– సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిసెంబర్ 3న జరిగే సీఐటీయూ మూడో జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని, ఈ సభలకు జిల్లా నలుమూలల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను సమీక్షించుకుని రానున్న కాలంలో జరిగే ఉద్యమ రూపాన్ని నిర్మించుకునేందుకు ఈ మహాసభలో చర్చిస్తామన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను , కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డున పడేసే చర్యలకు పాల్పడుతునాయని అన్నారు.
కార్మికులు తమ హక్కుల సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం సంఘం ఏర్పాటు చేసుకొని సమ్మెలు ధర్నాలు పోరాటాలు నిరసనలు వ్యక్తం చేసే హక్కు తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ కోర్టులను కొత్త చట్టాలను తీసుకొచ్చి, కార్మికులు పోరాడి ప్రాణాలర్పించి తీసుకొచ్చిన పని గంటల విధానాన్ని తొలగిస్తూ దేశంలో ఉన్న లక్షలాది మంది కార్మికులను పొట్టలు కొట్టే పని బిజెపి ప్రభుత్వం చేస్తుందన్నారు. అందుకే ఈ విధానాలను ప్రతిఘటించే అవసరం ఉందన్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ముదాం అరుణ్ కుమార్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.



