Sunday, November 23, 2025
E-PAPER
Homeకవితఆశా'జీవి'తం

ఆశా’జీవి’తం

- Advertisement -

అంధకారంలోనైనా వెలుగు
వెతికే వాడే ఆశాజీవి,
ఒక చిరునవ్వైతే చాలు
రేపు మంచిదని నమ్మించే దీపం.
పడిపోయినా లేచే ధైర్యం,
మబ్బుల్లోనూ సూర్యుడిని
కనిపెట్టే ఆశాజీవి.
చీకటి దట్టంగా కమ్ముకున్నా
కంటి వెలుగు నిలబెట్టుకునే వాడే.
జీవితం ఎన్నిసార్లు తడబడినా,
”ముందుంది మార్గం” అని
గుండె గుసగుసల ధైర్యమే అతని బలం.
గాలి తుపానై కొట్టినా, ఆశ పేరు చెప్పగానే
ఎండిన ఆకులోనూ పచ్చదనమే మొలుస్తుంది.
పగిలిన కలలను మళ్ళీ
నమ్మకంగా జోడించడం అతని లక్షణం
తనకేమీ లేకున్నా
ఇతరుల బాధలో చిరునవ్వు పంచగల
స్వభావమే అతని గొప్ప సంపద.
ఒక్క విజయాన్ని నమ్మి
వేల వైఫల్యాలను భరించగల అద్భుత శక్తి.
ఎవరూ చూడని క్షణాల్లో
తనకు ధైర్యం చెప్పుకుని
తానే తనకు అద్దం అవుతాడు.
ఎంత చిన్న చిమ్మటైనా రగిలే అగ్నిపర్వతంగా
మార్చగల అద్భుత జ్యోతి.
అతను ఒక మనిషే కాదు,
మనలో నిద్రపోతున్న వెలుగు.
పడిపోయినప్పుడు లేపే శక్తి,
జీవితం అనే నావకి తెరచాప.
వెలుగు కనిపించకపోయినా
విశ్వాసమే అతని జీవితం.
అదే అతని ఆస్తి, అదే అతని పయనం,
అదే ప్రత్యేకంగా నిలబెట్టే చిరునవ్వు.
ఒక్కడే నిలుచున్నా నీడను తోడు చేసుకుని
పర్వతాలకన్నా
ఎత్తైన పయనాలు మొదలెడతాడు.

తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008 577 834

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -