రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి నిరుద్యోగ అంశం ప్రధానమై నది. ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు జాబ్‌క్యాలెండర్‌ను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొదటి ఏడాదిలోనే రెండు లక్షలు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీనిచ్చింది. 2024 ఆగస్టు రెండవ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్‌ను పద్దెనిమిది రకాల ఉద్యోగాల నోటిఫికేషన్లతో ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టులు, డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ రేంజ్ పరీక్షలు ఇలా మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. నిరుద్యోగులు సంతోషించారు, తమకు జాబ్ వస్తుందని ఆశపడ్డారు. కానీ ఇప్పటివరకు ఆ జాబ్ క్యాలెండర్ హామీని అమలు చేయలేదు. తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఎప్పుడు ఏ ఉద్యోగం ఖాళీ అవుతుందో, అదే నెలలో జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించి భర్తీ చేస్తామని చెప్పి తూతూ మంత్రంగా నోటిఫికేషన్ విడుదల చేసింది తప్ప చిత్తశుద్ధితో అమలు చేయలేదు.
పెరుగుతున్న నిరుద్యోగం
2022 బిస్వాల్ కమిటీ నాటికి తెలంగాణ రాష్ట్రంలో లక్షా 91 వేల 126 ఖాళీలు ఉండగా, 2025 నాటికి రెండు లక్షలకు పెరిగింది. ఇప్పటికి రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయింది 58,122 మాత్రమే (ఈ పోస్టుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినవి సుమారు యాభై వేల పోస్టులు) మాత్రమే. వీటిని కూడా సరిగ్గా భర్తీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీచేసిన ఉద్యోగాలు 2024లో 9,952, 2025లో 607 పోస్టులు మాత్రమే. కానీ సర్కార్ మాత్రం యాభై వేల పోస్టులు భర్తీ చేశామని ప్రకటించుకున్నది. పైగా గత సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలివ్వడం, పరీక్షలు పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వడం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం 2024లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నేటికీ అమలు కాకపోగా, 2025లో కొత్తగా విడుదల కూడా చేయలేదు. దీంతో మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల వాగ్దానం గాల్లోనే కలిపినట్టయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకై యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ తీర్చిదిద్ది జాబ్ క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామని హామీనిచ్చింది. దీంతో అప్పటికే అధికా రంలో ఉన్న ప్రభుత్వంపై విసుగు చెందిన యువత కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషిచేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత అస్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీలో ప్రకటించింది.కానీ, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయ లేదు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రతియేటా జూన్ రెండు నాటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 17 నాటికీ నియా మకాలు పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి మరి దాన్ని బుట్టదాఖలు చేసింది. నేడు టీజీపీఏస్సీలో అధికారికంగా 35 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా నమోదు చేసుకోనివారు పది లక్షల మంది వరకు ఉంటారు. మొత్తం 45 లక్షల వరకు నిరుద్యోగులు ఉద్యోగాలకై వేచి చూస్తున్నారు. వీరంతా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
హామీలే తప్ప అమలేది?
కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో హైద్రాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. అమరవీరుల, ఉద్యమకారుల కుటుంబాలకు గుర్తింపు ఇస్తామని చెప్పింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పింది. తల్లీ/తండ్రి/భార్యకు నెలవారీగా రూ.2500 అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని, పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చెప్పడతామని చెప్పింది. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొంది. నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టులను ఏర్పాటు చేసి ఏడు జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్‌లను, ప్రతి జిల్లాలో స్కిల్‌డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పు తామని చెప్పింది.ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రయివేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్‌ను ఏర్పాటు చేసి రూ.పది లక్షల వరకు వడ్డీలేని రుణ సదుపాయాలను కల్పిస్తామని చెప్పింది. ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పా టుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటా మని, పద్దెనిమిదేండ్ల పైబడి చదువు కొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని ఈ హామీలతో ఏఐసీసీ అగ్ర నాయకులు ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఇందులో ఒక్కటీ అమలు చేసింది లేదు.
నిరుద్యోగుల నిర్భంధం
ప్రతి ఏడాది రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో సుమారు తొమ్మిది వేల మంది పదవీవిరమణ పొందుతున్నారు. ఇవ్వన్ని భర్తీ చేయాల్సిన పోస్టులు అయినప్పటికీ ప్రభుత్వం నియామకాలు చేపట్ట కుండా కాలయాపన చేస్తున్నది. కొలువుల కోసం కొట్లాడుతున్న నిరుద్యోగులపై నిర్బంధాలను ప్రయోగిస్తున్నది. ఒక వైపు ప్రజపాలన అంటూనే మరోవైపు హామీలను అమలు చేయాలని అడుగు తున్నా వారిపై నియంతృత్వంగా వ్యవహారి స్తున్నది. ఎన్నికల ముందు సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన కాంగ్రెస్ అదినాయకుడు రాహుల్ గాంధీ,ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి యువతకు అనేక హామీలనిచ్చారు. ఇప్పుడు అదే సెంట్రల్ లైబ్రరీలోకి నిరుద్యోగుల్ని రాకుండా ఆంక్షలు పెట్టి అడ్డుకుంటు న్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ జాబ్ లేస్ క్యాలెండర్‌గా మార్చకుండా ఇచ్చిన హామీల ప్రకారం స్పష్టమైన వివరాలతో జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలి. స్థానిక ఎన్నికలలోపే నోటిఫికేషన్స్ వేసి నియామకాలను చేపట్టాలి. నిర్లక్ష్యం చేస్తే నిరుద్యోగ యువతీ, యువకులు తగిన గుణపాఠం చెబుతారు.
ఆనగంటి వెంకటేష్
9705030888
సీఎంగారూ…జాబ్ క్యాలెండర్ మరిచారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



