బీహార్ ఎన్నికల తర్వాత ప్రజావ్యతిరేక విధానాల అమల్లో కేంద్రం దూకుడు
ఏకపక్షంగా చట్ట సవరణ బిల్లులు
స్టేక్ హోల్డర్స్‌తో సంప్రదింపులు లేవు
అర్థరాత్రుళ్లు ఆన్‌లైన్‌లో ముసాయిదాలు
ప్రతిపక్షాలను పరిగణనలోకే తీసుకోని మోడీ సర్కార్
అంతర్జాతీయంగానూ అమెరికాకు లొంగుబాటు
రష్యా నుంచి చమురు దిగుమతులు బంద్
ఒక్క విజయం…దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ విజయాన్నే ప్రజామోదంగా భావిస్తున్నది. గతంలో ఏ ప్రజావ్యతిరేక విధాన నిర్ణయాలపై దేశ ప్రజానీకం ఉవ్వెత్తున తిరుగుబాటు చేశారో, ఇప్పుడు అవే విధానాలను కేంద్రం చట్ట సవరణల రూపంలో తిరిగి జనం మీదకే ప్రయోగిస్తోంది. బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం తర్వాత కేంద్రంలో ఈ దూకుడు మరింత పెరిగింది. తమకు అడ్డేలేదన్న రీతిలో దుందుడుకు చర్యలతో నిర్ణయాలు తీసుకుంటోంది.
ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాభిప్రాయాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. దానిలో భాగంగానే తాజాగా నాలుగు లేబర్‌కోడ్‌లను అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. 2020 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు వెనకాడుతున్న మోడీ సర్కార్ బీహార్ ఎన్నికల తర్వాత బరితెగించింది. దశాబ్దాల కార్మికుల పోరాటాలకు విలువలేకుండా చేసింది. దీన్ని ప్రజాబాహుళ్యం నుంచి తప్పించి, చర్చల్ని పక్కదారి పట్టించేందుకు మళ్లీ చండీగఢ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆ కేంద్రపాలిత ప్రాంతం ఏ రాష్ట్రానికి చెందుతుందనే పాత అంశాన్ని తోడి, జాతీయ స్థాయిలో చర్చను రచ్చ చేస్తోంది. స్వదేశంలో ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి, జెన్ జెడ్ యువతరం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిపోవాలనే లక్ష్యంతో విదేశీ వ్యవహారాల శాఖ ఓవర్సీస్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ బిల్-2025ను రూపొందించింది.
దాన్ని త్వరలో అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానితో పాటే విద్యుత్ సవరణ చట్టం-2025నూ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా విద్యుత్‌రంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరించేందుకు అవసరమైన చట్ట సవరణలన్నీ ఈ బిల్లులో ఉన్నాయి. దీన్ని కూడా త్వరలో అమల్లోకి తేవాలని కేంద్రం ఉవ్విళ్లూరుతోంది. భారతదేశ వాణిజ్య వ్యవస్థలో సమూల మార్పులు తెస్తూ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ ఇంటర్నేషనల్ ట్రేడ్ సవరణ చట్టం – 2025ను తెచ్చింది. దీనిద్వారా స్వదేశీ పారిశ్రామిక విధానాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే పద్ధతిలో విధివిధానాలను రూపొందించింది. అన్నింటికీ మించి భారతదేశ రైతాంగం సుదీర్ఘకాలంపాటు ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న మూడు వ్యవసాయ నల్ల చట్టాల నిలుపుదలను అవహేళన చేస్తూ, బీహార్ ఎన్నికలు ముగియగానే ‘వ్యవసాయ రంగంలో సమగ్ర సంస్కరణలు- డ్రాఫ్ట్ సీడ్ బిల్ – 2025” బిల్లును తీసుకొచ్చింది. దీని అమలుకు గడువును నిర్దేశించుకుంది. ఇవన్నీ తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లులు, నిర్ణయాలే!
అమెరికాకు జీ హుజూర్
అంతర్జాతీయంగానూ మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రజల్ని మళ్లీ బానిసత్వంలోకి నెట్టేలా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రష్యా తమకు వ్యూహాత్మక మిత్రుడు అని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ తాజాగా ఆ దేశం నుంచి ముడిచమురు దిగుమతుల్ని నిలిపివేశారు. దానికి అమెరికా ఒత్తిళ్లే కారణమనే విషయం సుస్పష్టం. రష్యాను కాదని ఇప్పుడు అమెరికా నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నారు. ఆ ఘనకార్యం అక్కడితో ఆగలేదు. ట్రంప్ సుంకాల బెదిరింపులకు లొంగి అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే అమెరికా నుంచి వంటగ్యాస్ సహా అనేక వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు తలవంచారు. ఆ వస్తువుల దిగుమతులపై సుంకాలను నామమాత్రం చేశారు. ఈ పరిణామాలు దేశాన్ని ఆర్థికంగా అస్థిరపరుస్తాయని వాణిజ్య నిపుణులు అందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
భయపెడుతున్న ‘సర్’
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తెరపైకి వచ్చిన ‘సర్’ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలనూ భయపెడుతోంది. బీహార్ ఎన్నికల్లో దాదాపు 60 లక్షల ఓట్లను తొలగించి, అదే జాబితాల్లో దాదాపు 30 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారు. దీన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది కచ్చితంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి విడతలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న 12 రాష్ట్రాల్లో ‘సర్’ అమలు చేస్తామని ప్రకటించారు. తమకు అనుకూలురైన ఓటర్లను జాబితాల్లో చేర్చడం, వ్యతిరేకుల ఓట్లను తొలగించడం వంటి చర్యల్ని బీజేపీ చేస్తుందనే భయం అన్ని రాజకీయపార్టీలను వెంటాడుతోంది. బీహార్‌లో బీజేపీ బలం పెరిగి, మిత్రపక్షమైన నితీష్‌కుమార్ పార్టీ తక్కువ సీట్లకు పరిమితం కావడం కూడా దీనిలో భాగమేననే చర్చా జరుగుతోంది.
ప్రతిపక్షాలతో నో డిబేట్
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉంటాయనే విషయాన్నే మోడీ సర్కార్ విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏ చట్ట సవరణ బిల్లుపైనా ప్రతిపక్షాల అభిప్రాయాలు స్వీకరించలేదు. వారి సూచనలు, సలహాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంతా ఏకపక్ష నిర్ణయాలే. కనీసం ఆయా బిల్లులపై పార్లమెంటులోనూ చర్చకు పెట్టలేదు. అర్థరాత్రుళ్లు బిల్లు ముసాయిదాలను వెబ్‌సైట్లలో పెట్టి, వాటిపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే రాతపూర్వకంగా దృష్టికి తీసుకురమ్మని కేంద్రం కోరుతోంది. ప్రజాస్వామ్యంలో ఇదేం ధోరణో అర్థం కావట్లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.



