అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25-28 తేదీల్లో జరుగు తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు వేదిక కానుంది. దేశ నలుమూలల నుండి మహిళా ఉద్యమాలు, పోరాటాల్లో రాటుదేలిన వెయ్యి మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతున్నారు. ఐద్వా ఆలిండియా ప్యాట్రన్ బృందాకారత్‌తో పాటు, అధ్యక్ష-కార్యదర్శులు శ్రీమతి టీచర్, మరియం ధావాలే, కోశాధికారి ఎస్ పుణ్యవతి, ఉపాధ్యాక్షురాలు సుభాషిణి అలీతో పాటు, అనేకమంది నాయకులు, ప్రతినిధులు పాల్గొంటున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో మూడేండ్ల కాలంలో తీసుకున్న కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాలు, వాటివల్ల సాధించిన ఫలితాలను సమీక్షించు కుని రూపొందించుకునే భవిష్యత్ కార్యాచరణ దేశవ్యా పితంగా మహిళా ఉద్యమాలకు దిశనిర్దేశం చేయనున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో మహిళా ఉద్యమానిది సుదీర్ఘ చరిత్ర. డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ అధ్యక్షురాలిగా, మానుకొండ సూర్యావతి కార్యదర్శిగా, ఇంకా ఇరవై నాలుగు మందితో కూడిన కార్యవర్గాన్ని 1947 ఫిబ్రవరిలో గుంటూరులో జరిగిన మొదటి మహాసభ ఎన్నుకుంది. ఆనాటి మహిళా ఉద్యమంపై మహనీయులు కందుకూరి విరేశలింగం, గురజాడ అప్పారావు వంటి సంఘ సంస్కర్తల ప్రభావం, ప్రపంచంలోనే తొలి సోషలిస్టు దేశమైన రష్యాలో బోల్షివిక్ పార్టీ నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఆచరించిన విధానాలతో స్త్రీలు, పిల్లలు పొందిన గొప్ప ఫలితాలు, స్వాతంత్య్రోద్యమం ప్రభావం చాలా బలీయంగా ఉండి, ఆస్తిహక్కు, పనిహక్కు, సమాన వేతనాలు, గర్భిణుల ఆరోగ్యం, ప్రసూతి సెలవులు తదితరాలు ప్రధాన డిమాండ్లుగా సంఘం పనిచేసింది. అయితే, నేటికీ ఆ మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. వివక్ష, అసమానతలు కొనసాగుతున్నాయి. గతంలో లేని సమస్యలు కూడా నేడు స్త్రీలను వెంటాడుతున్నాయి. అవి సంఘం అవసరాన్ని, మహిళలంతా సంఘటితం కావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళగా, పౌరురాలిగా, శ్రామిక మహిళగా సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా కేంద్రీకరించి పనిచేస్తోంది.
మహాసభలు రాష్ట్రంలో జరపాలనే నిర్ణయ నేపథ్యాన్ని ఒకసారి పరికించి చూస్తే…. ఐద్వా కేంద్ర కమిటీ ఈ మహాసభలను తెలంగాణ రాష్ట్ర కమిటీయే నిర్వహించాలని కోరినప్పుడు మనసులో అనేక సంశయాలు, చేయగలమా అనే సందిగ్ధం, భయం. అందివచ్చిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని కేడర్ మొత్తాన్ని గేరప్ చేసి, నిర్మాణాన్ని బలపర్చుకోవడంతో పాటు, మహాసభలు జయప్రదం చేయడానికి అవసరమైన విటమిన్-ఎం (ఆర్థికం) సమకూర్చు కోగలమా అనేక సందేహాలు చుట్టుముట్టాయి. అయితే, ఈ శషబిషలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈ జాతీయ మహాసభలు జరిపి తీరాల్సిందే అని ఐద్వా రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాదులోనే ఈ మహాసభలు జరుపుతామని కేంద్రానికి తెలిపి కార్యాచరణలోకి దిగింది. సెప్టెంబర్ 16న ప్రొ||శాంతాసిన్హా ఆహ్వానసంఘం అధ్యక్షురాలు, మల్లు లక్ష్మి ప్రధాన కార్యదర్శి, ఆర్ ఆరుణజ్యోతి కోశాధికారిగా, అనేక మంది ప్రము ఖులు, రచయితలు, డాక్టర్లు, శ్రేయోభిలాషులతో మహాసభలు జయప్రదం చేసేందుకు ఆహ్వానసంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగానే మహాసభల జయప్రదానికి అవసరమైన ఆర్థిక వనరులు సమీకరించుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది. సంఘం నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు, ఆర్థిక పరిపుష్టి సాధించడం కర్తవ్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో పని చేస్తుండగా వచ్చిన అనుభవాల్లో మూడు ప్రత్యేక అంశాలను తెలియజేయాల్సిన అవసరాన్ని ఐద్వా గుర్తించింది.
