రైతు బిడ్డ నుంచి నిర్మాణ రంగ దిగ్గజం వరకు..
కె. రవీందర్‌రెడ్డి 40 ఏండ్ల విజయ ప్రయాణం
40 వసంతాల ‘జనప్రియ’ ప్రస్థానం.. 72వ ఏట అడుగుపెడుతున్న నిర్మాణ రారాజు
”రోటి, కపడా, మకాన్.. ఈ మూడింటిలో మనిషికి అత్యంత కష్టమైనది మకాన్(ఇల్లు). ఆ కష్టాన్ని తీర్చి, మధ్యతరగతి జీవికి సొంతింటి కలను నిజం చేయడమే నా లక్ష్యం” అంటారు జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ వ్యవస్థాపకులు, సీఎండీ కొండకింది రవీందర్ రెడ్డి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ ఉద్యోగిగా జీవితాన్ని , నేడు నిర్మాణ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న రవీందర్ రెడ్డి.. 40ఏండ్ల (1985-2025) సుదీర్ఘ ప్రయాణం ఎందరికో ఆదర్శం. ‘అందరికీ ఇల్లు’ అనే బృహత్తర యజ్ఞానికి కర్త, కర్మ, క్రియగా నిలిచిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రవీందర్ రెడ్డి 72వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా.. జనప్రియ ప్రస్థానం, రియల్ రంగంలోని మార్పులు, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం.
నవతెలంగాణ-సిటీబ్యూరో
”40 ఏండ్లుగా నాకు ఇష్టమైన పనే చేశాను.. ఇష్టమైన పనిలో కష్టం ఉన్నా అది కనిపించదు” అంటారు నిర్మాణ రంగ వెటరన్ రవీందర్‌రెడ్డి. 40 ఏండ్ల క్రితం ఏ ఉత్సాహంతో అయితే జనప్రియను ప్రారంభించారో.. నేడు 72వ ఏట అడుగుపెడుతున్నా అదే ఉత్సాహంతో సంస్థను నడిపిస్తున్నారు. పాతికేండ్ల క్రితం ఆయన కట్టించిన ఇండ్లలో చేరిన కుటుంబాలు, నేడు తమ పిల్లల పెండ్లిండ్లు కూడా అదే ఇండ్లలో చేస్తుండటం ఆయన విజయానికి నిజమైన కొలమానం. వేలాది కుటుంబాల ఆశీర్వాదాలు, 40 ఏండ్ల అవిశ్రాంత కృషి, లక్షలాది మంది నమ్మకం… వెరసి రవీందర్ రెడ్డి జీవన ప్రయాణం నేటి యువ పారిశ్రామికవేత్తలకు ఒక పాఠ్యపుస్తకం. భార్య.. ప్రియంవద రెడ్డి, కుమారులు.. క్రాంతి కిరణ్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి. ముగ్గురు మనవళ్లు భవిష్యత్తులో మూడో తరం కూడా నిర్మాణ రంగంలోకి వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
బాల్యం.. విద్యాభ్యాసం
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో రవీందర్ రెడ్డి జన్మించారు. తండ్రి కొండకింది పురుషోత్తం రెడ్డి (మాజీ సమితి ప్రెసిడెంట్), తల్లి వజ్రమ్మ. 5వ తరగతి వరకు స్వగ్రామంలోనే తెలుగు మీడియంలో చదివిన ఆయన, 6 నుంచి 9 వరకు నల్లగొండలోని రామగిరి హైస్కూల్‌లో, ఆ తర్వాత మల్టీపర్పస్ హైస్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం ఒడిశాలోని ఆర్‌ఈసీ(ప్రస్తుత ఎన్‌ఐటీ) రూర్కెలాలో ఇంజనీరింగ్ సీటు సాధించారు. అక్కడ రెండేండ్లు చదివాక, హైదరాబాద్ జేఎన్‌టీయూ(మాసబ్ ట్యాంక్)కు ట్రాన్స్‌ఫర్ అయి, 1976లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు.
ఉద్యోగ ప్రస్థానం.. యూనియన్ లీడర్‌గా పోరాటం
ఇంజనీరింగ్ పూర్తవగానే 1976లో ఇరిగేషన్ డిపార్టుమెంట్ (ఖమ్మం, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్)లో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌లో కొనసాగారు. అక్కడ తెలంగాణ జూనియర్ ఇంజనీర్స్ అసోసియేషన్‌కు జనరల్ సెక్రటరీగా, ఆపై అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ‘జూనియర్ ఇంజనీర్’ అనే పోస్టు పేరును ‘అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్’గా మార్చాలని చేసిన పోరాటం ఫలించింది. నాటి సీఎం అంజయ్య హయాంలో ఈ డిమాండ్ నెరవేరింది. నేడు మనం చూస్తున్న ‘అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్’ హౌదా ఆయన కృషి ఫలితమే.
