న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) విధుల్లో ఒత్తిడి భరించలేక శుక్ర, శనివారాల్లో ముగ్గురు బూత్‌లెవెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోగా, పశ్చిమ బెంగాల్‌లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్, దామోహ్ జిల్లాల్లో బూత్ లెవెల్ అధికారులు(బీఎల్‌ఓలు) గా పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు రమాకాంత్ పాండే, సీతారాం గోండ్ ఎస్‌ఐఆర్ విధి నిర్వహణ అనంతరం శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా కృష్ణానగర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు రింకు తరఫ్‌దార్ (54) ఎస్‌ఐఆర్ పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే రాష్ట్రంలోని జల్పారుగురికి చెందిన ఓ బీఎల్‌ఓ బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐఆర్ దరఖాస్తులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తవకపోవడంతో సస్పెండ్ చేస్తామని ఉన్నతాధికారులు బెదిరిస్తుండటంతోనే బీఎల్‌ఓలు ప్రాణాలు కోల్పోతున్నారని వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సర్ ఒత్తిడితో ముగ్గురు బీఎల్‌ఓల మృతి
- Advertisement -
- Advertisement -



