Sunday, November 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచెరుకు రైతుల సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీ

చెరుకు రైతుల సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీ

- Advertisement -

ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన చెరుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, చెరుకు అభివృద్ధి మండళ్ల (సీడీసీ) చైర్మెన్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణాలో ఏటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల సమస్యలు కూడా పరిష్కరించాలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రధాన అంశాలపై అందరితో చర్చించి నివేదిక రూపొందించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించనున్నట్టు ఆయన వెల్లడించారు.

ఇందులో సంబంధిత శాఖల అధికారులు, చక్కెర పరిశ్రమల ప్రతినిధులు కూడా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో చెరుకు రైతులకు అందుతున్న ప్రయోజనాలు, రాయితీలపై అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదిక అందిస్తుందని తెలిపారు. ప్రతి క్వింటాలు సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్‌ను చెరుకు పంటకు కూడా వర్తింపచేయాలని రైతులు కోరుతున్న విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. చెరుకు హార్వెస్టర్‌ యంత్రాలపై గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని ఇవ్వగా ఆ తర్వాత వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ రాయితీని తొలగిం చిన విషయం రైతులు చెబుతున్నారని ఆయన వెల్లడించారు. కూలీల సమస్య వల్ల చెరుకు నరకడం రైతులకు సమస్యగా మారిందని చెప్పారు. తన నియోజ కవర్గం మంథనిలో పత్తి తీసే కూలీల కొరత వల్ల ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి లేబర్‌ వస్తున్న విషయం తనకు తెలుసునని శ్రీధర్‌ బాబు వివరించారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ రాయితీని చెరుకు పంటకు కొనసాగించాలని రైతులు కోరుతున్న విషయంపై అధికారుల కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు.

డ్రిప్‌ పరికరాల వల్ల ప్రతి ఎకరానికి 8-9 టన్నుల దిగుబడి పెరుగుతుందని చెప్పారు. చెరుకు రవాణా ఛార్జీలను కొంత మేరకు భరించే అంశాన్ని కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణాలోని ప్రయివేటు రంగ చక్కెర పరిశ్రమలను కాపాడుకుంటామని తెలిపారు. నిజాం షుగర్స్‌ పునరుద్ధరణ విషయంలో వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. కార్మికులు, రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని వివరించారు. ఏపీలో చక్కెర రికవరీ శాతం 9 శాతం ఉండగా, రాష్ట్రంలో 11 శాతం వరకు వస్తుండటం సంతోషం కలిగించే అంశమని చెప్పారు. చెరుకు విస్తీర్ణం పెరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌ బాబు వెల్లడించారు. సమావేశంలో తెలంగాణా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఛైర్‌ పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ సంజరు కుమార్‌, చక్కెర పరిశ్రమల డైరెక్టర్‌ నర్సిరెడ్డి, పలువురు అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, సీడీసీ చైర్మెన్లు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -