టెన్షన్ వద్దు..ప్రశాంతత ముద్దు
మానసిక ఆరోగ్యం, జీవన సమతుల్యత ముఖ్యం
జెన్-జెడ్, మిలీనియల్స్ ఆలోచనా తీరు
కరోనా అనంతరం మరింత మార్పు
‘ఎంత ఎక్కువగా కష్టపడితే.. అంతగా ఎదుగుతావు’ అనేది పాత సామెత. దీనిని సాధారణంగా విజయానికి మార్గంగా చెప్తుంటారు. ఇందుకు పగలు-రాత్రి శ్రమించటం, నిద్రలేని రాత్రులు గడపటం, ఓవర్‌టైమ్ కష్టపడటం.. వీటిని అలవాటుగా చేసుకున్న తరాన్ని చూశాం. కానీ కొత్త తరం అలా కాదు. ప్రపంచాన్ని మరో కోణంలో చూస్తున్నది. జీవితం పోరాటం కావాల్సిన అవసరం లేదు. విజయమనేది బాధతో కాకుండా.. మానసిక ప్రశాంతత, సమతుల్యతతో కూడా సాధ్యమే అని అంటున్నది. పురోగతి కోసం ప్రశాంతతను తాకట్టు పెట్టని జీవితం.. నిదానంలోనూ అర్థాన్ని గుర్తించటం.. మన అనిపించినవారితో చిన్న ఆనందాల విలువ.. ఇదీ జెన్-జెడ్, మిలీనియల్స్ కోరుకుంటున్నది. దీనినే ‘సాఫ్ట్ లైఫ్’గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
న్యూఢిల్లీ : తరాలు మారుతున్నా కొద్ది మనిషి ఆలోచనా ధోరణి మారుతున్నది. పాత తరానికి, ప్రస్తుత తరానికి మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. ‘జీవితం అంటే కష్టపడాలి.. అప్పుడే విజయాన్ని రుచిచూడగలం’ అనే మార్గాన్ని పాత తరం అనుసరిస్తుంది. అయితే డిజిటల్ యుగాన్ని చూస్తూ పెరిగిన మిలీనియల్స్, జెన్-జెడ్‌లు మాత్రం ‘ఎంత పని చేశావు’ కంటే ‘ఎంత ప్రశాంతంగా ఉన్నావు?’ అనే అంశాలకు ఎక్కువ విలువనిస్తున్నారు. ఏదైనా సాధించాలంటే ఆరోగ్యం, మనశ్శాంతి, సంబంధాలు బలి కావాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ఇదే మార్పు ఇప్పుడు ఈ తరం యువతలో సాఫ్ట్‌లైఫ్ అనే కొత్త జీవనశైలిని తీసుకొచ్చిందని నిపుణులు అంటున్నారు.
ఏమిటి ఈ సాఫ్ట్‌లైఫ్?
సాఫ్ట్‌లైఫ్ అంటే ఒక లగ్జరీ జీవితం కాదు. అలసత్వం, సోమరితనం కూడా కాదు. ఇది మనసుకు శాంతి, జీవిత సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చే ఒక కొత్త జీవన విధానం. అంటే ఉరుకులు, పరుగులతో కాకుండా నిదానంగా ఉదయాన్ని ప్రారంభించటం, తనకు తాను కావాల్సినంత సమయాన్ని ఇచ్చుకోవటం, ప్రియమైన వారితో ఎక్కువ, నాణ్యమైన సమయాన్ని గడపటం, మానసిక, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితంలో ఒక పని, ఉద్యోగం వంటి వాటి కోసం కష్టపడకపోవడమో, భయపడి మానేయడమో కాదు.. మన ఆరోగ్యం, మనశ్శాంతిని దెబ్బతీసే పనులకు దూరంగా ఉండటం.
మార్పునకు కారణాలివి..!
కొత్త తరంలో వచ్చిన ఈ మార్పు అకస్మాత్తుగా సంభవించింది కాదని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. పనిలో ఒత్తిళ్ళు, విశ్రాంతి లేకుండా చేసే ఉద్యోగాలు, అధిక పని గంటలు, సరైన వేతనాలు లేకపోవటం, మానసికంగా, శారీరకంగా అలసిపోవటం… వంటి వాటిని వారు కారణాలుగా చెప్తున్నారు. మరీముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి.. మనిషి, ఆరోగ్యం, జీవితం, బంధాలు, బంధుత్వాల విలువను తెలిసేలా చేసింది. ”జీవితానికి ఏ మాత్రమూ గ్యారంటీ లేదు. అందులో ఉద్యోగం, పని వంటివి జీవితంలో ఒక భాగం మాత్రమే. వీటి కోసం ప్రశాంతతనే కోల్పోతే జీవితానికి ఉన్న అర్థమేంటి?” అని నేటి యువత భావిస్తున్నదని మానసిక నిపుణులు చెప్తున్నారు.
సాఫ్ట్ లైఫ్.. అనుకున్నంత ఈజీ కాదు
సాఫ్ట్‌లైఫ్ అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదని అంటున్నారు. దీనికి ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక భద్రత చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఇది మన బ్యాంకు బ్యాలెన్స్, మన నెల జీతం, కుటుంబ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత మిలీనియల్స్, జెన్-జెడ్ యువతలో పెద్ద తేడా ఇక్కడే కనిపిస్తుంది. ఐటీ సెక్టార్ పుణ్యమా అని లక్షల రూపాయల జీతాలు అందుకుంటున్నవారు.. కుటుంబ పరిస్థితి బాగాలేకపోవటమో, ఆర్థిక నియంత్రణ లేకపోవటమో, అప్పుల్లో కూరుకుపోవటమో.. వంటి కారణాలతో ఈ సాఫ్ట్‌లైఫ్‌ను పొందలేకపోతున్నారు.
చాలా మంది చెప్తున్నట్టుగా సాఫ్ట్‌లైఫ్ అనేది మనం కొనే వస్తువు వంటివి కాదు. మన తీరు, అలవాట్లు, నిర్ణయాలు ఇందులో కీలకంగా ఉంటాయి. అర్థవంతమైన సంబంధాలు, చిన్న చిన్న పొదుపులు, మనల్ని మనం కోల్పోకుండా చూసుకోవడం, మైండ్‌ఫుల్ లివింగ్, మినిమలిజం వంటివి భాగమవుతాయి. అయితే నిరుద్యోగం, ఖర్చులు పెరుగుతున్న ఈ కాలంలో భవిష్యత్ తరాలు ఈ సమతుల్య జీవనాన్ని ఎలా సాగిస్తాయన్నదే అసలు సమస్య అని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫైనాన్షియల్ నిర్ణయాలు, స్పష్టమైన బౌండరీలు, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఈ మార్పునకు పునాదిగా వారు వివరిస్తున్నారు.



