ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలి
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోండి :పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆదివారం సీఎం పరిశీలించారు. పోలీసులు, సంబంధిత అధికారులతో ఈ సందర్భంగా ఆయన సమీక్ష నిర్వహించారు. ”తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారు. వివిధ దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు.
పాస్‌లు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదు. సమ్మిట్‌కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. శాఖల వారీగా అధికారులకు ఎంట్రీ ఉంటుంది. ఏర్పాట్లను నేను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాను. పోలీస్‌లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పార్కింగ్‌కు ఇబ్బంది రావొద్దు. బందో బస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలి. సమ్మిట్‌కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాట్లు చేయాలి” అని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న భారత్ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు.
2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సమ్మిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు ప్రభుత్వం సాధించిన విజయాల వివరాలను ప్రదర్శిస్తారు. రెండో రోజు తెంలగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్ కు పారిశ్రామిక వేత్తలు, బడా కంపెనీల ప్రతినిధులు తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి దాదాపు రెండు వేల మంది ప్రముఖులు హాజరుకానున్నట్టు సర్కార్ అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో తన విజన్, పాలసీలను ప్రదర్శించడానికి సమ్మిట్ ముఖ్య వేదిక కానుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఏర్పాట్లు సైతం అదే రీతిలో ఉండేలా అన్ని చర్యలు చేపట్టింది.



