Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవర్కింగ్‌ జర్నలిస్టుల చట్టాల రద్దు అప్రజాస్వామ్యం

వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టాల రద్దు అప్రజాస్వామ్యం

- Advertisement -

– చట్టాల పునరుద్ధరణ చేసే వరకూ పోరుబాట :టీడబ్ల్యూజేఎఫ్‌ నాయకులు రాంచందర్‌, బసవ పున్నయ్య
– టీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా
నవతెలంగాణ- సిటీబ్యూరో

కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకునే వరకు కార్మికులు, జర్నలిస్టులు పోరాటం చేయాలని జర్నలిస్టుల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని కేంద్ర కార్మికశాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌), హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌ఐయూజే) ఆధ్వర్యంలో కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, జర్నలిస్టుల ఐక్యత జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటలపాటు ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ఫెడరేషన్‌ అడహాక్‌ కమిటీ కన్వీనర్‌ పి.రాంచందర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. కార్మికులను గాలికొదిలేసి కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవరిస్తున్నదన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం అన్యాయమన్నారు. వెంటనే లేబర్‌ కోడ్‌ల నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య మాట్లాడుతూ.. ఉన్న రెండు వర్కింగ్‌ జర్నలిస్ట్‌ చట్టాలను రద్దు చేయడాన్ని ఖండించారు. జర్నలిస్టులకు కోడ్‌లు విఘాతంగా మారాయన్నారు. అనంతరం సెంట్రల్‌ డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ బిశ్వ భూషణ్‌ పృష్టికి ఫెడరేషన్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు.

కోడ్‌లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి : జె.వెంకటేష్‌
జర్నలిస్టులనుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. కార్మిక చట్టాలు స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త లేబర్‌ కోడ్‌లను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.ప్రభాకర్‌, గుడిగ రఘు, బి.రాజశేఖర్‌, దామోదర్‌, జి.మాణిక్‌ ప్రభు, కార్యదర్శులు ఈ.చంద్రశేఖర్‌, నవీన్‌, కార్యవర్గ సభ్యులు మణిమాల, హరిప్రసాద్‌, మేకల కృష్ణ, మధుకర్‌, హెచ్‌యూజే అధ్యక్షులు బి.అరుణ్‌ కుమార్‌, కార్యదర్శి బి.జగదీశ్వర్‌, హెచ్‌యూజే నాయకులు లలిత, రమాదేవి, రత్నాకర్‌, తలారి శ్రీనివాసరావు, జీవన్‌రెడ్డి, రమేష్‌, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సైదులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -