Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి దిగుమతులపై పన్ను ఎత్తేసిన మోడీ

పత్తి దిగుమతులపై పన్ను ఎత్తేసిన మోడీ

- Advertisement -

– 26న రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు :తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌
– కపాస్‌ కిసాన్‌ యాప్‌ను వెనక్కి తీసుకోవాలి : పత్తి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ భూక్య చందు నాయక్‌
– మహబూబ్‌నగర్‌లోని సీసీఐ రీజినల్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌

దేశంలో పత్తి రైతులకు ఈ దుస్థితి రావడానికి ఆగస్టు నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పత్తి విదేశీ దిగుమతులపై 11శాతం పన్ను ఎత్తేయడమేనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, పత్తి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ భూక్య చందునాయక్‌ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, గద్వాల జిల్లాల నుంచి రైతు సంఘం నాయకులు, రైతులు కలిసి మహబూబ్‌నగర్‌లోని సీసీఐ రీజినల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్‌, చందునాయక్‌ మాట్లాడుతూ.. పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం తగ్గించడం వల్ల.. అమెరికా నుంచి పత్తి బేళ్లు దిగుమతి అవుతున్నాయని, దీంతో ఇక్కడి రైతుల పంటలపై అనేక ఆంక్షలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన పత్తికి డిమాండ్‌ తగ్గి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, పంటను అమ్ముకోవడానికి కొర్రీలు పెట్టడంతోపాటు కపాస్‌ కిసాన్‌ యాప్‌ తెచ్చారన్నారు. ఎకరానికి ఏడు క్వింటాళ్లే కొంటామనే నిబంధన ఎత్తేయాలని, గతంలో ఉన్న విధంగా12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.
తేమతో నిమిత్తం లేకుండా సీసీఐ ద్వారా రైతుల పత్తి పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలన్నారు. కపాస్‌ యాప్‌ వల్ల కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యాప్‌ అమలును వెనక్కి తీసుకోవాలన్నారు. మ్యాపింగ్‌ పేరుతో కాటన్‌ మిల్లుల దగ్గరలో ఉన్న గ్రామాల రైతులను సుదూర ప్రాంతాలకు పంపడం వల్ల రవాణా చార్జీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాపింగ్‌ పద్ధతిని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఈనెల 26వ తేదీన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య అశోక్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షులు బాల్‌రెడ్డి, గద్వాల జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, రాష్ట్ర నాయకులు ఏ.రాములు, పత్తి రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -