవి పూర్తిగా ప్రయివేట్ వ్యక్తులకు చెందిన భూములేనని స్పష్టంచేశారు. మిగిలిన భూములు రోడ్లు, డ్రెయినేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతలు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.