ముఖ్యంగా నగరంలోని మహిళారంగంలో గతంలో వివిధ బాధ్యతల్లో ఉండి తమవంతు పాత్ర నిర్వహించి నేడు వారి కుటుంబ బాధ్యతలు, వయస్సు, ఆరోగ్యం, ఇతర వృత్తుల్లోకి వెళ్లడం తదితరాల వల్ల సంఘం పనికి పరిమితులు ఏర్పడ్డ వారినందరినీ కలిసింది, మాట్లాడింది. మన సంఘం జాతీయ మహాసభలు రాష్ట్రంలో నిర్వహించుకుంటున్న సందర్భంగా మన పాత్ర ఏమిటి? దీన్ని జయప్రదం చేసేందుకు ఏం చేయాలి?అనే దానిపై అభిప్రాయాలు పంచుకుంది. మొట్టమొదట శక్తిమేరకు మనం ఆర్థికంగా స్పందిం చడంతో పాటు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సాధ్యమైనంత ఎక్కువమందిని కలువాలనుకుంది. నిధి ఎంత ఇచ్చారనేదానితో నిమిత్తం లేకుండా, ఎంతమందిలోకి వెళ్లామనే లక్ష్యంతో ముందుకు కదిలింది. దీంతోపాటు నగరంలో శ్రామిక మహిళలతో లంచ్ అవర్ మీటింగ్ పెట్టి, ఐద్వా మహాసభల ఆవశ్యకతను వివరిస్తున్నది. మొత్తంగా ఈ విషయంలో ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నా మరికొన్ని సాధించాలి. ఇక మహాసభలను జయప్రదం చేయడానికి మ్యాన్‌వల్ పవర్ కూడా అవసరం కదా! దీనికోసం వారివారి అభిరుచులకనుగుణంగా వివిధ కమిటీల్లో భౌతికంగా బాధ్యతలు తీసుకోవడానికి అందరూ సిద్ధపడ్డారు. రాబోయే రెండు నెలలు పూర్తి సమయం కేటాయించి, మహాసభలను జయప్రదం చేయడానికి సన్నద్ధమయ్యారు. నగరంలో మహిళా కేడర్ కలగలపడానికి, నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ మహాసభలు చక్కగా తోడ్పడుతున్నాయని చెప్పడానికి ఆనందంగా ఉంది.
