Friday, November 28, 2025
E-PAPER
Homeమానవిబాల్యం నేర్పిన పాఠం నా ప్రగతికి మార్గం

బాల్యం నేర్పిన పాఠం నా ప్రగతికి మార్గం

- Advertisement -

అందరి జీవితం వడ్డించిన విస్తరికాదు. కష్టాలు, కన్నీళ్లను దాటుకుంటూ జీవితంతో పోరాడే వారు మన చుట్టూ ఎందరో ఉన్నారు. పోరాడే స్థానంలో ఉన్నది మహిళ అయితే ఇక ఆమె బాధలు చెప్పనలివి కావు. అలాంటి వారిలో కుంటముక్కల గాయత్రి ఒకరు. బాల్యం నుండి ఎన్నో కష్టాలు అనుభవించారు. ఒంటరిగా నలుగురు బిడ్డల్ని పెంచి పోషిస్తున్న తల్లికి చేదోడుగా నిలిచారు. అంతేనా ఓ ఒంటరి తల్లిగా తన ఏకైక కూతురు సుకన్యను తీర్చిదిద్దారు. పాఠశాల ఉపాధ్యాయురాలిగా పిల్లల బంగారు భవితకు బాటలు వేస్తున్నారు. తోడబుట్టిన వారి తోడుతో సమాజం కోసం తన వంతుగా ఏదో చేయాలనే తపనతో కాన్సర్‌ రోగులకు సాయం చేస్తూ పేదలకు చేయూతనిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

ఓ సామాజిక సేవకురాలిగా గాయత్రి చేసే ప్రతిపనిలో నిబద్ధత, నిజాయితీ ఉంటుంది. అందుకే అటు పాఠశాల విద్యార్థుల ప్రేమతో పాటు వారి తల్లిదండ్రుల ప్రేమాభిమానాలను కూడా పొందుతున్నారు. చెల్లి వీణ అన్నివిధాల ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్లేస్కూల్‌ని నడపటంలో సహకరిస్తున్నారు. మాటలు తక్కువ పని ఎక్కువ, కచ్చితమైన జవాబుదారీతనం, అవతలివారు ఎంత ఆవేశంగా అరిచినా ప్రశాంతంగా సమాధానం చెప్పడం ఆమెలోని గొప్ప లక్షణాలు. ‘మనం కొద్ది సేపు నిశ్శబ్దంగా ఉంటే అవతల వారి ఆవేశం చల్లారుతుంది’ అంటారామె. ‘చిన్న కొట్లాట చిలికి చిలికి గాలివాన కారాదు, చాలా సందర్భాల్లో సహనమే మనకు రక్ష’ అనే ఆమె మాటలు ఎవరినైనా ఆలోచింపజేస్తాయి.

కాన్సర్‌ రోగుల కోసం
ఆమె చిన్నతనంలో తండ్రి కుటుంబ బాధ్యతలు ఏమాత్రం పట్టించుకోలేదు. నలుగురు పిల్లలతో ఒంటరి పోరాటం చేసిన తల్లికి గాయత్రి మూడో కూతురు. అటువంటి తల్లి కాన్సర్‌ బారిన పడినప్పుడు బిడ్డగా ఆమె అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనిది. ఉద్యోగం చేస్తూ చెల్లి వీణ సాయంతో తల్లిని కడవరకు కంటికి రెప్పలా చూసుకున్నారు. బావ విశ్వనాథం, అక్క శారద తల్లిదండ్రుల్లా ఇప్పటికీ తనను ఆదుకుంటున్నారని ఆమె ఎంతో సంతోషంగా చెబుతున్నారు. తల్లి మరణించిన తర్వాత కాన్సర్‌ రోగులకోసం విరాళాలు సేకరించి వారికి ఆహారం అందిస్తారు. అలాగే పేదలకు దుప్పట్లు, చీరలు ఇస్తున్నారు. ప్రతి ఆదివారం ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసులు తీసుకుని వెనక బడిన పిల్లల్లో నైపుణ్యాలు పెంచుతున్నారు.

పస్తులున్న రోజులు ఎన్నో
చెన్నైలో పుట్టిపెరిగిన గాయత్రి తమిళం, హిందీ, ఆంగ్లం చక్కగా రాయగలరు, చదవగలరు. అయితే తెలుగు చదవటం రాయడం రాదు. తల్లి వంద రూపాయల జీతంతో ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పని చేసి నలుగురు ఆడపిల్లల్ని చదివించింది. ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం చదివి ఆపై పదవ తరగతి వరకు గవర్నమెంట్‌ స్కూల్లో చదివారు వీణ, గాయత్రి. మొదటి నుండి గాయత్రి చదువులో ముందుండేవారు. ఆంగ్లో ఇండియన్‌ టీచర్ల వద్ద చదువుకోవడం వల్ల ఆంగ్లంలో మంచి పట్టువచ్చింది. చెన్నైలో ఉండడంతో ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లీష్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌ తమిళంలో చదివారు. బడికి వెళ్లేందుకు బస్‌ టికెట్‌ కోసం 25పైసలు లేక నడిచివెళ్లేవారు. ఒక్క పూట మాత్రమే తిని మిగిలిన పూటలు మంచినీరు తాగి పస్తులున్న రోజులు ఎన్నో.

చదువుతూ చదివిస్తూ…
తెల్లారుఝామున తల్లి నిద్ర లేపి బియ్యం, కిరోసిన్‌ కోసం, రేషన్‌ షాపుముందు క్యూలో నించోపెట్టేది. ఐదవ తరగతి విద్యార్థిగా ఉన్నప్పటి నుండే గాయత్రి చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పేవారు. 18 ఏండ్లు వచ్చేసరికి 200 రూపాయల జీతంకి టీచర్‌గా పనిచేస్తూ బి.ఎ.బి.ఇడి. ప్రైవేట్‌గా చదివారు. ప్రీప్రైమరీ నుంచి ఐదవ తరగతి వరకు హెచ్‌.ఎం.గా పనిచేశారు. శారదా సంస్థ నుంచి బెస్ట్‌ టీచర్‌ అవార్డు, కోవిద సంస్థవారి సన్మానంతో పాటు పి.ఎన్‌.ఎం.స్కూల్‌ సైన్స్‌ ఫేర్‌ అవార్డ్‌ పొందారు. చెన్నైలో ఆరోగ్యం బాగా పాడవటంతో హైదరాబాద్‌కు వచ్చేశారు. ఉపాధ్యాయురాలిగా 25 ఏండ్ల అనుభవం ఉన్న ఆమె కబడీలో ఎన్నో బహుమతులు పొందారు. పాఠశాలలో పిల్లల చేత ఏకపాత్రాభినయాలు, నృత్య రూపకాలు చేయిస్తున్నారు. చెల్లి, అక్క కుటుంబంతో పాటు మేనమామ, పిన్ని కూడా తన ఉన్నతికి చేయూత ఇచ్చారంటారు ఆమె. బాల్యపు కష్టాలు తెలుసుకాబట్టి శివానంద లెప్రసీ కాన్సర్‌ (కుకట్‌పల్లి) రోగులకు తనవంతు సాయంచేస్తున్నారు. ఇలా సమాజంలో చైతన్యం తేవాలని, పిల్లల పురోభివృద్ధికి అందరూ సహకరించాలని ఆమె అభిలాష.

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -