నవంబర్ 25న అంతర్జాతీయ ‘మహిళలు, బాలికల హింస నిర్మూలన దినం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న హింస గురించి అనేక నివేదికలు బయటకు వస్తున్నాయి. మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం ఒక ఆప్షన్ కాదు. శాంతితో పాటు వారి ఆరోగ్యానికి, అభివృద్ధికి ఇది ఒక అవసరం అని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే 2030 నాటికి మహిళలు, బాలికలపై జరిగే అన్ని రకాల హింసను నిర్మూలించాలనే లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టమే అనిపిస్తోంది. ఇక ఇటీవల కాలంలో పెరిగిపోతున్న డిజిటల్ హింసను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ‘బాలికలు, మహిళలపైన జరుగుతున్న డిజిటల్ హింసను అరికట్టేందుకు అందరం ఏకమవుదాం’ అనే నినాదాన్ని ఇచ్చింది. నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 మానవ హక్కుల దినం వరకు దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2023లో భారతదేశంలో 15-49 ఏండ్ల మధ్య వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది భాగస్వామి హింసకు గురయ్యారు. దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో హింసకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతీ ముగ్గురిలో ఒకరు లేదా 840 మిలియన్ల మంది వారి జీవితకాలంలో భాగస్వామి, లైంగిక హింసను ఎదుర్కొన్నారని పేర్కొంది. 2000 సంవత్సరం నుంచి ఈ సంఖ్య చాలా తగ్గిందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 15-49 ఏండ్ల వయసు గల మహిళల్లో 8.4 శాతం మంది భాగస్వామి కాని వ్యక్తి నుంచి లైంగిక హింసకు గురయ్యారని కూడా వివరించింది. ఇక భారతదేశంలో చూస్తే 15 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో దాదాపు నాలుగు శాతం మంది భాగస్వామి కాని వ్యక్తి నుంచి లైంగిక హింసను ఎదుర్కొన్నట్లు పేర్కొంది.
భయంతో బతుకుతున్నారు
‘మహిళలపై హింస అనేది అత్యంత పురాతన, అత్యంత విస్తృతమైన అన్యాయాల్లో ఒకటి. అయినప్పటికీ ఇప్పటికీ దీనికి వ్యతిరేకంగా అతి తక్కువగా చర్యలు తీసుకుంటున్న వాటిలో ఇది ఒకటి. ఏ సమాజం న్యాయంగా, సురక్షితంగా లేదా ఆరోగ్యంగా చెప్పుకోలేని సమయంలో అందులోని జనాభాలో సగం మంది భయంతోనే జీవిస్తున్నారు. ఈ హింసను అంతం చేయడం కేవలం విధానానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది గౌరవం, సమానత్వం, మానవ హక్కులకు సంబంధించిన అంశం. ప్రతి గణాంకాల వెనుక ఒక మహిళ లేదా బాలిక జీవితం శాశ్వతంగా మారిపోతుంది.’ అంటున్నారు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్.
