నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రాధాన్యతా క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదల శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిని, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టుల పనులపై ప్రణాళికలను రూపొందించిందని తెలిపారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు పెండింగ్‌లో ఉన్న సవరించిన అంచనాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయిం చాలన్నారు. ఆరు నెలల నుంచి 36 నెలల వరకు ఐదు దశల్లో పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేయాలని ప్రతిపాదించామన్నారు. ఆయా ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన వ్యయం, తదితర అంశాలను సమర్పిం చాలని సూచించారు. అనంతరం గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు సంబంధించి లీగల్ సమస్యను సుప్రీంకోర్టు ఇటీవలనే పరిష్కరించిందనీ, రిజర్వాయర్‌లో నీటి నిల్వకు, కాలువలు తవ్వకానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి అవసర మైన నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 55 ఎకరాల పునరావాసానికి సంబం ధించిన సమస్య ఉందని, దానిని పరిష్కరించాలని సూచించారు. సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులతో పాటు చత్తీస్ గడ్ ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సీతమ్మ సాగర్, సీతారామసాగర్ ప్రాజెక్టులు, మోడికుంట వాగు, చనాక కొరాట, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల అనుమతులతో పాటు కేంద్రం నుంచి నిధులు రాబట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల రక్షణపై ముందుకు సాగాలని ఆదేశించారు. తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఉంచాల్సిన చేర్చాల్సిన అజెండా అంశాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. 2023 డిసెంబర్ 7 నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లుల ప్రతిపాదలను తయారు చేయాలని సూచించారు.