ఇక రెండో అంశం, మనం సన్నద్ధమవుతున్నాం సరే, మరి మన పిల్లల సంగతేంటి? ఇంటిపని, వంటపని పూర్తిచేసుకుని, పిల్లలను చంకనెత్తుకుని సంఘంలో తిరిగాం కదా! వివిధ సవాళ్లను ఎదుర్కొంటూ, వారి చదువుసంధ్యలతో పాటు, సెలవు దినాల్లో మనతో పాటు, మీటింగులు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా! సంఘం కోసం మనం పడే తపన, సంఘర్షణను వారూ చూసారు. అసమానతలు, దోపిడీలేని, స్త్రీ-పురుష వివక్షత లేని సమాజం కోసం మనం పడుతున్న కష్టాన్ని కండ్లారా గమనించారు. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దవారై వివిధ దేశాలతో పాటు, స్వదేశంలో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి జాతీయ మహాసభలకు వారూ స్పందించాలనుకున్నాం, కార్యాచరణ సిద్ధం చేశాం. మన కుటుంబాల్లో ఉద్యోగాల్లో ఉన్న పిల్లలందరి లిస్టు తయారుచేశాం. మొదటిసారిగా హైదరాబాదులో జరుగుతున్న ఈ మహాసభల గురించి తెలియజేయగానే వారి స్పందన అనూహ్యం, హర్షణీయం. వెంటవెంటనే స్పందిస్తూ, ”అమ్మల సంఘం మహాసభలు ఇక్కడ జరుగుతుంటే మా వంతు మేము చేయాలికదా!” అన్నారు. వారివారి శక్తి అనుసారం నిధిని పంపారు. ఇంకా పంపుతున్నారు. మనసంతా ఆనందం, అనిర్వచనీయమైన అనుభూతి. అవును. మన కుటుం బాలలోని పిల్లలు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తెరిగి పెరిగారు. కోవిడ్ సమయంలో కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఐసోలేషన్ సెంటర్‌కు దేశంలో మరియు విదేశాల్లో ఉన్న మన కుటుంబాల పిల్లలు తమవంతు సహాయ సహకారాలను అందించారు.సమసమాజం కోసం, దోపిడీలేని వ్యవస్థ కోసం కృషి చేస్తున్న కుటుంబాల్లోని పిల్లల మెదడులో బాల్యంలోనే పడ్డ విత్తనాలు సమాజాన్ని దోచుకునేవైపు కాకుండా, రౌడీలుగా, గుండాలుగా మారకుండా శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఆలోచించే బాధ్యతాయుతమైన పౌరులుగా మలచబడ్డారు. వారు స్పందించిన తీరు ఎంతో సంతోషషాన్ని, సంతృప్తిని కలిగించింది. బాల్యంలోనే వారిని మలచాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.
మూడో అంశం, యువత పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు, స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారనే దానికి ఈ స్పందన చెక్‌పెట్టింది. సమాజం పట్ల తమ బాధ్యత నిర్వవర్తించడానికి సిద్ధంగా ఉన్నది. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నా రనే దానికి పై ఘటనలే నిదర్శనం. యువత చాలా చైతన్యంగా ఉంటున్నది. బయటి ప్రపంచం గురించి అధిక స్పృహను ప్రదర్శి స్తున్నది. చర్చల్లో పాల్గొంటున్నది. ఆర్థికంగా నిలదొక్కుకోవడం, జీవిత భాగస్వామి ఎంపిక, స్వేచ్ఛా, ప్రజాస్వామ్యం పట్ల చాలా విస్పష్టంగా మాట్లాడుతున్నది. ఈ సందర్భంగా అనేకమంది యువతులు మహిళా సమస్యలు, పరిష్కారాలు, సాధికారత, సమాన అవకాశాలు తదితరాలన్నింటి పట్ల చాలా స్పష్టంగా అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇక మనం చేయాల్సింది, వారితో లింక్‌లోకి వెళ్లడం, ఆలోచనలు, భావాలన్నింటినీ కలబోసుకుని రంగంలోకి దిగడం. వీటన్నింటి సాధనకు దశాబ్దాలు వేచే సమయం లేదు. గంటలు, సెకన్లుగా పరిగెడుతున్న కాలం. ”తెలియదు”. ”మా వరకు రాలేదు” అని తప్పించుకునే వీలున్న వర్తమానంలో లేము. సమస్త సమాచారాన్ని, కనీస అవగాహనను అందరికీ పంచుతున్న టెక్నాలజీ యుగంలో ఉన్నాం. కుల, మత, వర్ణ, ప్రాంత భేదాలతో పాటు, లింగ వివక్షపై పోరాడాల్సిన సమయమిది. అప్రమత్తతతో ఉందాం.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుందాం.. చేయిచేయి కలుపుదాం.. భవిష్యత్తుకు బాటలు వేద్దాం..
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్ధాం!
మనువాదాన్ని తిప్పికొడదాం!
మహిళల హక్కుల కోసం మునుముందుకు సాగుదాం!!
టి జ్యోతి



