కాంగ్రెస్ నేతలకు అప్పనంగా కట్టబెట్టేందుకు కుట్ర : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం 10 వేల ఎకరాల భూ కుంబకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఇండిస్టియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ ల్యాండ్ లూటింగ్ పాలసీగా మారిందని ఆరోపించారు. పారిశ్రామిక అవసరాల కోసం 50 ఏండ్ల ముందు కేటాయించిన భూములను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ”బీఆర్‌ఎస్ హయాంలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించి నప్పుడు ఎస్‌ఆర్‌ఓ రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అధికంగా వసూలు చేయాలని చట్టం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30 శాతానికే అప్పగించాలని చూస్తోంది.
7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయడంలో ఆంతర్యమేమిటో సర్కార్ చెప్పాలి. ఎవరికి లాభం చేకూర్చడానికి అఘమేగాల మీద చేపడుతున్నారు? సర్కార్ తీరుతో ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం జరుగుతుంది. రూ.5లక్షల కోట్ల విలువ గల భూములను కేవలం రూ.5వేల కోట్లకు మాత్రమే అప్పగించేందుకు కుట్రకు తెర లేపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని హరీశ్‌రావు డిమ్‌ాం చేశారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా, అసెంబ్లీలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కాలుష్య కారక పరిశ్రమలను మాత్రమే ఓఆర్‌ఆర్ అవతలకు పంపించాలనే పాలసీకి విరుద్దంగా గ్రీన్ ఇండిస్టీలను కూడా బయటికి పంపిస్తున్నారని విమర్శించారు. ఇంత భారీ భూ కుంభకోణం జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.



