– టీఎస్ యుటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యాహక్కు చట్టం అమలు, ఎన్సీటిఈ నోటిఫికేషన్‌కు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటీఎఫ్) రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ తెలిపారు.దేశవ్యాప్తంగా 25 లక్షల మంది, రాష్ట్రంలో 45 వేలమంది ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్న టెట్ పరీక్షను 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు మినహాయింపునిస్తూ విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్సీటిఈ నోటిఫికేషన్‌కు ముందు నియామకమైన టీచర్లు టెట్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినందునే గత 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు టెట్ రాయలేదని తెలిపారు. ఇప్పుడు హఠాత్తుగా రెండేండ్లలో టెట్ పాస్ కాకపోతే ఉద్యోగానికి ఉద్వాసన పలుకుతామని చెప్పడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రివ్యూ పిటిషన్ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1 నుండి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాన్ని సవరించి సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర కేంద్రంతోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, కొన్ని డివిజన్ కేంద్రాల నుంచి ప్రధానమంత్రికి వినతిపత్రాలు మెయిల్/ పోస్ట్ ద్వారా పంపించారని వారు తెలిపారు. బుధవారం నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులందరికీ వినతిపత్రాలు అందజేస్తామని వారు వెల్లడించారు.
సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



