నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని జనగామ, వరంగల్, జగిత్యాల జిల్లాల్లో చోటుచేసుకున్న జంతువుల వికృత్యాలు, బ్లాక్-మ్యాజిక్ / క్షుద్రపూజల ఘటనలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ నెల 24న మీడియా కథనాల్లో ప్రచురితమైన వార్తలను పరిగణనలోకి తీసుకొని, కమిషన్ ఛైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కూడా జరిగినట్లు వార్తల్లో వెల్లడైన నేపథ్యంలో, పాఠశాల పిల్లల్లో భయం, మానసిక కల్లోలం నెలకొనే అవకాశం ఉందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి కార్యకలాపాలు ప్రజా శాంతి, భద్రత పరిరక్షణలో లోపాలను సూచిస్తున్నాయని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో జనగాం, వరంగల్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు, వరంగల్ పోలీస్ కమిషనర్, జగిత్యాల ఎస్పీ లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జంతు వికృత్యాలపై ఇప్పటి వరకు జరిగిన విచారణ, తీసుకున్న చర్యలు, పాఠశాల ప్రాంగణాలు సహా ప్రజా ప్రదేశాల్లో భద్రతా చర్యలు వంటి అంశాలపై వివరాలతో కూడిన వాస్తవ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. సంబంధిత అధికారులు తమ నివేదికలను డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు మంగళవారం TGHRC ఒక ప్రకటన విడుదల చేసింది.



