తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సబ్ కమిటీ : కన్వీనర్ ఎం.జనార్దన్ రెడ్డి
నవతెలంగాణ-హిమాయత్ నగర్
కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సబ్ కమిటీ కన్వీనర్ ఎం.జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెన్షనర్ల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సులో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ సదస్సుకు ఈపీఎఫ్, సీబీటీ సభ్యులు ఆర్.కరుమలయన్, ఏఐఎస్ జీఈఎఫ్ జనరల్ సెక్రటరీ శ్రీకుమార్, ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీ, కార్మిక సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు.
తమ సమస్యలు పరిష్కారం కాకపోతే డిసెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోనే గాక జాతీయంగా, అంతర్జాతీయంగా పెన్షనర్స్, రిటైరీస్‌పై ప్రభుత్వాలు ధమన నీతిని కొనసాగిస్తున్నాయన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను మెరుగుపరచకపోగా నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. అంతే కాకుండా పెన్షనర్లు, వృద్ధుల పట్ల అగౌరవంగా, అమానుషంగా ప్రవర్తించడం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిత్యకృత్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు సమగ్ర రక్షణ కల్పించే విధానాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. సుమారు 85 లక్షల ఈపీఎస్ పెన్షనర్లలో కేవలం రూ.1,000 అంతకు తక్కువ పెన్షన్‌తో 37 లక్షల మంది తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు.
తమ కనీస పెన్షన్ రూ.9,000కు పెంచాలని అనేక ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే తమకు రూ.9 వేల పెన్షన్ పెంచి, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లు అందరూ తమ హక్కులను కాపాడుకునేందుకు ఏకతాటి పైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పి.శివలింగం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి టి.బాలగంగాధర్ రావు, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ స్వరాజ్ కుమార్, జి.వెంకటరమణ, ఏఎస్.ప్రకాష్ రావు, చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.



