నవతెలంగాణ భీమ్‌గల్: మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారు అతని ఇద్దరు భార్యలు. ఈ దారుణం ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేట్‌లో సోమవారం వెలుగు చూసింది. సీఐ సత్యనారాయణ, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మలావత్ మోహన్(42) 2001లో మానాల గ్రామానికి చెందిన కవితను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. కొడుకు కోసమని తాళ్లపల్లికి చెందిన సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకూ ముగ్గురు కుమార్తెలే పుట్టగా.. ఒకరు చనిపోయారు.
అతడు బ్యాండ్ వాయిస్తుండగా, భార్యలిద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. మోహన్ తరచూ మద్యం తాగొచ్చి వారితో గొడవ పడుతూ వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి కూడా గొడవకు దిగి వారిని గదిలో బంధించాడు. దీంతో వారు భర్తను హతమార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం పెట్రోల్ కొని తీసుకొచ్చారు. ఇంటి ఆవరణలో కుర్చీలో నిద్రపోతున్న అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి వారు పారిపోయారు. మంటలు అంటుకొని మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.



