Wednesday, November 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమత్స్య ఎగుమతుల విదేశీ ఆదాయంలో వాటా మన హక్కు

మత్స్య ఎగుమతుల విదేశీ ఆదాయంలో వాటా మన హక్కు

- Advertisement -

– మత్స్యకారుల భద్రత, సంక్షేమం.. ప్రభుత్వాల నిర్లక్ష్యంపై పోరు
– ‘ధనిక రాష్ట్రం’ లెక్కలు.. పేదల బతుకులు బాగుపడ్డాయా? : అఖిల భారత మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వీవీఎస్‌ స్టాన్లీ
– కరీంనగర్‌లో అట్టహాసంగా టీఎమ్‌కేఎమ్‌కేఎస్‌ మహాసభ ప్రారంభం
– ప్రదర్శన, బహిరంగ సభకు తరలొచ్చిన మత్స్యకారులు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

‘మత్స్యకారుల భద్రత, సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై పోరుకు సిద్ధం కావాలి. మత్స్య సంపద ఎగుమతుల్లో వస్తున్న విదేశీ ఆదాయంలో మత్స్యకార కుటుంబాలకు వాటా ఇవ్వాల్సిందే. తెలంగాణ ధనిక రాష్ట్రమని కాగితాల్లోనే చూపుతున్నారని, వాస్తవానికి ఇక్కడి శ్రామిక రంగాల్లో ఆదాయం పెరిగిందా? విస్తార జలవనరులున్నా.. తెలంగాణలో మత్స్యకారులు ఎందుకు దీనావస్థలో ఉంటున్నారు?’ అని అఖిల భారత మత్స్యకార్మిక సంఘం (ఏఐఎఫ్‌డబ్ల్యూఎఫ్‌) ప్రధాన కార్యదర్శి వీవీఎస్‌.స్లాన్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ మత్స్యకారులు, మత్సకార్మిక సంఘం (టీఎమ్‌కేఎమ్‌కేఎస్‌) రాష్ట్ర 4వ మహాసభ మంగళవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. వేలాది మంది మత్స్యకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇందిరాచౌక్‌ నుంచి పెండెల గురయ్యనగర్‌, కరుణామూర్తి ప్రాంగణం పేరుతో స్థానిక రెవెన్యూ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ప్రదర్శనగా తరలివచ్చారు. అనంతరం జరిగిన బహిరంగసభలో వీవీఎస్‌.స్లాన్లీ ప్రసంగించారు.

మత్స్య సంపద ఎగుమతుల ద్వారా ప్రభుత్వాలకు ప్రతి ఏటా కోట్లాది రూపాయల విదేశీ ఆదాయం సమకూరుతున్నా, మత్స్యకారుల జీవిత భద్రతపై కేంద్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని వీవీఎస్‌.స్లాన్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటానికి టీఎమ్‌కేఎమ్‌కేఎస్‌ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 5650 మత్స్య సహకార సంఘాల్లో 5 లక్షల 40 వేల మంది సభ్యులు ఉన్నా.. లక్షలాది కుటుంబాలు దీనావస్థలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణీ, ఉత్పత్తి అయిన చేపల కోసం మార్కెట్‌ సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు.

పోరాటంతోనే హక్కుల రక్షణ సాధ్యం
పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజాపోరాటం చేస్తేనే హక్కుల రక్షణ సాధ్యమవుతుందని స్టాన్లీ ఉద్ఘాటించారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ పాలకులు విభజించు పాలించు విధానాన్ని అమలు చేశారని, స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలో కుల, మత గొడవలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పాలకులు వీటినే ప్రచారాస్త్రాలుగా వాడుకుంటూ అధికారంలోకి వస్తున్నారని అన్నారు.

చేప పిల్లల పంపిణీలో అస్తవ్యస్తం
ప్రతి సంవత్సరం జూన్‌-జులైలో చెరువుల్లో చేప పిల్లలను వదలాల్సిన ప్రభుత్వం డిసెంబర్‌ వచ్చినా వదలడం లేదని సాగర్‌ అన్నారు. నీటిమట్టం తగ్గే సమయంలో చేప పిల్లలను వదలడం వల్ల సరిపడా నీళ్లు లేక ఎదగడం లేదని తెలిపారు. బహిరంగ సభలో టీఎమ్‌కేఎమ్‌కేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, ఆహ్వాన సంఘం అధ్యక్షులు చేతి ధర్మయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగాధర కనకయ్య, కేడీసీబీ వైస్‌ చైర్మెన్‌ పింగిలి రమేష్‌, గంగపుత్ర సంఘం కరీంనగర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డోలి రాజన్న, టీఎమ్‌కేఎమ్‌కేఎస్‌ రాష్ట్ర ఆఫీస్‌ బ్యారర్స్‌ గోరెంకల నర్సింహ, కొప్పు పద్మ, గొడుగు వెంకటేష్‌, శీలం శ్రీను, మునిగెల రమేష్‌ సహా సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకట్‌రెడ్డి, సీయూటీయూ అధ్యక్ష, కార్యదర్శులు యూ.శ్రీనివాస్‌, గీట్ల ముకుందరెడ్డి, వేలాది మంది మత్స్యకారులు పాల్గొన్నారు.

మత్స్య సహకార సంఘాల నిర్వీర్యం కార్పొరేట్లకు దారులు వేస్తున్న కేంద్రం
కేంద్రం మల్టీ స్టేట్‌ కోఆపరేటీవ్‌ సొసైటీల పేరుతో మత్స్య సహకార సంఘాలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్లకు ఈ రంగంలోకి దారులు వేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రభుత్వ విధానాలతో మత్స్యసహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంకేఎమ్‌కేఎస్‌ రాష్ట్ర 4వ మహాసభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజలకు బలవర్థకమైన పౌష్టికాహారం అందిస్తూ, మత్స్య సంపద ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతున్న మత్స్యకారులకు కనీస భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేరళలో మత్స్యకారులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.20 లక్షలు ఇస్తున్నారని, ఇక్కడ నామమాత్రంగా ఇచ్చేందుకే సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ఆంక్షల కారణంగా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దేశంలోకి చేపలను దిగుమతి చేసుకుంటోందని సాగర్‌ తెలిపారు. దీనివల్ల ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి అయ్యే దేశీయ చేపల మార్కెట్‌కు పెద్ద దెబ్బ తగిలిందని వివరించారు. కేంద్రం నిర్ణయాలపై ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
-రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -