– బీజేపీ, బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
– పారిశ్రామిక భూముల బదలాయింపుపై బీఆర్ఎస్ సభ్యులు..
– వందేమాతరం విషయంలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశం రసాభాసగా సాగింది. పలుసార్లు సభ్యుల ఆందోళనతో కౌన్సిల్ దద్దరిల్లింది. నగర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు నిరసన తెలిపారు. మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్పొరేషన్ 12వ సాధారణ సమావేశంలో మొత్తం 46 ఎజెండాలపై సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. రెండు టేబుల్ ఐటమ్లకు సర్వ సభ్య సమావేశం ఆమోదం తెలిపింది. సభ్యుల ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. సభ ప్రారంభంలోనే రచయిత అందెశ్రీ, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అనంతరం వందేమాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు లేచి నిలబడలేదని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పలువురు కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకురావడంతో మేయర్ మందలించారు. దాంతో కొద్దిసేపు ఇరుపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. సభలో ముఖ్యంగా శానిటేషన్ నిర్వహణ, రోడ్లు, స్ట్రీట్‌లైట్స్ ఏర్పాటుపై చర్చ జరిగింది. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, క్షేత్ర పరిధిలో పనులు జరగడం లేదని, అభివృద్ధి చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీ పారిశ్రామిక భూముల బదలాయింపుపై చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే, ఈ సబ్జెక్టుపై చర్చ అసెంబ్లీలో చేస్తారని, ఇక్కడ అవసరం లేదని అటు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వారించారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనలతో మొదలైన సభ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ముగిసింది.
ప్రతి డివిజన్‌కూ రూ.2 కోట్లు కేటాయింపు
మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పాలకమండలి సభ్యుల(కార్పొరేటర్ల) పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ సమయంలో కార్పొరేటర్లకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. రూ.కోటి నిధులతో నేరుగా కార్పొరేటర్లు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేయొచ్చు. మరో రూ.కోటి ప్రతిపాదనలకు జిల్లా ఇన్చార్జి మంత్రుల ఆమోదంతో నిధులు విడుదల చేయనున్నట్టు మేయర్ చెప్పారు. రూ.2 కోట్లతో డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని మేయర్ అన్నారు. 150 డివిజన్లకుగాను రూ.300 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. నిధుల మంజూరుకు ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేయర్ ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 వార్డులలో పౌర సదుపాయాల కల్పనను వేగవంతం చేయడానికి ప్రతి కార్పొరేటర్ డివిజన్‌కు రూ.2 కోట్లు కేటాయించే ప్రతిపాదనకు పాలకమండలి సర్వసభ్య సమావేశం అమోదం తెలిపింది.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రసాభాస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



