Thursday, November 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపారదర్శకంగా సర్పంచ్‌ ఎన్నికలు

పారదర్శకంగా సర్పంచ్‌ ఎన్నికలు

- Advertisement -

మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పకడ్బందీగా అమలు
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు : ఎస్‌ఈసీ రాణికుముదిని
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రాణి కుముదిని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఆమె బుధవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, సీనియర్‌ అధికారులతో హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో పోలింగ్‌ స్టేషన్ల వారీగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, పోలింగ్‌ సిబ్బంది, బ్యాలెట్‌ బాక్స్‌ల తరలింపునకు సంబంధించి రవాణా తదితర అంశాలపై వారికి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ ఇచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం పోలింగ్‌ స్టేషన్ల వారీగా కేటాయించాలని సూచించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. నోటీసు జారీ, రిటర్నింగ్‌ అధికారిచే వార్డు, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రదర్శనలో వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించరాదనీ, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికలు, సజావుగా, స్వేచ్ఛగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో శాంతి భద్రతల డీజీ మహేశ్‌ భగవత్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
సర్పంచ్‌ ఎన్నికల మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం గ్రామ పోలింగ్‌ అధికారి ఎన్నికల నోటీసు జారీ చేసిన తర్వాత వార్డు, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,236 సర్పంచ్‌ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్‌ మాడ్యూల్‌ ఏర్పాటు
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్‌ మాడ్యూల్‌ అప్లికేషన్‌ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పౌర సమాజం తమ యొక్క ఫిర్యాదులను ఈ అప్లికేషన్‌లో అప్‌లోడ్‌ చేసి, వాటి పరిష్కార ప్రగతిని ట్రాక్‌ చేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్‌లో తమ మొబైల్‌ నెంబర్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకుని తర్వాత ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. పౌరుల్లో భాద్యతా భావాన్ని పెంచి, ప్రజాస్వామ్యాన్ని పెంచడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -