Thursday, November 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎయిరో స్పేస్‌..డిఫెన్స్‌ హబ్‌గా హైదరాబాద్‌

ఎయిరో స్పేస్‌..డిఫెన్స్‌ హబ్‌గా హైదరాబాద్‌

- Advertisement -

తెలంగాణ అభివృద్ధిలో మరో మైలురాయి
సాఫ్రస్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ / శంషాబాద్‌

సాఫ్రన్‌ సంస్థ తన ఎయిరోస్పేస్‌ ఫెసిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్‌ సంస్థ, ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఇండియా… బుధవారం హైదరాబాద్‌ జీఎంఆర్‌ ఎయిరోపార్క్‌ (ఎస్‌ఈజెడ్‌)లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…హైదరాబాద్‌ దేశంలోనే ప్రధాన ఎయిరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌గా మారిందని చెప్పారు. బెంగుళూరు-హైదరాబాద్‌ నగరాలను డిఫెన్స్‌, ఎయిరోస్పేస్‌ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఎయిరోస్పేస్‌ రంగంలో, ముఖ్యంగా వాటి నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్‌ వంటి సదుపాయాలతోపాటు పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సాఫ్రన్‌, బోయింగ్‌, ఎయిర్‌ బస్‌, టాటా, భారత్‌ ఫోర్జ్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. తెలంగాణపై ఎంతో నమ్మకంతో సాఫ్రన్‌ గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటరని సీఎం వివరించారు. ఈ ఫెసిలిటీ సెంటర్‌తోపాటు సాఫ్రన్‌కు చెందిన ఎం-88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌ హాల్‌కు శంకు స్థాపన చేయటం హర్షనీయమని అన్నారు. భారత వైమానిక దళం, నావికా దళానికి ఇది ఎంతో ఉపయోగపడుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాఫ్రన్‌ దాదాపు రూ.1,300 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణు లు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. పెట్టుబడులను ఆహ్వానిం చడంతోపాటు పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఎస్‌ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలిచింద ని పేర్కొన్నారు. ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్‌ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లు ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించాయని తెలిపారు. ఎయిరోస్పేస్‌ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపయ్యాయని గుర్తుచేశారు. గత తొమ్మిది నెలల్లో ఎగుమతులు రూ.30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొదటిసారి ఫార్మా ఎగుమతు లను అధిగమిం చాయని తెలిపారు. ఎయిరోస్పేస్‌ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డును పొందిందని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతోందని సీఎం చెప్పారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్‌ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దామని వివరించారు. ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలన్న సంకల్పంతో హైదరాబాద్‌ విమానా శ్రయం సమీపంలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించడానికి డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వాని స్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. భారత లక్ష్యాలను చేరుకోవడంలో తెలంగాణ భాగస్వామిగా ఉండాలని ఆకాంక్షించారు. అదే క్రమంలో 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం వివరించారు. కార్యక్రమం లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సాఫ్రన్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాస్‌ మెకలెన్స్‌, సీఈఓ, డైరెక్టర్‌ ఒలివర్‌ అండ్రీస్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ సీఈవో స్టీఫేన్‌ క్యూయెల్‌, జీఎంఆర్‌ గ్రూపు సంస్థల చైర్మన్‌ జీఎం రావుతోపాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -