Tuesday, November 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌లో కార్పొరేషన్‌ ఆశలు

కాంగ్రెస్‌లో కార్పొరేషన్‌ ఆశలు

- Advertisement -

ఎదురు చూస్తున్న యువ నేతలు
పార్టీ కోసం పని చేసిన
వారికే ఇవ్వాలంటూ విజ్ఞప్తులు
భర్తీపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి
పీసీసీ చీఫ్‌తో సమాలోచనలు
త్వరలోనే ముహూర్తం
-బి.వి.యన్‌.పద్మరాజు

అధికార కాంగ్రెస్‌లో ‘కార్పొరేషన్‌’ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూసున్నారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకూ పార్టీ కోసం కష్టపడిన నేతలందరూ వాటిపై గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నా.. పార్టీనే అంటిపెట్టుకుని ఉండి, 2023 అసెంబ్లీ, పార్లమెంటు, తాజాగా జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో గెలుపుకోసం పని చేసిన యువ నాయకులందరూ తమకు ‘సముచిత స్థానం’ కోసం పడిగాపులు కాస్తున్నారు. వీరితోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు సైతం పదవులను ఆశిస్తున్నారు. డిసెంబరు 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరి రెండేండ్లు పూర్తవుతుంది. ఎన్నికలకు మరో మూడేండ్ల సమయముంది. అందువల్ల ఇప్పుడు తమకు కార్పొరేషన్‌ చైర్మెన్ల పదవులను కట్టబెడితే… అది అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఉపయోగకరమని వారు అభిప్రాయపడుతున్నారు. త్వరలో గ్రామ పంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వంలో భాగస్వాములైతే, ఆ హోదాతో ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసేందుకు వీలు కలుగుతుందని పలువురు యువ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొన్ని కార్పొరేషన్లకు చైర్మెన్లను, పాలక మండలి సభ్యులను నియమించింది. కానీ మరికొన్ని సంస్థల్లోని ఆయా పోస్టులను భర్తీ చేయలేదు. ‘సరైన’ సమయంలో వాటిని నింపాలన్నది సీఎం రేవంత్‌ రెడ్డి యోచనగా కనబడుతున్నది. ఆర్టీసీ, సాగునీటి పారుదల, వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, హెచ్‌ఎమ్‌డీఏ, మూసీ రివర్‌ ఫ్రంట్‌, టెస్కో (గతంలో ఆప్కో)తోపాటు పద్మశాలి కార్పొరేషన్ల(బీఆర్‌ఎస్‌ హయాంలో కొత్తగా ఏర్పాటు చేశారు)లో చైర్మెన్లు, పాలక మండలి సభ్యుల పోస్టులను భర్తీ చేయలేదు. వీటితోపాటు మొత్తం 25 నుంచి 30 కార్పొరేషన్లలోని పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మరోవై పు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేసిన పలు కార్పొరేషన్ల చైర్మెన్ల పదవీ కాలం కూడా మరో రెండు మూడు నెలల్లో పూర్తి కాబోతోంది. అవి ఖాళీ అయితే వాటిని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసి మొత్తం 50 కార్పొరేషన్ల వరకూ ఉంటాయన్నది అంచనా. ఈ నేపథ్యంలో తాము పార్టీకి చేసిన సేవలు, తమకున్న అర్హతలను సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ గుర్తించాలని పలువురు కోరుతున్నారు.

సీఎం నజర్‌…
రానున్న పంచాయతీ, ఆ తర్వాత నిర్వహించబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవటం ద్వారా హస్తం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. కార్పొరేషన్లలోని పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయటం ద్వారా యువ నాయకత్వాన్ని గ్రౌండ్‌లోకి దింపి, తమ గెలుపును మరింత సులువు చేసుకోవాలన్నది ఆయన వ్యూహంగా కనబడుతున్నది. ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం. సమీకరణా లన్నీ కుదిరితే చైర్మెన్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే ముహూ ర్తం ఖరారవుతుందని గాంధీ భవన్‌ వర్గాలు తెలిపాయి. కాగా తాజాగా ఏఐసీసీ ప్రకటించిన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల (డీసీసీ) జాబితాలో కొందరు కార్పొరేషన్‌ చైర్మెన్లు కూడా ఉన్నారు. అయితే ఒకే వ్యక్తికి పార్టీ, ప్రభుత్వ పదవులు ఉండకూడదనే నిబంధన నేపథ్యంలో ఇది చర్చనీయాంశమవుతోంది. అయితే అలా రెండు పోస్టుల్లో ఉన్న వారి కాలపరిమితి (కార్పొరేషన్‌ చైర్మెన్‌కు సంబంధి ంచి) మరికొద్ది నెలల్లో పూర్తి కాబోతోంది. అందువల్ల అప్పటి వరకూ వారినే కొనసాగించి, ఆ తర్వాత కొత్తవారితో వాటిని భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. రెండేండ్ల నుంచి చైర్మెన్‌ పదవుల్లో ఉన్న వారి పని తీరుపట్ల ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. అందువల్ల ఆ పోస్ట్లుల్లో కొత్త వారినే నియమించనున్నారని సమాచారం.

రేసులో ఉన్నది వీరే…
కార్పొరేషన్‌ చైర్మెన్ల పోస్టుల కోసం అధికార పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఎప్పటి నుంచో పార్టీ కోసం పని చేసిన వారు ఈ రేసులో మొదటి స్థానంలో ఉండి, తమవంతు ‘ప్రయత్నాలను’ ముమ్మరం చేశారు. దూడం వెంకటరమణ (బీసీ), మల్లాది పవన్‌ (ఓసీ), చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ (బీసీ), లింగం యాదవ్‌ (బీసీ), బూసా వేణు యాదవ్‌ (బీసీ), గుమ్ముల మోహన్‌రెడ్డి, భూపతి రెడ్డి (ఓసీ), మానవతా రారు (ఎస్సీ), కొల్కుండ సంతోశ్‌ (బీసీ), జ్ఞానేశ్వర్‌ (ఎస్సీ) తదితరులు కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -