అంబానీ-అదానీలకు రాయితీలు
పెన్షనర్లకు కోతలేంటి?
మార్కెట్‌కు పెన్షనర్ల సొమ్ము తరలింపును అడ్డుకోవాలి
పుష్కరకాలమైనా పట్టాలెక్కని
కనీస పెన్షన్ రూ.3 వేల హామీ : టప్రా ఆధ్వర్యంలో జరిగిన పెన్షనర్ల సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంబానీ, ఆదానీలకు వేల కోట్ల రాయితీలిచ్చి..పెన్షనర్లకు ఇవ్వాల్సిన దాంట్లో కోతలు పెట్టడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని వక్తలు నిలదీశారు. ఈపీఎస్ ఫండ్ నిల్వలను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం షేర్ మార్కెట్లకు తరలిం చడాన్ని తప్పుబట్టారు. పుష్కరకాలమైనా కనీస పెన్షన్ రూ.3 వేల హామీని మోడీ సర్కారు పట్టాలెక్కిం చలేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా? కార్పొరేట్ల కోసం పనిచేస్తుందా? అని ప్రశ్నించారు. మోడీ సర్కార్ విధానాలను నిరసిస్తూ పెన్షనర్లం దరూ ఐక్యపోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(టప్రా) ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును ఎమ్.ఎన్.రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్ సీబీటీ మెంబర్ ఆర్.కరుమలయన్ మాట్లాడుతూ.. ఈపీఎఫ్ దగ్గర లక్షల కోట్ల రూపాయలున్నా కనీన పెన్షన్ పెంచడానికి కేంద్రానికి చేతులు రావడం లేదని విమర్శించారు. 15 రాష్ట్రాల హైకోర్టులు పెన్షన్లు పెంచాలని తీర్పులిస్తే కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం అనేక కొర్రీలు పెడుతూ అడ్డుకుంటున్న తీరును ఎండగట్టారు. ఈపీఎఫ్ ఆఫీసులో సీబీటీ మీటింగ్‌లు రెగ్యులర్‌గా జరగకపోవడాన్ని ఎత్తిచూపారు. ఈపీఎస్, సీపీఎస్, జీపీఎస్, యూపీఎస్, ఓపీఎస్, వ్యాలిడేషన్ క్లాజ్‌లతో నిమిత్తం లేకుండా పెన్షర్లు ఐక్యమై పోరాడితేనే జీవితానికి భద్రత కల్పించే పెన్షన్ హక్కును కాపాడు కోగలుగుతామని నొక్కిచెప్పారు.
పెన్షనర్ల మధ్య విభజన తెచ్చే యత్నం : మాజీ ఎమ్మెల్సీ ఎమ్.వీ.ఎస్.శర్మ
పాలకులు పెన్షనర్ల మధ్య విభజన సృష్టించి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఎమ్.వీ.ఎస్.శర్మ విమర్శించారు. పెన్షనర్ల పోరాటాలను నీరుగార్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన ఏకీకృత పెన్షన్ స్కీమ్‌ను, ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన జీపీఎస్‌ను ఉద్యోగులు ఆమోదించలేదన్నారు. ప్రపంచ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌ల సూచన మేరకు పెన్షన్‌ను కూడా కొనుక్కునే పరిస్థితికి పాలకులు తీసుకొచ్చారని విమర్శించారు. కార్పొరేట్ క్రూరమృగాల కన్ను 64 ట్రిలియన్ డాలర్ల పెన్షన్ ఫండ్‌పై పడిందన్నారు. సైనికులు కూడా తమ పెన్షన్ కోసం పాలకులతో కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తమ హక్కులను కాపాడేవారికే ఓటు అనే అజెండాతో ఇప్పటి నుంచే 2029 ఎన్నికలకు పెన్షనర్లు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
పెన్షనర్లంతా జైల్‌భరో చేపడితేనైనా కేంద్రానికి సిగ్గు వస్తుందేమో : అతుల్ దిఘే
ఏఐసీసీఈపీఎఫ్‌పీఏఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్ దిఘే మాట్లాడుతూ..పాలకులు పెన్షన్‌ను పెంచే ఆలోచనలో లేరన్నారు. తమకు బయట కంటే జైలులోనే ఫుడ్, బెడ్ దొరకడం సులువు అంటూ దేశవ్యాప్తంగా పెన్షనర్లంతా జైల్‌భరో కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడైనా కేంద్ర సర్కారుకు సిగ్గువచ్చి పెన్షన్ పెంచుతుందన్నారు. డిసెంబర్ 9న ఢిల్లీలో జరిగే సదస్సులో జైల్‌భరో కార్యక్రమానికి సంబంధించిన తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఏఐసీజీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ మాట్లాడుతూ…చైనా, అర్జెంటీనా, బ్రెజిల్, తదితర దేశాల్లో ఉద్యోగి+యజమాని+ప్రభుత్వం కలిపి పెన్షన్ ఇస్తున్న విధానాన్ని వివరించారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు జీవితం భారంగా మారకుండా అక్కడ పెన్షన్ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుంటే మన దేశంలోని పాలకులు మాత్రం పెన్షన్ సొమ్మును కార్పొరేట్లకు అప్పగించే పనిలో ఉన్నారని విమర్శించారు.
కాన్ఫిడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గౌరవాధ్యక్షులు ఎ.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పాలకుల దాడిని తిప్పి కొట్టాలంటే పెన్షనర్లంతా రాజకీయ చైతన్యం పొందాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో టప్రా అధ్యక్షులు పి.నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరహరి, ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు వైకుంఠరావు, రామారావు, అరుణ, స్వరాజ్‌కుమార్, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.
మేధో సంపత్తితో దెబ్బకొట్టండి ఎస్.వీరయ్య
తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల్లో వృద్ధుల బాధ్యతను రాష్ట్ర సర్కారు తప్పించు కోవాలనే వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య విమర్శించారు. శ్రమశక్తినీతి ద్వారా మనుస్మృతిని దొడ్డిదారిన అమలు చేయాలని చూస్తున్న కేంద్రం లోని బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. కార్మి కులు వృత్తిని గౌరవంగా భావించి పనిచేయాలి తప్ప వేతనాన్ని ఆశించకూడదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. రచ్చబండల వద్ద, పార్కుల్లో ప్రజలకు, ముఖ్యంగా యువతకు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను పెన్షనర్లు విడమర్చి చెప్పాలని పెన్షనర్లను కోరారు. అలా యువత ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో మాదిరిగా పాలకులపై తిరగబడే రోజులొస్తాయన్నారు.