వ్యాపార రంగ ప్రవేశం.. జనప్రియ ఆవిర్భావం
1981లో వివాహం, ఆ తర్వాత కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తొలుత ప్లాట్ల బిజినెస్, కర్మన్‌ఘాట్‌లో 50 ఎకరాల వెంచర్(ఇంజనీర్స్ కాలనీ), కానామెట్‌లలో వెంచర్లు చేశారు. 1985లో ‘ఇంజనీర్స్ సిండికేట్’ స్థాపించి బిల్డర్‌గా మారారు. 1993లో ఇది ‘జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్’గా మారింది. గడిచిన 40 ఏండ్లలో(1985-2025) సుమారు 40,000 అపార్టుమెంట్లను నిర్మించి, దాదాపు 100 వెంచర్లను పూర్తి చేశారు. 1996లో బెంగళూరుకు కూడా తమ నిర్మాణాలను విస్తరించారు.
ప్రభుత్వ విధానాలు – రియల్ ఎస్టేట్ భవిష్యత్తు
ప్రస్తుత రియల్ ఎస్టేట్ పరిస్థితిపై మాట్లాడుతూ.. ఎన్నికల ప్రభావం వల్ల కొంత మందగించినా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పడిపోదన్నారు. ధరలు మరీ విపరీతంగా పెరగడం మంచిది కాదని, సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడే మార్కెట్ బాగుంటుందని విశ్లేషించారు. ప్రభుత్వ విధానాలపై స్పందిస్తూ.. చెరువులను రక్షించడం, భూగర్భ జలాలను పెంచడం కోసం హైడ్రా పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనని, అయితే ప్రారంభంలో పర్మిషన్ ఉన్న బిల్డింగుల కూల్చివేత వల్ల కొంత భయం ఏర్పడిందని అన్నారు. మూసీ సుందరీకరణ.. హైదరాబాద్ రూపురేఖలను మార్చే అద్భుతమైన ప్రాజెక్ట్ అని, దీనివల్ల పొల్యూషన్ తగ్గి, ట్రాన్స్‌పోర్టేషన్ మెరుగుపడుతుందని కొనియాడారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్(ఆర్‌ఆర్‌ఆర్) వల్ల నగర విస్తరణ వేగవంతమవుతుందని తెలిపారు.
ప్రభుత్వానికి సూచనలు
పేద, మధ్యతరగతి ప్రజల కోసం విద్య, వైద్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రవీందర్ రెడ్డి సూచించారు. అసైన్డ్ ల్యాండ్స్‌ను స్కూళ్లకు కేటాయించి, పీపీపీ పద్ధతిలో నడిపితే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందన్నారు. మెడికల్ కాలేజీల్లోని బెడ్స్‌ను వినియోగించుకుని, ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించేలా విధానాలు తేవాలన్నారు.
టెక్నాలజీ, కొత్త తరం
నిర్మాణ రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మ్యాన్యువల్ పద్ధతుల నుంచి 50-60శాతం యంత్రీకరణ వైపు మళ్లారు. హైదరాబాద్‌లో ‘ప్రీ-కాస్ట్’ టెక్నాలజీని (గోడలను ఫ్యాక్టరీలో తయారు చేసి అమర్చడం) సైనిక్ పురి, మియాపూర్ ప్రాజెక్టుల్లో తొలిసారిగా ప్రవేశపెట్టింది తామేనని తెలిపారు. ప్రస్తుతం తన ఇద్దరు కుమారులు కూడా వ్యాపారంలో రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు క్రాంతి కిరణ్ రెడ్డి ‘జనప్రియ అప్ స్కేల్’ పేరుతో, చిన్న కుమారుడు రవి కిరణ్ రెడ్డి ‘జనప్రియ వెంచర్స్’ పేరుతో వేర్వేరుగా ప్రాజెక్టులు చేపడుతున్నారు. చిన్న కోడలు కూడా వ్యాపారంలో సహకరిస్తున్నారని తెలిపారు. అమెరికాలో కూడా చిన్నపాటి కమర్షియల్ వెంచర్స్ (స్ట్రిప్ మాల్స్) చేపట్టినట్టు వెల్లడించారు.
మధ్యతరగతి ప్రజలే బలం
”ఉద్యోగస్తులు అద్దె రూపంలో కట్టే డబ్బునే, లోన్ ఇన్‌స్టాల్‌మెంట్(ఈఎంఐ)గా మార్చి వాళ్లను ఓనర్స్ చేయడమే మా సిద్ధాంతం” అని రవీందర్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మియాపూర్‌లో లక్ష రూపాయలకు అమ్మిన ఇల్లు నేడు 30 లక్షల విలువ చేస్తోందని, రూ.10,000 పెట్టుబడితో సామాన్యుడు నేడు మిలియనీర్ కావడం తనకు ఎంతో తృప్తినిస్తుందని చెప్పారు. కేవలం లాభాపేక్ష కాకుండా, ”ఎఫర్టబుల్ హౌసింగ్”(అందుబాటు ధరల్లో ఇండ్లు) అందించడమే తమ ప్రత్యేకత అని, అందుకే తమకు పోటీ ఎవరూ లేరని ఆయన అభిప్రాయపడ్డారు.



