– 50 శాతానికి పెరిగిన మార్కెట్ వాటా
– క్రిప్ హై మార్క్ రిపోర్ట్
న్యూఢిల్లీ : గృహ రుణాల్లో ప్రయివేటు రంగ బ్యాంక్‌లు అధిక వడ్డీ రేట్లను వసూలు చేయడంతో రుణగ్రహీతలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ విభాగం రుణాల మార్కెట్‌ల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్ (పీఎస్‌బీ)ల మార్కెట్ వాటా 50 శాతానికి చేరిందని ఓ రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. ఇటీవల ఆర్బీఐ వరుసగా తగ్గించిన వడ్డీ రేట్లను ఖాతాదారులకు బదిలీ చేయడంలో ప్రయివేటు విత్త సంస్థలు సరిగ్గా స్పందించకపోవడంతో రుణగ్రహీతలు పిఎస్‌బిలను ఆశ్రయించి ఉండొచ్చని తెలుస్తోంది. తీవ్ర పోటీ కలిగిన ఈ రుణ మార్కెట్‌లో ప్రయివేటు రంగ బ్యాంక్‌లను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు అధిగమించాయని క్రెడిట్ బ్యూరో సంస్థ క్రిఫ్ హై మార్క్ సోమవారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. సెప్టెంబర్ నాటికి కొత్తగా జారీ చేయబడిన మొత్తం గృహ రుణాల విలువలో పీఎస్‌బీల వాటా 50 శాతానికి చేరుకుందని తెలిపింది. ఆ రిపోర్ట్ వివరాలు.. గృహ రుణాల జారీలో ప్రయివేటు రంగ బ్యాంకులను పీఎస్‌బీలు అధిగమించి మార్కెట్ లీడర్‌షిప్‌ను సాధించాయి. మొత్తం గృహ రుణాల మార్కెట్ సెప్టెంబర్ చివరి నాటికి రూ. 42.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఏడాదికేడాదితో పోల్చితే 11.1 శాతం పెరుగుదల నమోదయ్యింది.మొత్తం యాక్టివ్ రుణాల సంఖ్య స్వల్పంగా పెరగడంతో పాటుగా సగటు రుణ మొత్తం పెరిగింది. దాదాపు 40 శాతం గృహ రుణాలు రూ.75 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగినవిగా ఉండటం విశేషం. మొత్తం వినియోగ రుణాల విభాగం 15.3 శాతం పెరిగి రూ.109.6 లక్షల కోట్లకు చేరుకుందని క్రిఫ్ హై మార్క్ తెలిపింది. ”ఈ విభాగంలో బంగారంపై రుణాలు వేగవంతమైన వృద్ధిని సాధించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు విలువ, సంఖ్యలోనూ తమ మార్కెట్ అధిపత్యాన్ని పెంచుకున్నాయి. భౌగోళికంగా జనాభా విభాగాలలో మరింత బాధ్యతాయుతంగా విస్తృత ఆధారిత ఆర్థిక సాధికారతను ప్రోత్సహించాయి.” అని క్రిఫ్ హై మార్క్ చైర్మెన్ సచిన్ సేథ్ పేర్కొన్నారు. గడిచిన సెప్టెంబర్ ముగింపు నాటికి కన్స్యూమర్ డ్యూరెబుల్స్ రంగం రుణాల జారీలు మందగించి.. 10.2 శాతం పెరుగుదలతో సరిపెట్టుకున్నాయని ఆ సంస్థ పేర్కొంది. మొండి బాకీలు, ఆస్తి నాణ్యత అంశంలో వినియోగ రుణాలలో 31-180 రోజులు బకాయి ఉన్న రుణాల నిష్పత్తి జూన్‌లో 3.1 శాతంగా ఉండగా.. సెప్టెంబర్‌లో 3 శాతానికి తగ్గగా.. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 3.3 శాతంగా ఉందని ఆ సంస్థ తెలిపింది.
గృహరుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు భళా
- Advertisement -
- Advertisement -



