Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంఉల్లికి 'అంత్యక్రియలు'

ఉల్లికి ‘అంత్యక్రియలు’

- Advertisement -

– భారీగా పడిపోయిన ధరలపై
– మధ్యప్రదేశ్‌ రైతుల వినూత్న నిరసన
– పట్టించుకోని పాలకులు
భోపాల్‌ :
ఉల్లి ధరలు భారీగా పతనమవడంతో ఆందోళన చెందుతున్న మధ్యప్రదేశ్‌ రైతులు వినూత్న రీతిలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మంద్‌సర్‌ జిల్లా ధమ్నార్‌ గ్రామానికి చెందిన రైతన్నలు ఉల్లిగడ్డలను ఊరేగింపుగా తీసికెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మార్కెట్‌లో ధర చాలా తక్కువగా ఉన్నదని, కనీసం పెట్టుబడి, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లిగడ్డలు పేర్చిన పాడెను పూలతో అలంకరించి, దానిని బ్యాండు మేళంతో ఊరేగిస్తూ స్మశానవాటికకు తీసికెళ్లారు. అనంతరం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

అవి మా పిల్లల వంటివి
‘మాకు కనీస ధర కూడా రావడం లేదు. అందుకే ఉల్లిగడ్డలను ఊరేగించి అంత్యక్రియలు జరిపాము. పంట ఉత్పత్తికి చాలా ఖర్చయింది. ప్రభుత్వం నిద్ర మేల్కొనకపోతే మేము ఏం చేయాలి? ఖర్చులే రానప్పుడు ఎక్కడికి పోవాలి?’ అని రైతు బద్రీలాల్‌ ధకడ్‌ ప్రశ్నించారు. అంత్యక్రియలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో మరో రైతు దేవీలాల్‌ విశ్వకర్మ వివరించారు. ‘ఉల్లిగడ్డలు మాకు పిల్లల వంటివి. అవి మా కుటుంబంలో ఓ భాగం. అధిక వర్షాల కారణంగా రెండో పంట దెబ్బతిన్నది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు కూడా చనిపోయాయి. అందుకే అంత్యక్రియలు జరిపాము. మాకు ప్రభుత్వం కనీసం ఖర్చులు కూడా ఇవ్వడం లేదు’ అని ఆయన తెలిపారు. ఉల్లిపై చాలా కాలంగా ఇరవై ఐదు శాతం ఎగుమతి సుంకం విధిస్తున్నారని, దీంతో విదేశాలలో అవి పోటీకి నిలవలేకపోతున్నాయని రైతులు చెప్పారు. అధిక సుంకాల కారణంగా ఎగుమతులు పడిపోయాయని, దేశంలో నిల్వలు పేరుకుపోయాయని, మండీలలో ధరలు పతనమయ్యాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞాపనలు చేసినప్పటికీ ఎగుమతి సుంకాన్ని తగ్గించడం లేదని, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పటికీ ఒరిగిందేమీ లేదని వారు విమర్శించారు.

తహసిల్దార్‌కు వినతిపత్రం
అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి వచ్చిన తహసిల్దార్‌ రోహిత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌కు రైతులు మెమొరాండం సమర్పించారు. ‘ధరలు పెంచాలని రైతులు కోరారు. ప్రభుత్వం మద్దతు ధరకు ఉల్లిని కొనుగోలు చేయాలని అభ్యర్థించారు. వారు నాకు మెమొరాండం అందజేశారు. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు కూడా జరిపారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసికెళతాను. ఆయన ద్వారా ప్రభుత్వానికి కూడా రైతుల సమస్యలు తెలుస్తాయి’ అని తహసిల్దార్‌ చెప్పారు. కాగా అంత్యక్రియల కార్యక్రమం అనేది ప్రారంభం మాత్రమేనని రైతులు హెచ్చరించారు. ఎగుమతి సుంకాన్ని రద్దు చేసి, సమంజసమైన ధరను కల్పించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -