గవర్నర్ల అధికారాల పట్ల సుప్రీం తీర్పుపై సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని 200వ అధికరణ కింద గవర్నర్ల అధికారాలకు సంబంధించి రాష్ట్రపతి చేసిన ప్రస్తావనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనతో కూడిన అభిప్రాయం నిరాశ కలిగించేలా వుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం చేతిలో అధికంగా కేంద్రీకృతమవుతున్న అధికారాల కారణంగా రాష్ట్రాల హక్కులపై ప్రస్తుతం జరుగుతున్న దాడికి ఇది ఏ రకంగానూ అడ్డుకట్ట వేయదని పేర్కొంది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్లకు విచక్షణాధికారాలు వుంటాయని చెప్పడం,
వారికెలాంటి కాల పరిమితులు విధించకపోవడం వల్ల సుప్రీంకోర్టు వెలువరించిన ఈ అభిప్రాయం ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల రాజ్యాంగయేతర అధికారాలను అమలు చేసేలా మాత్రమే ప్రోత్సహిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.
ముఖ్యంగా, గవర్నర్ బిల్లును పున:పరిశీలించాల్సిందిగా కోరిన తర్వాత కూడా రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాల్సిన అవసరం లేదనడం తిరోగమన సూచన. దానికి బదులుగా గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతికి నివేదించవచ్చు, తద్వారా నిరవధికంగా జాప్యం జరిగేలా చేయవచ్చు. పెండింగ్ బిల్లుపై గవర్నర్ సుదీర్ఘంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వున్న పక్షంలో పరిమిత స్థాయిలో జ్యుడీషియల్ జోక్యం వుండవచ్చని పేర్కొనడం ఈ తీర్పులో ఇచ్చిన ఏకైక ఉపశమనం. అయితే ఇది కూడా చాలా అస్పష్టంగానే వుంది. ఎందుకంటే సుదీర్ఘమైన కాలం కార్యాచరణ కొరవడడం లేదా జాప్యం జరగడమంటే ఏమిటనేందుకు నిర్వచనం లేదు. ఆ రకంగా సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పులో, కేంద్రం తరపున రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ల ఏకపక్ష పనితీరుపై ఎలాంటి రాజ్యాంగపరమైన అడ్డుకట్టలు లేకుండా పోయాయి.



