పిల్లల కథలు, కవితలు, గేయాలు, పెద్దల కోసం కథలు, సాహిత్య వ్యాసాలు, కవర్ స్టోరీలు, ఫ్యాషన్ సంబంధమైన అనేక వ్యాసాలు రాసిన సింహాద్రి నాగ శిరీష సాహిత్య లోకంలో చిరపరిచితులు. గతంలో వెలువరించిన మొదటి గేయసంపుటి’ సిరి జల్లు’ తో బాలల లోకంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది మలి గేయ సంపుటి. ఈ ‘విరి జల్లు’ గేయసంపుటిలో మొత్తం 42 గేయాలు ఉన్నాయి. అన్ని గేయాలూ లలిత లలిత పదాలతో, సహజ సుందరంగా విరిశాయి. ఎక్కడా ి్లష్టత కనిపించదు . చిన్న చిన్న పదాలతో, అంత్య ప్రాసలతో పిల్లలు పాడుకోవడానికి ఆహ్లాదకరంగా ఉన్నాయి . పాడుకోవడమే కాదు , పాటలకు అనుగుణంగా పిల్లలు గంతులు వేయడానికి తగిన ద్వనితో గేయాలన్నీ శోభిల్లాయి . ఒకటి రెండు సార్లు చదవగానే అలవోకగా నోటికి వచ్చేస్తాయి. చిట్టిపాప కళ్ళు నేరేడుపళ్ళు/చిట్టిపాప ముక్కు బుల్లి జీడిపప్పు/ చిట్టిపాప బుగ్గలు లేలేత మొగ్గలు/ చిట్టిపాప పెదవులు గులాబిరేకులు. … ఇలా గేయాలన్నీ పిల్లల మనసులకు చేరిపోతాయి .
పిల్లలు హాశ్యమంటే ఎంతో ఇష్ట పడతారు. కుక్క తోక , బోడిగుండు , తోకలేని కోతి మొదలైన గేయాలు పిల్లలను పక పకా నవ్విస్తాయి. వీధిలోన చిన్న కుక్క పిల్ల ఉన్నది/దాని చిన్ని తోకకేమో మెలిక ఉన్నది/ సాపు చేయ చూడబోతే చక్కగున్నది /వదిలేస్తే చప్పున అది చుట్టుకున్నది / ఎంతసేపు లాగినా లొంగనన్నది/వంపుతీయ అంతు నాకు చిక్కకున్నది/ఊరువాడ నన్ను చూసి ఫక్కు మన్నది/అదిరిపడుతూ కుక్కపిల్ల తుర్రుమన్నది. ఈ గేయంలో హాశ్యమే కాదు . కుక్కపిల్ల తోకను పట్టుకొని చిన్న పిల్లవాడు లాగుతున్న దశ్యము మన కండ్ల ముందు కనిపిస్తుంది. మోహన్ వేసిన బొమ్మ జ్ఞాపకం వస్తుంది.
బాల్యం నుండే పిల్లలకు దేశ భక్తి, సమయ పాలన, పెద్దల పట్ల గౌరవం, సోదర భావం, మాత భాష పట్ల గౌరవం నేర్పాలనే తపన గల్ల రచయిత్రి శిరీష గారు. గంటలు, కాలాలు, సమయం మొదలగు గేయాల్లో పిల్లలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియ చెప్పారు. భాష యొక్క గొప్పదనాన్ని అందం గేయంలో – భాష ఒడిన విరబూసిన అక్షరాలు అందము/పదాలన్నీ పేర్చినపుడు పుట్టు కవిత అందము /కవితల్లో దాగి ఉన్న భావమెంతో అందము … అంటూ మన తెలుగు గురించి ప్రేమగా పిల్లలకు తెలుపుతారు. మూడు రంగుల జండా మనది/ముచ్చట గొలిపే దేశం మనది/ఎన్నో మతాలు జాతులు కలిసి/ చక్కగ మసలే సఖ్యత మనది… అంటూ జాతీయ భావాలను గేయాల ద్వారా పిల్లలకు అందించారు.
బూరలు, చందమామ, సంబరం , చక్కని పుస్తకం, పెద్దల మాట మొదలైన గేయాలే కాదు , మొత్తం గేయాలన్నీ బాల బాలికల చుట్టే తిరిగాయి . చదివిన పిల్లలకు ఆనందాన్ని పంచడమే కాకుండా, పెద్దలు పిల్లలని తీర్చిదిద్దవలసిన కర్తవ్యాన్ని ఈ గేయాల ద్వారా రచయిత్రి నెరవేర్చారు. ఈ పుస్తకానికి బొమ్మలు వేసిన వారి 11 ఏండ్ల అమ్మాయి ఆయుశిని అభినందించకుండా ఉండలేము. గేయాలకు తగినట్లుగా చిల్డ్రన్ స్ట్రోక్ తో ఎంతో వైవిధ్యమైన బొమ్మలను అందించారు. పిల్లలను ఈ గేయ సంపుటి ఎంతో ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఇంట్లో సాధారణంగా పిల్లలు పెద్దల మాటను పెడచెవిన పెడతారు. కానీ, ఇలాంటి పుస్తకం చేతికిస్తే, శ్రద్ధగా చదివి, వారి నడవడికను వారే చక్క దిద్దు కుంటారు . పిల్లలను ప్రేమించే తల్లి దండ్రులు తప్పకుండా కొని , తమ సంతానంతో చదివించవలసిన మంచి బాలల గేయ సంపుటి ఈ విరిజల్లు. మేలిమి బంతి వంటి గేయాలను అందించిన నాగ శిరీష గారు అభినందనీయులు.
- పుప్పాల కృష్ణమూర్తి
99123 59345



