– సైరన్‌కార్లు, గన్‌మెన్లతో హంగామా
– హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్‌గా అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని ఫిల్మ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీగార్డ్స్‌లోని డీసీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ ఎస్.వెంకట్‌రెడ్డితో కలిసి డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్‌కు చెందిన బత్తిని శశికాంత్ షేక్‌పేట్‌లోని అపర్ణ ఔరా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. 3-డీ యానిమేషన్ కోర్సు పూర్తి చేశాడు. చిన్న కంపెనీ ఏర్పాటు చేశాడు. తాను నేర్చుకున్న యానిమేషన్‌తో అతని పేరిట ఐఏఎస్, ఐపీఎస్, ఎన్‌ఐఏ అధికారిగా ఐడెంటీ కార్డులు తయారు చేశాడు. ఆ తర్వాత రెండేండ్లుగా గనుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశానని, కొద్ది రోజుల కిందటే పోలీస్, ఎన్‌ఐఏలో ప్రత్యేక ఆపరేషన్ల కోసం తనను ప్రభుత్వం నియమించిందని పలువురిని నమ్మించాడు. ఎవరికీ అనుమానం రాకుండా సైరన్ కార్లు, వాకీ-టాకీలు ఉపయోగించేవాడు. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రవీణ్, విమల్‌ను గన్‌మెన్లుగా నియమించుకున్నాడు. గన్‌మెన్లతో కలిసి షేక్‌పేటలోని గోల్డ్ జిమ్‌కు వెళ్ల్లేవాడు. జిమ్‌తోపాటు చుట్టుపక్కల హడావిడి చేసేవాడు. మరికొన్ని ప్రాంతాల్లో టీఎస్‌ఐఐసీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని, ఖాళీ స్థలాలు కేటాయించే విభాగానికి ప్రత్యేక ఐఏఎస్ అధికారినంటూ ప్రచారం చేసుకున్నాడు. పరిశ్రమ స్థాపనకు స్థలం కేటాయింపు జరిగిందటూ నకిలీ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను తయారు చేసిన నిందితుడు జిమ్ ఓనర్ ఎండీ అలీ హసన్‌కు అందించాడు. అందుకు రూ.10,50,665 బ్యాంక్ నుంచి బదిలీ చేయించుకున్నాడు. జిమ్‌కు వచ్చే మరో వ్యక్తి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. అయితే, ఆ భూములు వారిపై బదిలీ కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో విచారించిన ఫిలింనగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. రెండు సంవత్సరాలుగా ప్రజలను పలు విధాలుగా నమ్మించి మోసాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. నిందితుడు అమాయకుల నుంచి భారీగా డబ్బులు సంపాదించాడు. అతని నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలతోపాటు నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్‌ఐఏ అధికారుల గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి గన్‌మెన్లను త్వరలోనే అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు.
ఐపీఎస్ అధికారినంటూ మోసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



