నువ్వెంతలా నన్ను కట్టడి చేద్దామన్నా
నే కట్టడి కాను,
నా గొంతుని వినిపిస్తూనే ఉంటాను
నాలో రగులుతున్న
విప్లవ శంఖారావాలని
ఆగకుండా పూరిస్తూనే ఉంటాను.
నువ్వేం చేయలేవు!
నాకర్థమైంది! –
నీతి తప్పిన వారితో నీతి తప్పినట్టుగానే ప్రవర్తించాలని.
లేకపోతే వారికి బలహీనంగా దొరికిన జింకపిల్లమౌతాం!
పులిలా పుక్కిటి పురాణాల్ని
తుంగలో తొక్కాల్సిన సమయం ఆసన్నమైంది.
మనమిప్పుడు ఆవు – పులి కథనే కాదు
బర్రె కథని కూడా
మనం చెప్పుకోవాలి.
పాలిచ్చే ఆవు దేవతైనప్పుడు,
అవే తెల్లని పాలిచ్చే
బర్రె దేవతెందుకు కాలేదో ప్రశ్నించాలి!
అప్పుడు నీకూ నాకూ మధ్య
గీసిన గీతలన్నీ, వేసిన కంచెలన్నీ
ఒక్కొక్కటిగా పటా పంచలవుతాయి!
అప్పుడు నువ్వూ నేనూ
ఒకే కొమ్మకి రెండు పువ్వులమవుతాం!
ఒకే తల్లికి పుట్టిన బిడ్డలమవుతాం!
మనుషులమవుతాం!
బాలాజీ పోతుల, 8179283830



