Thursday, November 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉచిత, మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం

ఉచిత, మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం

- Advertisement -

– హైదరాబాద్‌ను మెడికల్‌ టూరిజం క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తాం
– ఈశాన్యరాష్ట్రాల భాగస్వామ్యం పెరగాలి : వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ
– రాజ్‌భవన్‌లో ఆరోగ్య సదస్సు నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రభుత్వాస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచిత, మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నొక్కి చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని మెడికల్‌ టూరిజం క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో ఈశాన్యరాష్ట్రాల ప్రజలు పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆరోగ్య సదస్సును నిర్వహించారు. అందులో మంత్రితో పాటు తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియానా జెడ్‌ చొంగ్తూ, అస్సాం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి పి.అశోక్‌బాబు, హైదరాబాద్‌ నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ పి.రఘురామ్‌, అస్సాంకు చెందిన డాక్టర్‌ అమితవ గోస్వామిలతో కూడిన ప్యానల్‌ సంస్థాగత సినర్జీ, వైద్యరంగంలో ఏఐ టెక్నాలజీ, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ఆ టెక్నాలజీ ఆవశ్యకత, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు దేశ బలమనీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి సదస్సులు దోహదపడుతాయని ఆకాంక్షించారు. ఈశాన్య రాష్ట్రాలతో తెలంగాణ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పీహెచ్‌సీ, బస్తీదవాఖాల్లో, ఏరియాస్పత్రుల్లో, గాంధీ, ఉస్మానియా వంటి 48 టీచింగ్‌ ఆస్పత్రుల ద్వారా అందిస్తున్న సేవలను విడమర్చి చెప్పారు. మల్టీ సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు నూతనంగా ఉస్మానియా, మూడు టిమ్స్‌ ఆస్పత్రులను, వరంగల్‌లో హెల్త్‌సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 32 డయాగస్టిక్స్‌ సెంటర్ల ద్వారా ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన డయాగస్టిక్‌ సేవలు అందిస్తున్నామనీ, ఏజెన్సీల్లోని నాలుగు ఐటీడీఏల పరిధిలోనూ హబ్స్‌ ప్రారంభిస్తున్నామని వివరించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ 1800కిపైగా రోగాలకు మెరుగైన వైద్యసేవలు, సర్జరీలను ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్నామని తెలిపారు. నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ బర్డెన్‌ను ఎదుర్కొనేందుకు గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌సీడీ క్లినిక్స్‌ ఏర్పాటు చేశామనీ, సుమారు 50 లక్షల మంది పేషెంట్లకు వన్‌ పాయింట్‌ డెస్టినేషన్‌గా ఆ క్లినిక్‌లు సేవలు అందిస్తున్నాయని వివరించారు. ప్రతి జిల్లాలోనూ డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎంసీహెచ్‌లు, ఆరోగ్య మహిళ క్లినిక్‌లు, మైత్రి క్లినిక్‌ల ద్వారా పిల్లలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల్లో ఐవీఎఫ్‌ సేవలను అందిస్తున్నామని గర్వంగా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -