అటు డిగ్రీ ఉన్నత విద్యకు, ఇటు పాఠశాల విద్యకు, మాధ్యమిక విద్యావ్యవస్థ అయిన ఇంటర్ విద్య క్రమంగా మిథ్యగా మారుతోంది. పారదర్శతకోసం ఇంటర్‌బోర్డు ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) అనేది ఈవిషయాన్ని అద్దంలావాస్తవాలను ప్రతిబింబిస్తున్నది. ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటించి అధికారులు ఒకవైపు హడావిడి చేస్తుంటే మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం ”నానాటికి తీసినట్టు నాగం బొట్టు” అనే సామెతను గుర్తు చేసేదిగా తయారైంది. 31జూలై 2025 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలోని 430 జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య 1,61,166 మంది విద్యార్థులు కాగా 1,46,377మంది విద్యార్థులు (ఎఫ్‌ఆర్‌ఎస్) అంటే ముఖగుర్తింపు డిజిటల్ విధానంలో నమోదయ్యారు. అంటే వీరి హాజరు ప్రతిదినం డిజిటల్ సిస్టమ్ ద్వారా నమోదు అవుతుంది.
అక్టోబర్ మాసానికొచ్చే సరికి నమోదైన ఇంటర్ విద్యార్థుల్లో 72,092 మంది విద్యార్థులు మాత్రమే తరగతులకు అడపాదడపా హాజరవుతున్నారు. ఇది49 శాతం హాజరు మాత్రమే! అంటే సగానికి పైగా ఇంటర్ చదివే విద్యార్థులు తరగతిగది బయటనే ఉంటున్నారు? అదిలాబాద్, కొమురంభీం, ములుగు, మహబూబాబాద్ లాంటి గిరిజన జిల్లాల్లో గైర్హాజరు శాతం డెబ్బయి శాతం వరకు ఉంది. ఇంత దారుణమైన స్థితిలో విద్యార్థుల హాజరుశాతం పడిపోవడానికి కారణమేమిటి? సగానికి పైగా ఇంటర్ విద్యార్థులు ఏమయ్యారు, ఏటుపోయారు? వీరి భవితవ్యమేమిటి? ఇత్యాది ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇంటర్‌లో చేరిన విద్యార్థుల పట్ల ప్రభుత్వ అధికారయంత్రాంగం, తల్లి దండ్రుల పర్యవేక్షణ లేకపోవడం ఫలితమేనని చెప్పవచ్చును. గైర్హజరైన విద్యార్థుల అంతరార్ధం ఏమిటి? పాఠ్యాంశాలు, సిలబస్ అర్థం కావడం లేదా? బోధనా విధానం నచ్చక కళాశాలకు దూరమవుతున్నారా? నేర్చుకున్న విద్య భుక్తికి తోడ్పడదనే ఉదాసీనత అంచనాలకు వచ్చారా?ఆర్థిక పరిస్థితి బాగాలేక వ్యవసాయ పనులు, భవన నిర్మాణ పనుల్లో ఉన్నారా?సరైన నియంత్రణ లేక గంజాయి సిగరెట్లు, విచ్చలవిడిగా లభ్యమవుతున్న కొన్నిరకాల డ్రగ్లకు బానిసలై గుంపులుగా ఏర్పడి కళాశాలకు, తరగతులకు డుమ్మా కొడుతున్నారా?అంటే, అన్నిరకాల సమాధానాలు సానుకూలంగానే అనిపిస్తాయి.
పిల్లలు శారీరకంగా, మానసికంగా సరైనదారిలో ఉండాల్సిన ఇంటర్ వ్యవస్థ ఎందుకింత నిర్లిప్తంగా తయారైంది. ఇదంతా తెలిసికూడా బోర్డు డైరెక్టర్ మాత్రం ‘ఈఏడాది ఎన్రోల్మెంట్ 94,155 మాత్రమే అయ్యింది.వచ్చే ఏడాదికి మరోపదివేలు మందిని అదనంగా చేర్చుతామని’ అంటున్నారు.చేరిన విద్యార్థుల సంగతి,అటుంచి కొత్తగా చేరబోయే వారిగురించి అదికారుల సన్నాయి నొక్కులు ఎవరిని మభ్యపెట్టడానికి? తొమ్మిది వందల మంది రెగ్యులర్ లెక్చరర్ లు, మూడువేల మంది తాత్కలిక ప్రాతిపదికన తీసుకున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరణ కూడా చేసింది.
