Monday, November 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనన్ను.. అవమానించారు

నన్ను.. అవమానించారు

- Advertisement -

ట్రంప్‌ వ్యాఖ్యలపై రిపబ్లికన్‌ సభ్యురాలి ఆగ్రహం
ప్రతినిధి సభకు రాజీనామా
వాషింగ్టన్‌ :
అమెరికా ప్రతినిధి సభకు రాజీనామా చేస్తానని రిపబ్లికన్‌ సభ్యురాలు మర్జోరీ టేలర్‌ గ్రీన్‌ ప్రకటించారు. ఒకప్పుడు దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి మద్దతుదారైన గ్రీన్‌ ఇటీవల ఆయనతో విభేదించారు. సుదీర్ఘ ప్రకటన ద్వారా ఆమె తన రాజీనామా నిర్ణయాన్ని శుక్రవారం పొద్దుపోయిన తర్వాత సామాజిక మాధ్యమంలో తెలియజేశారు. ‘విధేయత అనేది ఇరు వైపుల నుంచి ఉండాలి’ అని అందులో వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఏలుబడిలో కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి గురైందని గ్రీన్‌ ఆరోపించారు.

ఎవరి కోసమైతే పోరాడానో వారే అవమానించారు
‘ప్రతినిధి సభ సభ్యురాలిగా నేను ఎప్పుడూ సాధారణ అమెరికా పురుషులకు, అలాగే మహిళలకు ప్రాతినిధ్యం వహించాను. అందుకే నన్ను వాషింగ్టన్‌ డీసీలో అవమానించారు. నేను ఏనాడూ అందులో ఇమడలేకపోయా’ జార్జియా నుంచి ప్రతినిధి సభకు ఎన్నికైన గ్రీన్‌ తన వీడియో పోస్ట్‌లో తెలియజేశారు. వచ్చే సంవత్సరం జనవరి ఐదవ తేదీన ప్రతినిధి సభకు గుడ్‌బై చెబుతానని అన్నారు. ఎవరి కోసమైతే పోరాడామో ఆ దేశాధ్యక్షుడే తనపై బాధాకరమైన, ద్వేషపూరితమైన చర్యకు పాల్పడ్డారని అంటూ దానిని కుటుంబసభ్యులు, మద్దతుదారులు భరించాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు.

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో వివాదం
గ్రీన్‌ ప్రకటనపై ట్రంప్‌ స్పందిస్తూ ఇది దేశానికి గొప్ప వార్త అని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా బాగుంది’ అని ట్రంప్‌ను ఉటంకిస్తూ ఏబీసీ న్యూస్‌ తెలిపింది. ట్రంప్‌ చేపట్టిన ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ (మాగా) ఉద్యమానికి గ్రీన్‌ ఓ చిహ్నంగా నిలిచారు. అయితే ఆ తర్వాత ట్రంప్‌ ఆమెను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కు అన్ని రకాల మద్దతును ఉప సంహరించుకుంటున్నానని ప్రకటించారు. లైంగిక నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్‌ విడుదల విషయంలో ట్రంప్‌తో ఆమె విభేదించారు. ఎప్‌స్టీన్‌ వ్యవహారం డెమొక్రాట్ల మోసం అంటూ తొలుత హూంకరించిన ట్రంప్‌, ఆ తర్వాత డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సభ్యుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో వాటి విడుదలకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను విడుదల చేయాలంటూ ప్రతినిధి సభతో పాటు సెనెట్‌ కూడా తీర్మానాలను ఆమోదించడంతో ట్రంప్‌నకు వేరే దారి లేకపోయింది.

‘మాగా’కు బీటలు
ట్రంప్‌ పోస్టుల తర్వాత తనకు అనేక బెదిరింపులు వస్తున్నాయని గ్రీన్‌ తెలిపారు. 2026లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో గ్రీన్‌ రాజీనామా నిర్ణయం రిపబ్లికన్‌ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇటీవల పలు రాష్ట్రాల గవర్నర్‌ పదవులకు జరిగిన ఎన్నికలలో డెమొక్రాట్లు గణనీయమైన విజయాలు నమోదు చేసుకున్నారు. అంతేకాక ట్రంప్‌నకు కంటిలో నలుసులా మారిన మమ్దానీ న్యూయార్క్‌ మేయర్‌గా ఘన విజయం సాధించారు. ‘మాగా’ ఉద్యమం బీటలు వారుతోందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

బాధితుల పక్షాన నిలవడం ద్రోహమా?
గ్రీన్‌ తన రాజీనామా ప్రకటనలో ఎప్‌స్టీన్‌ వివాదాన్ని ప్రస్తావించారు. ‘పద్నాలుగు సంవత్సరాల వయసులో లైంగికదాడికి గురైన అమెరికా మహిళల పక్షాన నేను నిలబడ్డాను. ధనవంతులు, శక్తివంతులు అయిన పురుషుల చేతిలో అక్రమ రవాణాకు గురైన వారి కోసం నిలబడ్డాను. అలాంటి నన్ను అధ్యక్షుడు ద్రోహి అన్నారు.
ఆయన అలా అని ఉండకూడదు. నేను ఎవరి కోసమైతే పోరాడానో ఆ వ్యక్తి నన్ను బెదిరించి ఉండకూడదు’ అని అన్నారు. కాగా గాజాపై అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్‌ జరిపిన దాడిని గ్రీన్‌ మారణహోమంగా గతంలో అభివర్ణించారు. ఇజ్రాయిల్‌ చర్యను తూర్పార పట్టిన తొలి రిపబ్లికన్‌ సభ్యురాలు ఆమే. గ్రీన్‌ వ్యాఖ్యలపై మండిపడిన ట్రంప్‌ ఆమెను కించపరుస్తూ తన ట్రూత్‌ సోషల్‌ వేదికలో అనేక పోస్టులు పెట్టారు. ఆమెను చులకన చేసేలా వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్‌ పార్టీకి ఆమె ద్రోహం చేసిందని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -