మన దేశ చరిత్రలో నవంబర్ 26కు ఒక ప్రత్యేకత ఉంది. పౌరులందరికీ స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించాలని సంకల్పించిన రోజు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ సుమారు మూడేండ్ల పాటు శ్రమించి మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగమంటే కేవలం పరిపాలనా చట్టాల సంకలనం మాత్రమే కాదు. దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే మార్గదర్శి. జాతీయోద్యమ ఆకాంక్షలకు ప్రతిరూపం. అటువంటి రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడింది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏ మాత్రం భాగం కానివారు నేడు దేశాన్ని పాలిస్తున్నారు. రాజ్యాంగాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకోజూస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అడుగడుగునా హననం చేస్తున్నారు. అసలు రాజ్యాంగం మౌలిక సూత్రాలనే మార్చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ స్థానంలో మనుధర్మాన్ని తెచ్చిపెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత వివరణాత్మకమైన లిఖిత రాజ్యాంగాల్లో ఒకటి. రాజ్యాంగం ద్వారానే భారత దేశం సర్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యాంగ ప్రకటించబడింది. సామాజిక న్యాయం, సమానత్వం వంటి సూత్రాలు స్థాపించ బడ్డాయి. ప్రతి పౌరునికీ సమాన హక్కులు, స్వేచ్ఛ హామీగా ఇవ్వబడ్డాయి. దీని ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి నుండి సామాన్య పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి బద్ధులే. కానీ నేటి పాలకుల వల్ల ఈ హక్కులన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అనే రాజ్యాంగ వాక్కులకు విలువే లేకుండా చేస్తున్నారు. సాటి మనిషిని మనిషిగా గుర్తించలేని స్థితికి మనిషిని దిగజార్చుతున్నారు.
ఇక పౌరులకు ఇచ్చినట్టే రాష్ట్రాలకు కూడా మన రాజ్యాంగం కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తి అనే పదానికి అర్థమే మార్చే స్తున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన అదనపు వనరుల్ని ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలే దీనికి ఉదాహరణలు. అలాగే గవర్నర్‌లను తమ చేతుల్లో పెట్టుకొని బీజేపీయేతర రాష్ట్రాల హక్కులను, అధికారాలను హరించి వేస్తున్నారు. ఉన్నత విద్యను ఛాన్సలర్ల హోదాలో గవర్నర్లు తమ పరిధిలోకి తీసుకుంటు న్నారు. శాసనసభ పంపే బిల్లులను పక్కన పెడుతున్నారు. శాసన వ్యవస్థ అధికారాలను అణచివేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ప్రజలను మతం, కులం పేరిట విభజించేందుకు పౌరసత్వచట్ట సవరణను తీసుకొచ్చారు. ఇక ఎన్నికల కమిషన్ అయితే తమ జేబు సంస్థగా మార్చుకున్నారు. రాజ్యాంగం పౌరునికి ఇచ్చిన ఓటు హక్కుకు కూడా గ్యారంటీ లేకుండా చేస్తున్నారు. సర్ పేరిట బీహార్‌లో 69 లక్షల ఓట్లను ఇలాగే మింగేశారు. ఇప్పుడు దేశమంతటా ఇదే పద్ధతి అనుసరించాలని చూస్తున్నారు. ఇలా రాజ్యాంగ బద్దమైన స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేసి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సామాన్యుల సమస్యలను పక్కన పెట్టి కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారు. ప్రజల శ్రమను దోచుకుంటున్నారు. తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు, దేశ లౌకిక స్వభావాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మైనార్టీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, గిరిజనులపై దాడులు పెచ్చరిల్లుతున్నాయి. ప్రజల జీవించే హక్కును కూడా పాలకులు కాలరాస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. దేవుళ్లను ముందుకు తెచ్చి మత రాజకీయాలను సృష్టిస్తున్నారు. మత ఉన్మాదంతో ప్రజల్లో విద్వేషాలు రాజేస్తున్నారు. తమ ఎజెండాకు అడ్డుగా ఉన్న రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వ స్వభావానికి భిన్నంగా ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు, స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహి, అర్బన్ నక్సల్ అంటూ ముద్ర వేసి నిర్బంధాలకు గురి చేస్తున్నారు.
ఇంతటి ప్రమాదంలో ఉన్న దేశాన్ని, రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు దేశంలోని ప్రతి పౌరుడిపై ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించిన అమూల్యమైన వారసత్వాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని ప్రజలంతా చైతన్యవంతులవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ‘భారతీయులమైన మనం మన రాజ్యాంగాన్ని కాపాడు కుందాం’ అని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాల్సిన సందర్భమిది. తదనుగుణంగా ఉద్యమించాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ వ్యతిరేకుల చెర నుండి రాజ్యాంగాన్ని తద్వారా దేశాన్ని రక్షించుకోగలుగుతాం.
భారతీయులమైన మనం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



