జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్..
రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో చాలా రోజులుగా ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించుటకు సమయం కేటాయించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. వారం రోజుల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణి ఫిర్యాదు స్టేటస్ పై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
కార్మికుల భీమా పెంపు పోస్టర్ ఆవిష్కరణ..
భవన, ఇతర నిర్మాణ రంగాలకు చెందిన( అవ్యవస్థికృత రంగం )కార్మికులు సంక్షేమం కొరకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ప్రభుత్వం లేబర్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశం పెట్టిందని అట్టి పథకాన్ని జిల్లాలోని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు. భవన నిర్మాణ కార్మికులు చాలా ఎత్తు లో పనిచేస్తారని ప్రమాదవశాత్తు అనుకోని సంఘటన జరిగి మరణిస్తే 10 లక్షలు, శాశ్వత అంగ వైకల్యం రూ.6 లక్షలు, పాక్షిక అంగ వైకల్యం రూ.4 లక్షలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కార్మిక భీమా పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నందున అవ్యవస్థికృత రంగానికి చెందిన కార్మికులు అందరు లేబర్ ఇన్సూరెన్స్ లో రిజిస్ట్రి చేసుకొనేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇప్పటికే జిల్లాలో 1,35,885 మంది కార్మిక భీమా లో రిజిస్ట్రి అయి ఉన్నారని తెలిపారు. తదుపరి కార్మిక భీమా పెంపు పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 25 దరఖాస్తులు,ఎంపిడిఓ లకు 11, డి డబ్ల్యూ ఓ కు 4,ఆర్డీఓ లకు 3 మిగిలిన 23 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 66 దరఖాస్తు లు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని అదనపు కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాదవ్, డి ఆర్ డి ఓ వివి అప్పారావు,హౌజింగ్ పిడి సిధార్థ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అరుణ,డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి,డి డబ్ల్యూ ఓ నరసింహారావు,వెల్ఫేర్ అధికారులు శంకర్,దయానంద రాణి,నరసింహారావు, శ్రీనివాస్ నాయక్,డి ఈ ఓ ఆశోక్,డి ఐ ఈ ఓ బాను నాయక్,డి ఎం హెచ్ ఓ వెంకట రమణ,అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



