– సాయం అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై బ్రహ్మంగారి గుట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై కమ్మర్ పల్లి వైపు నుండి కోరుట్ల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి మరో వాహనానికి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
ఈ ప్రమాదంలో టీవీఎస్ ఎక్సెల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలోనే అటు గుండా వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ప్రమాద సంఘటనను చూసి ఆగారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను చూసి వారి వద్దకు వెళ్లి పరిశీలించారు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తన కారులో నుంచి బట్టలు తెప్పించి రక్తం ఆగేలా చేశారు. అనంతరం వారిని 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ విషయమై ఇప్పటివరకు ఎవరి నుండి ఫిర్యాదు రాలేదని స్థానిక పోలీసులు తెలిపారు.



