జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాల్టీలు విలీనం
కొత్త పరిశ్రమలకు క్యాప్టివ్
పవర్ పరిమితులు ఎత్తివేత
పునరుత్పాదక ఇంధనానికి పెద్దపీట
ఆర్టీపీఎస్ నిర్మాణం ఎన్టీపీసీకే…
ఐటీఐలు ఏటీసీలుగా మార్పు
పలు అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం: వివరాలు వెల్లడించిన మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గృహజ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు) సహా ఇతర స్కీంల ద్వారా సబ్సిడీలు పొందే కనెక్షన్ల నిర్వహణను ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర, దక్షిణ డిస్కంలే నిర్వహిస్తాయి. నూతనంగా ఏర్పడే సెంట్రల్ డిస్కం పరిధిలోకి వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లరు సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లు వస్తాయని మంత్రివర్గం పేర్కొంది. మంగళవారంనాడిక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో పలు కీలక అంశాలను ఆమోదించారు. ఆ వివరాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాల్టీలు విలీనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోకి కోర్ అర్బన్ ఏరియాóలో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల పెద్ద అంబర్‌పేట, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్కింగి, ఆదిభట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచా రం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాం పేట్, ఫిర్జాదీగూడ, జవహర్‌నగర్ మున్సిపాల్టీలను జీహెచ్‌ఎంసీ లో విలీనం అవుతాయి. దీనికి అవసరమైన జీహెచ్‌ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పునరుత్పాదక ఇంధనానికి పెద్దపీట
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, ఉత్పత్తి అంచనాలపై ఇంథనశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రివర్గానికి వివరించారు. దీనిపై చర్చించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తి, విని యోగాన్ని పెంచాలని నిర్ణయించారు. దానిలో భాగంగా మరో మూడువేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు, రెండు వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోళ్లకు ఐదేండ్ల కాల పరి మితితో టెండర్లు పిలవాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమో దం తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల పంప్డ్‌స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయనీ, దాదాపు 10వేల మెగావాట్ల వరకు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతులు ఇచ్చేందుకు మంత్రి వర్గం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే డిస్కంల వద్ద ఇప్పటికే ఉన్న ఒప్పందాలను కూడా పరిశీలించాలని సూచించారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ముందుగా మన డిస్కంలకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
కొత్త పరిశ్రమలకు క్యాప్టివ్ అనుమతులు
రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా, వాటికి అవసరమైన విద్యుత్‌ను క్యాప్టివ్ పద్ధతిలో వారే ఉత్పత్తి చేసుకొనే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇలాంటి దరఖా స్తులకు వెంటనే ఆమోదం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే విద్యుదుత్పత్తి గరిష్ట సామర్థ్యానికి కూడా ఎలాంటి పరిమితులు లేవని మంత్రివర్గం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు మాత్రం ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
ఆర్టీపీఎస్ నిర్మాణం ఎన్టీపీఎస్‌కే…
రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీసీఎస్)లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టా లని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పాల్వంచ, మక్తల్ లోనూ పిట్‌హెడ్‌లుగా ఎన్టీపీసీ, టీజీజెన్‌కో నుంచి ప్రతిపాదనలు స్వీకరించి యూనిట్ విద్యుత్ రేటు ఆధారంగా తుది పరిశీలన చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లో భూగర్భ కేబుల్ వ్యవస్థ
హైదరాబాద్‌లో రూ.14 వేల 725 కోట్ల అంచనా వ్యయం తో అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై ఇప్పటికే బెంగుళూరులో ఇంథన శాఖ అధికారులు అధ్యయనంచేసి వచ్చారనీ, దాని ప్రకారమే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీని అమలు కోసం హైదరాబాద్ సిటీని మూడు విద్యుత్ సర్కిళ్లుగా విభజించుకొని పనుల్ని చేపడతారు. ఈ ప్రాజెక్ట్‌లోనే టీ ఆప్టిక్‌ఫైబర్ సహా అన్ని రకాల కేబుల్ నెట్వర్క్ వైర్లన్నింటినీ అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చేసేందుకు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. దానికి అవసరమైన వర్కింగ్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.
ఐటీఐలు ఏటీసీలుగా మార్పు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానితో పాటు ఇప్పుడున్న 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చాలనీ, కొత్త గా 6ఏటీసీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో అమల్లోకి తెచ్చిన పారిశ్రామిక వాడల జోన్‌ల మార్పుపై బీఆర్‌ఎస్‌పార్టీ చేస్తున్న ఆరోపణలు, విమర్శల్ని మంత్రులు తిప్పికొట్టారు. ఈ విధాన నిర్ణయంలో ఎలాంటి అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
‘యంగ్ ఇండియా’కు అనుమతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటి గ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభు త్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.