ఇంతమంది ప్యాకల్టీ ఉండగా విద్యార్థులు ఎందుకు తరగతులకు గైర్హాజరు అవుతున్నారు? అనే విషయం చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశం. తెలంగాణలో 1292 ప్రయివేటు జూనియర్ కళాశాలలున్నాయి. అంటే ప్రభుత్వ రంగంలోకంటే ప్రయివేటు రంగంలోనే మూడురెట్లు విద్యార్థులు అధికంగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు ఇంటర్ విద్యారంగాన్ని నారాయణ, శ్రీచైతన్య లాంటి అరడజను కార్పోరేట్ విద్యాసంస్థలు మాత్రమే రాష్ట్రంలో శాసిస్తున్నాయి. వీరు పట్టణాల్లో వీధికో కళాశాల శాఖ తెరిచి యథేచ్ఛగా ఫీజులు దండుకుంటున్నా ప్రభుత్వం, విద్యాశాఖ ఉదాసీనంగా చూడడం తప్ప ఎలాంటి అధికారిక చర్యలు తీసుకోవడం లేదు.
2023-24యుడైస్ గణాంకాల ప్రకారం.. ప్రయివేటు కళాశాలల్లో 5,46,217మంది, ప్రభుత్వ కళాశాలల్లో 3,04,134మంది ఇంటర్ విద్యార్థులున్నారు. ఇందులో లక్షా యాభై వేల మంది తెలంగాణా రెసిడెన్షియల్ స్కూల్, కేజీబీవీ, కేంద్రీయ, ఏకలవ్య, నవోదయ విద్యాల యాల్లో అత్యధికం. వీరిని మినహాయిస్తే మిగిలిన లక్షన్నర మంది మాత్రమే 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఉంది. దరిదాపు తొంభై శాతం బడుగు, బలహీన వర్గాలకు చెందిన, లేక ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు చెందిన వారే కళాశాల మెట్లెక్కడం లేదు. ఒకవేళ ఎక్కినా తరగతులకు గైర్హాజరవుతున్నారు. తరగతులకు హాజరుకాకుండా కొందరు పరీక్ష ఫీజును చెల్లించి పరీక్షలకు హాజరౌతున్నారు.
మరికొందరైతే ఎన్రోల్మెంట్ అవుతున్నారు, తరగతులకు హాజరు కాకపోవడమే కాక, పరీక్షలు కూడా రాయకుండా డ్రాపౌట్ అవుతున్నారు. అందువల్లనే రాష్ట్రంలో ఇంటర్ ఉత్తీర్ణత శాతం అరవై శాతానికి పడిపోయింది.ఈ ఉత్తీర్ణత శాతం కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ముఖ్యంగా తరగతికి సరిగా హజరుకాని పిల్లలే అత్యధికం అనే విషయం ఇంకా చెప్పనవసరం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రజాధనంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నడుపుతుంటే పర్యవేక్షణ,తనిఖీ లోపం ఇంటర్ విద్యను మిథ్యగా మార్చేస్తున్నది. విద్యారంగంలో ఇంటర్ తరగతులు చాలా కీలకమైనవి. సంక్లిష్టమైనవి.విద్యార్థి సమగ్ర మూర్తిమత్వం, అభివృద్ధికి ఉపయోగం కూడా. అందుకే ఇంత ప్రాధాన్యత గల ఇంటర్ విద్యపై, విద్యార్థుల గైర్హాజరుపట్ల ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
- ఎన్.తిర్మల్, 9441864514



