సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభల పోస్టర్ అవిష్కరణ
వచ్చే నెల 7 నుంచి 9వరకు మహాసభలు
ఏడున కార్మిక కవాతు..బహిరంగ సభ
ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నాలుగు లేబర్ కోడ్‌లపై పోరాటాలకు సన్నద్ధం
జయప్రదం చేయాలని నేతల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలు వచ్చేనెల 7నుంచి 9వరకు మెదక్ పట్టణంలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు తమ పని ప్రదేశాల్లో ‘హలో కార్మికా..చలో మెదక్’ అంటూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏడున నిర్వహించ తలపెట్టిన రెడ్‌షర్ట్ వాలంటీర్ల, కార్మిక ర్యాలీ జరగనున్నాయి. బహిరంగసభకు తరలివచ్చేందుకు కార్మికులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సభకు ముఖ్యవక్తగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరుకానున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, కార్యదర్శులు జె చంద్రశేఖర్, కూరపాటి రమేష్, పి.శ్రీకాంత్, ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఎం అడివయ్య, రాష్ట్ర నాయకుడు పి సుధాకర్‌లతో కలిసి ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ మహాసభ పోస్టర్‌ను అవిష్కరించారు.
ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ మహాసభలను ఒక కీలకమైన సందర్భంలో జరుపుకుంటున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గానికి ఉచ్చు బిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమానుల, కార్పొరేట్ల గరెసెల్లోకి లాభాల వరద పారించేందుకు కార్మిక హక్కులకు పాడె కట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ల కనుసన్నల్లో సాగుతున్న మోడీ పాలన..కార్మిక వర్గ పోరాటాలతో మట్టికొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు. కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌కోడ్‌లను అమలు చేయకుండా తిరస్కరించాలని డిమాండ్ చేశారు.
ఆ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయటం వల్ల కార్మిక వర్గం తీవ్రంగా నష్ట పోతుందనీ, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షామో? యాజమానుల పక్షమో తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పనిగంటలు పెంచుకునేందుకు కార్పొరేట్లకు అనుకూల జీవోలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మహాసభలకు 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు అవుతున్నారని తెలిపారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె హేమలత, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ తపన్ సేన్, జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు హాజరవుతున్నారని తెలిపారు. మహాసభల నిర్వహణ కోసం ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు.
ఆ మహాసభల్లో వివిధ రంగాల్లో, వివిధ పేర్లతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై చర్చలు కొనసాగుతాయని తెలిపారు. గుర్తించిన సమస్యలపై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కానున్నట్టు పేర్కొన్నారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ.. పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నదని చెప్పారు. కార్మికులకు కనీస వేతనం ఐదేండ్ల్లకొకసారి పెంచాల్సి ఉన్నా ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పని గంటలు పెంచి ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులతో వెట్టి చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో సమరశీల పోరాటాలు నడుపుతామన్నారు.