హింస రూపం మార్చుకుంది
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై హింస జరుగుతూనే ఉంది. అయితే మన దేశంలో హింస అనేక రూపాలో ఉంటుంది. చాలా చోట్ల అది కంటికి కనబడదు కూడా. ఎందుకంటే మన దగ్గర కులవ్యవస్థ, వివక్ష, పిత్రుస్వామ్య భావజాలం బలంగా వేళ్లూనుకొని ఉన్నాయి. నిజానికి మహిళలను హింసించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం అనే ధోరణి ఉంది. అనేక సామాజిక ఒత్తిడులు మహిళలను అణిచివేస్తున్నాయి. శారీరికంగా, మానసికంగా ఆర్థికంగా, రాజకీయంగా మహిళలపై హింస తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత ఉన్న హింసలకు ఇది కూడా తోడై మహిళలకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. ఇక అణగారిన మహిళల పరిస్థితి అయితే మరింత దారుణంగా. ఒకపక్క వరకట్న హింస, గృహహింస, బాల్యవివాహాలు, లైంగిక దాడులు, వేధింపులు, కులం, మతం పేరుతో జరిగే దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆమె శరీరంపై ఆమెకు హక్కు లేకుండా పోతుంది. ఇటీవల చదువు అందుబాటులోకి వచ్చి, కొన్ని హక్కులు మహిళలు సాధించుకున్నారు. కానీ హక్కులు ఎంతగా సాధించుకుంటున్నారో అదే స్థాయిలో హింస కూడా పెరిగిపోతుంది. సోషల్ మీడియా వేదికగా అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హింస కొత్తరూపంలోకి మారిపోయింది. ఎవరు మాట్లాడున్నారో, ఆ కామెంట్లు ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వేధింపులపై ప్రభుత్వాలు, అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. అందరూ ఐక్యంగా పోరాడాలి. – దీప్తి, సోషల్ యాక్టివిస్ట్
సెక్షన్ 79ను ప్రచారం చేయాలి
మహిళలపై హింస అనేది ఒక సాధారణ విషయంలా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో జరిగే హింసకు ఎలాంటి అడ్డూఅదుపు లేదు. అయితే బిఎన్‌ఎస్ సెక్షన్ 79 ప్రకారం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు. మహిళ గౌరవాన్ని కించ పరిచేలా ఎలాంటి చర్య చేసిన అంటే ఒక వీడియో చేసినా, బూతు మాట్లాడినా, ఆమె వ్యక్తిగత గోప్యానికి భగం కలిగించేలా ఆమె ఫొటోలు వైరల్ చేసినా అది నేరం. దీనికి మూడేండ్లు జిల్లు శిక్ష, ఫైన్ ఉంటుంది. ఈ సెక్షన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. మహిళలను గౌరవించడం కనీస సభ్యత, సంస్కారం. ఇది లేని వాళ్లు ఏది పడితే అది మాట్లాతూ కామెంట్లు చేస్తున్నారు. ఇనిస్టాలో, ఎక్స్‌లో, ఫేస్‌బుక్‌లో చాలా మందికి బూతులు మాట్లాడడం ఒక ఫ్యాషన్‌లా మారిపోయింది. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి మహిళ, అమ్మాయి ఏదో ఒక రూపంలో హింసకు గురవుతూనే ఉంది. నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే విమర్శించవచ్చు. ఆధారాలతో సహా నిరూపించి నాపై చర్యలు తీసుకోవచ్చు. నన్ను కౌంటర్ చేయవచ్చు. కానీ అలా కాకుండా ఇలా అసభ్యంగా మాట్లాడడం, కామెంట్లు పెట్టడం సరైనది కాదు. దీనిపైనే మేము ఉమెన్ జర్నలిస్టులందరం సజ్జనార్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిసి కంప్లైంట్ ఇచ్చాము. అధికారులు వెంటనే స్పందించి విచారణ మొదలుపెట్టారు.– తులసి చందు, జర్నలిస్ట్
కఠిన చర్యలు తీసుకుంటేనే…
డిజిటల్ హింసను ఎదుర్కొన్న వాళ్లలో నేనూ ఉన్నాను. బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాతున్నారు. నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు. కామెంట్లు పెడుతున్నారు. బూతు పదాలను, మహిళలను కించపరిచే పదాలను సోషల్ మీడియాలో నిషేధించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. హిందీలో ‘రండి’ అనే పదాన్ని నిషేధించాలని అక్కడి వాళ్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అలాగే మన తెలుగులో కూడా మహిళలను కించ పరిచేందుకు ఉపయోగిస్తున్న పదాలను నిషేధించాలి. ఇలాంటి వాళ్లందరూ దొంగ అకౌంట్లు పెట్టుకొని కామెంట్లు చేస్తుంటారు. కొందరు కేవలం అమ్మాయిలను తిట్టడానికే అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లను వదిలేస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఇలాంటి వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్లు భయపడే అవకాశం ఉంటుంది.– కడలి, రచయిత
– సలీమ



